Mamata Banerjee refuses to resign: పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్రంలో రాజ్యాంగ ప్రతిష్టంభన నెలకొంది. తాను ఓడిపోలేదని.. అందుకే రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా పత్రాన్ని సమర్పించనని మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో సుమారు 100 సీట్లను బీజేపీ అక్రమంగా దొంగిలించిందని.. ఎన్నికల సంఘం (EC), కేంద్ర ప్రభుత్వం, సీఆర్‌పీఎఫ్ సంయుక్తంగా కుట్ర పన్నాయని ఆమె మండిపడ్డారు. న్యాయవ్యవస్థ అందుబాటులో లేనప్పుడు.. ఎన్నికల సంఘం పక్షపాతంగా వ్యవహరించినప్పుడు ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుందని ఆమె విమర్శించారు. అయితే ఒక ముఖ్యమంత్రి ఓడిపోయినా పదవిలో కొనసాగడం సాధ్యమేనా అంటే.. ఖచ్చితంగా కాదనే చెబుతోంది భారత రాజ్యాంగం.
భారత ప్రజాస్వామ్యంలో ఎన్నికల ఫలితాలే అంతిమ నిర్ణేతలు. సాధారణంగా ఓడిపోయిన పార్టీ నాయకుడు గవర్నర్‌ను కలిసి రాజీనామా లేఖను అందజేయడం ఆనవాయితీ. ఒకవేళ ఏ ముఖ్యమంత్రయినా పదవి నుంచి తప్పుకోవడానికి నిరాకరిస్తే.. గవర్నర్ తనకున్న విశేషాధికారాలను ఉపయోగించి వారిని తొలగించవచ్చు. ముఖ్యమంత్రి పదవి అనేది గవర్నర్ ఆమోదం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. ఎన్నికల ఫలితాల ద్వారా ఒక ప్రభుత్వంపై ప్రజల్లో విశ్వాసం లేదని తేలిపోయినప్పుడు.. గవర్నర్ ఒక అధికారిక ఉత్తర్వు ద్వారా ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించవచ్చు.
ఒకవేళ మమతా బెనర్జీ తనకే మెజారిటీ ఉందని వాదిస్తే.. గవర్నర్ ఆమెను శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించవచ్చు. శాసన సభలో సగానికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని దీదీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఓటింగ్ ప్రక్రియలో మెజారిటీ నిరూపించుకోవడంలో విఫలమైతే ఆమె తక్షణమే తప్పుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కూడా నిరాకరిస్తే చట్టపరంగా బలవంతంగా తొలగించే అవకాశం ఉంటుంది. మెజారిటీ స్పష్టంగా ఉన్నప్పుడు గవర్నర్ కొత్తగా ఎన్నికైన పార్టీ నాయకుడిని ఆహ్వానించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారు. కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచే పాత ముఖ్యమంత్రికి ఉన్న అన్ని అధికారాలు.. పోలీసుల మీద నియంత్రణ.. రాష్ట్ర నిధులపై హక్కులు రద్దవుతాయి.
పరిస్థితి మరింత క్లిష్టంగా మారి.. రాష్ట్ర పాలన సజావుగా సాగడం లేదని భావిస్తే గవర్నర్ ఆర్టికల్ 356 ప్రకారం ‘రాష్ట్రపతి పాలన’ను సిఫార్సు చేయవచ్చు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రద్దయి.. అధికారం అంతా కేంద్రం చేతుల్లోకి వెళ్తుంది. ప్రజాస్వామ్యంలో వ్యక్తుల కంటే రాజ్యాంగమే గొప్పదని.. ప్రజల తీర్పును గౌరవించని ఏ నాయకుడూ శాశ్వతంగా పదవిలో ఉండలేరని మన చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. బెంగాల్ రాజకీయాల్లో నెలకొన్న ఈ ఉత్కంఠకు తెరపడాలంటే రాజ్యాంగబద్ధమైన ప్రక్రియే ఏకైక మార్గం.
Read Also: సీఎం పదవికి రాజీనామా చేయను.. మమత బెనర్జీ సంచలన ప్రకటన