BigTV English

Sundarbans : మారుమూల పల్లెకు ‘మండల్’ ఉచిత వైద్యం

Sundarbans : మారుమూల పల్లెకు ‘మండల్’ ఉచిత వైద్యం
Kolkata

Sundarbans : సమాజం నుంచి మనం ఎంతో పొందుతాం… అందుకు ప్రతిగా కొంచెమైనా తిరిగి ఇచ్చేయాలి. సినిమా చెప్పిన ఫిలాసఫీ కాదిది. జీవితసత్యం. ఆ సేవాతత్వానికి నిలువెత్తు రూపం ఇస్తే.. అది కచ్చితంగా డాక్టర్ అరుణోదయ్ మండల్ అనే చెప్పుకోవాలి. ఏటా ఆయన సుందర్బన్స్ ప్రాంతంలో 12 వేల మందికి ఉచిత వైద్యం అందిస్తారు. తాను పుట్టిన ఊరుకు తిరిగి ఏదో చేయాలన్న ఆయనలోని తపనకు ఇంతకన్నా నిదర్శనం అసవరమా?


నేటికీ ఆయన తన సంకల్పాన్ని త్రికరణశుద్ధిగా అచరిస్తున్నారు. ఇందుకోసం 70 ఏళ్ల వయసులోనూ వ్యయప్రయాసల కోర్చి కోల్‌కతా నుంచి 160 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తారు. రైలు, ఆటోరిక్షా, బోటు, చివరగా బైక్‌పై ప్రయాణించి గమ్యానికి చేరుకుంటారు.

వారాంతం వచ్చిందంటే చాలు.. కోల్‌కతా మహానగరం రిలాక్స్ మూడ్‌లోకి వెళ్లిపోతుంది. అందుకు భిన్నంగా డాక్టర్ మండల్ ప్రతి శనివారం సుదూర యానానికి సిద్ధమైపోతారు. నార్త్ 24 పరగణాల్లోని హింగల్‌గంజ్ చేరతారు. పశ్చిమబెంగాల్‌లోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో ఇదొకటి. ఆయన క్లినిక్ సుజన్ ఉన్నది అక్కడే.


తన కమ్యూనిటీ కోసం ఏదో ఒకటి చేయాలన్న తలంపుతో 2000లో ఆయనీ క్లినిక్ నెలకొల్పారు. అప్పటి నుంచి ఆ క్లినిక్ ద్వారా ఆయన ఉచితంగా వైద్యసేవలను అందిస్తున్నారు. 23 ఏళ్లు మండల్ క్రమం తప్పకుండా ఆచరిస్తున్నదిదే. ప్రతి శనివారం తూరుపు తెలతెలవారకుండానే ఆయన ప్రయాణం ఆరంభమవుతుంది. డమ్‌డమ్ కంటోన్మెంట్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. హస్నాబాద్‌కు రైలులో చేరుకుంటారు.

రెండు గంటల అనంతరం ఆటోరిక్షాలో 30 కిలోమీటర్ల దూరంలోని లెబుక్‌హాలి గ్రామానికి చేరతారు. ఆ తర్వాత 12 కిలోమీటర్ల దూరంలోని హింగల్‌గంజ్ చేరాలంటే బోటు ప్రయాణం తప్పనిసరి. ఆ తర్వా‌త బైక్‌పై కొద్ది పాటి దూరంలో ఉన్న సుజన్ క్లినిక్‌కు చేరడం ద్వారా ఆయన ప్రయాణం ముగుస్తుంది. అప్పటికే వందల సంఖ్యలో రోగులు అక్కడ ఆయన కోసం ఎదురుచూస్తుంటారు.

అరకొర రహదారి సౌకర్యం, పేదరికం వల్ల ఆ చుట్టుపక్కల జనంలో అత్యధికులు ఆయన క్లినిక్‌కు వస్తుంటారు. మారుమూల ప్రాంతంలో ఉచిత క్లినిక్‌కు ఏర్పాటు చేయడానికి కారణాలను ఆయనే వివరించారు. ‘నేను పెరిగింది ఇక్కడే. ఈ ప్రాంతం నాకు పుట్టిల్లులాంటిది. ఇక్కడి జనం వైద్యుడి దగ్గరకు వెళ్లేందుకు పడిన, పడుతున్న కష్టాలు నాకు ఎరుకే. మా తాత హోమియోపతి వైద్యుడు. రోగులకు ఉచితంగానే మందులు ఇచ్చేవారు. ఇవన్నీ చూస్తూ పెరిగాను. ఆ స్ఫూర్తితోనే సేవలందిస్తున్నా’ అని డాక్టర్ మండల్ చెప్పారు.

వారాంతంలో మాత్రమే మండల్ వైద్య సేవలు అందిస్తున్నా.. మండల్ బృందంలోని 8 మంది మాత్రం ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. సొంత నిధులతో జనఔషధి కేంద్రాల నుంచి మందులను కొనుగోలు చేసి మరీ ఉచితంగా అందిస్తారు మండల్. ఆ క్లినిక్‌ను త్వరలోనే 16 పడకల ఆస్పత్రిగా తీర్చిదిద్దనున్నారు. ఏటా పాముకాటుకు 30 మంది బలవుతున్నారని మండల్ చెప్పారు. అందుకే పాముకాటు కేసుల కోసం ప్రత్యేకించి నాలుగు బెడ్లను కేటాయిస్తామన్నారు. మారుమూల గ్రామాల్లో ఆయన అందిస్తున్న వైద్యసేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వ 2020లో పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది.

Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×