BigTV English

Modi In Parliament: బుల్లెట్ కి బుల్లెట్టే సమాధానం.. పాక్ కి గట్టి గుణపాఠం నేర్పామన్న మోదీ

Modi In Parliament: బుల్లెట్ కి బుల్లెట్టే సమాధానం.. పాక్ కి గట్టి గుణపాఠం నేర్పామన్న మోదీ

ఆపరేషన్ సిందూర్ పై లోక్ సభలో వాడివేడి చర్చ జరిగింది. అదే సమయంలో ఆపరేషన్ మహదేవ్ ప్రస్తావన కూడా వచ్చింది. మొత్తమ్మీద పహల్గాం దాడి, భారత సైన్యం ప్రతిదాడి, తాజాగా దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఏరివేత నేపథ్యంలో ప్రధాని మోదీ లోక్ సభలో గంభీరంగా ప్రసంగించారు. బుల్లెట్ కి బుల్లెట్ తోనే సమాధానం చెబుతామని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీవాన్స్ కి స్పష్టం చేశామని, అది చేసి చూపించామని అన్నారు. భారత్-పాక్ మధ్య యుద్ధం ఆగిపోవడంలో అమెరికా పాత్ర లేదని మరోసారి స్పష్టం చేశారు మోదీ. పాక్‌ మిలట్రీ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్(DGM) అర్ధరాత్రి ఫోన్‌ చేసి దాడులు ఆపాలని బతిమాలితేనే ఆపరేషన్‌ సిందూర్‌ నిలిపివేశామని అన్నారాయన.


విజయోత్సవాలు..
ఆపరేషన్ సిందూర్ విజయంతో భారత సేనల శౌర్య ప్రతాపాలు ప్రపంచానికి తెలిసొచ్చాయని అన్నారు ప్రధాని మోదీ. ఉగ్రవాదులను మట్టిలో కలిపినందుకు 140 కోట్ల మంది భారతీయులు ఐక్యంగా విజయోత్సవాలు చేసుకుంటున్నామని చెప్పారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో, ఆ తర్వాత విపక్షాల విమర్శలను ఆయన తిప్పికొట్టారు. స్వార్థ రాజకీయాల కోసం సైనికుల పరాక్రమాలను తక్కువ చేసి చూడటం సరికాదన్నారు. అలా చేస్తే సైన్యం మనోధైర్యం దెబ్బతింటుందని, మీడియా హెడ్‌లైన్లలో వచ్చేందుకు కొందరు నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు మోదీ. అలాంటి వారు మీడియా హెడ్ లైన్లలో ఉండొచ్చేమో కానీ, ప్రజల మనసుల్ని మాత్రం గెలవలేరన్నారు. గతంలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ విషయంలోనూ ప్రతిపక్షాలు ఇలాగే విమర్శించాయని, వారి తీరు చూసి దేశమంతా నవ్వుకుంటోందని అన్నారు. భారత రక్షణ దళాలకు తాము పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని, వారి శక్తి, సామర్థ్యాలపై తమ ప్రభుత్వానికి పూర్తి విశ్వాసం ఉందని చెప్పారాయన. ఆపరేషన్ సిందూర్‌ సమయంలో తనపై నమ్మకం ఉంచినందుకు దేశ ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు మోదీ.

ట్రంప్ పాత్ర ఏంటి?
ఆపరేషన్ సిందూర్ ఆగిపోవడంలో అమెరికా పాత్ర ఉందని, పెద్దన్నగా తానే భారత్-పాక్ మధ్య రాజీ కుదిర్చానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్పుకున్నారు. ఇదే పాయింట్ పై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండించే దమ్ము మోదీకి ఉందా అని ప్రశ్నించారాయన. మోదీ మాత్రం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తనతో మాట్లాడిన విషయాన్ని ప్రస్తావించారు. ఆపరేషన్‌ సిందూర్‌ ని అర్థాంతరంగా ఆపేయాలని ప్రపంచంలో ఏ దేశాధినేత భారత్ కు చెప్పలేదని అన్నారు మోదీ. మే 9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ తనతో మాట్లాడారని, పాక్‌ భారీ మూల్యం చెల్లించుకుంటుందని తాను ఆయనకు స్పష్టం చేశానని వివరించారు. బుల్లెట్‌కు బుల్లెట్‌తోనే సమాధానం చెప్తామని, పాకిస్తాన్ కు ఎవరు సహాయం చేసినా.. చూస్తూ ఊరుకునేది లేదని వాన్స్ తో తాను అన్నట్టుగా చెప్పారు మోదీ. ఆపరేషన్ సిందూర్ తో పాకిస్తాన్ కి చిరకాలం గుర్తుండిపోయేలా సమాధానమిచ్చామన్నారు. దాడులు ఆపాలంటూ చివరకు పాక్ కాళ్లబేరానికి వచ్చిందన్నారు. పాక్‌ డీజీఎం అర్ధరాత్రి ఫోన్‌ చేసి బతిమిలాడుకున్నారని, అందుకే తాము ఆపరేషన్‌ సిందూర్‌ ని నిలిపివేశామని చెప్పారు మోదీ.

ఏమేం చేశామంటే..?
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాక్‌ భూభాగంలోకి వెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశామన్నారు ప్రధాని మోదీ. పాక్‌ ఎయిర్‌ బేస్‌లు ఇప్పటికీ ఐసీయూలో ఉన్నాయని చమత్కరించారు. అణుబాంబులు వేస్తామనే బెదిరింపులు చెల్లవని పాక్‌ను గట్టిగా హెచ్చరించామన్నారు. ప్రపంచ దేశాలేవీ పాక్ ని సమర్థించలేదని, 193 దేశాల్లో కేవలం 3 దేశాలే వారికి అండగా నిలిచాయన్నారు. మిగతా 190 దేశాలు ఆపరేషన్ సిందూర్‌ని సమర్థించాయని, భారత్ కి నైతిక మద్దతునిచ్చాయని వివరించారు. పాకిస్తాన్ మళ్లీ తోకజాడిస్తే ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని లోక్ సభ వేదికగా వార్నింగ్ ఇచ్చారు మోదీ. ఇక ఆపరేషన్ మహదేవ్ తో ఉగ్రవాదుల్ని ఏరివేస్తున్నట్టు స్పష్టం చేశారు.

Related News

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Big Stories

×