
Nasa Laser : రోదసి కమ్యూనికేషన్లలో నాసా మరో కీలక మైలురాయిని అధిగమించింది. చంద్రుడి కన్నా సుదూరాలకు, అత్యంత వేగంగా డేటాను పంపడమే కాదు.. అక్కడి నుంచి సమాచారాన్ని కూడా స్వీకరించగలిగింది.
డీప్ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్స్(DSOC-డీశాక్) ప్రాజెక్టు ద్వారా ఇది సాధ్యమైంది.
ఇందులో భాగంగా లేజర్ కాంతి సాయంతో 16 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైకీ స్పేస్ క్రాఫ్ట్‌కి జరిపిన సమాచార బట్వాడా విజయవంతమైంది. భూమి నుంచి చంద్రుడి దూరంతో పోలిస్తే ఇది 40 రెట్లు. ప్రస్తుతం స్పేస్‌క్రాఫ్ట్ కమ్యూనికేషన్ల కోసం రేడియో తరంగాలను వినియోగిస్తున్నారు. ఈ పద్ధతి కన్నా లేజర్ విధానంలో డేటా బదిలీ 10 నుంచి 100 రెట్ల వేగంతో జరుగుతుంది. అంటే సెకనుకు 1.2 గిగాబిట్ల వేగంతో సమాచార మార్పిడి జరుగుతుందన్నమాట.
రాన్రాను అంతరిక్ష పరిశోధనలు ముమ్మరం కావడంతో పాటు పెద్ద మొత్తాల్లో డేటా బట్వాడా అనివార్యమవుతోంది. అందుకే లేజర్ ఆధారిత కమ్యూనికేషన్లపై నాసా దృష్టి సారించింది. వాస్తవానికి లేజర్ ఆధారిత కమ్యూనికేషన్ టెక్నాలజీ కొత్తదేం కాదు. లో-ఎర్త్ ఆర్బిట్ నుంచి జాబిల్లిపైకి ఆప్టికల్ కమ్యూనికేషన్లను గతంలోనూ పరీక్షించారు. అయితే డీప్ స్పేస్ కమ్యూనికేషన్లలో డీశాక్ తరహా ప్రాజెక్టును చేపపట్టడం ఇదే తొలిసారి.
టెస్ట్ డేటా ఎన్‌కోడ్ చేసిన లేజర్ కాంతి పుంజాన్ని ఈ నెల 14న కాలిఫోర్నియా శాన్‌డియాగోలోని కాల్‌టెక్ పలోమార్ అబ్జర్వేటరీలోని హేల్ టెలిస్కోప్ నుంచి పంపారు. 16 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సైకీ స్పేస్ఋక్రాఫ్ట్‌లోని లేజర్ ట్రాన్సీవర్ ఆ డేటాను రిసీవ్ చేసుకుంది. ‘హలో’ అంటూ అక్కడ నుంచి తిరిగి భూమికి బదులు కూడా ఇచ్చింది.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో హై-బ్యాండ్‌విడ్త్ డేటా ట్రాన్సిమిషన్‌లో ముందడుగు పడినట్టయింది. భవిష్యత్తులో చేపట్టే అంతరిక్ష మిషన్లకు ఇది అత్యంత కీలకం కానుంది. సైకీ ట్రాన్సీవర్-గ్రౌండ్ స్టేషన్లను అనుసంధానించిన ఆటోమేటెడ్ సిస్టమ్స్ వల్ల డేటా బట్వాడా వేగంగా, విజయవంతంగా జరిగింది.
డీశాక్ ప్రాజెక్టు భవిష్యత్తు ప్రయోగాలకు మైలురాయిలా నిలవనుంది. అంగారక గ్రహంపైకి మానవులను పంపేందుకు నాసా సిద్ధమైంది. అక్కడికి వెళ్లే వ్యోమగాములకు అత్యధిక వేగంతో డేటాను బదిలీ చేయడం డీశాక్ ప్రాజెక్టు ద్వారా సాధ్యమవుతుంది.