
Barkas : హైదరాబాద్‌లోని బార్కస్ అనే ప్రాంతం పేరు మీరు వినే ఉంటారు. దీని అసలు పేరు ‘బ్యారక్స్’. నిజాం కాలంలో వారి సైన్యంలో భాగంగా ఉన్న అరబ్బు సైన్యపు కేంద్రం, సైనికులు కుటుంబాలు అక్కడ నివాసముండేవి. ఇదే పేరు కాలక్రమంలో బార్కస్ అయింది. ఈ ప్రాంతాన్ని మినీ అరేబియా అంటారు.
నైజాం సొంత సైన్యంలో మెజారిటీ వాటా వీరిదే. దీనినే అరబ్ రెజిమెంట్ అనేవారు. ఇక్కడి అరబ్బులు రెండున్నర శతాబ్దాల నాడు యెమన్ నుంచి వలస వచ్చారు. నిజానికి వీరంతా యెమన్‍లోని హద్రామీస్ అనే ప్రాంతం నుంచి వలస వచ్చారు. అందుకే వీరిని ‘హద్రామీస్’ అంటారు.
యెమన్ నుంచి వీరంతా సముద్రమార్గాన గుజరాత్‍లోని అహమ్మదాబాద్, బరోడా, సూరత్, బొంబాయి, గోవా, కేరళ వంటి ప్రాంతాలకు వలస వచ్చారు. వీరు కేరళ నుంచి మసాలా దినుసులను గల్ఫ్ దేశాలకు ఎగుమతి చేసి బాగా ఆర్జించారు. ఇక్కడి దళిత, శూద్ర స్త్రీలను వివాహమాడారు. వీరికి పుట్టిన వారినే మోప్లాలు అన్నారు.
ఇలా వచ్చిన వారిలో కొందరు అచ్చంగా.. కేరళలో ఇస్లాం విస్తరణకై పనిచేసారు. ఇలా.. అరబ్బులు ఆయా ప్రాంతాల్లో స్థిరపడ్డారు. వీరిలో కొందరు హైదరాబాద్ నిజాం సైన్యంలో చేరారు. వీరిని ఇక్కడి జనం ‘విలాయితీలు’ అని పిలిచేవారు. ఇక.. వీరిలో సైన్యంలో చిన్న కొలువుల్లో ఉన్నవారిని, మందిరాలకు కాపలాగా ఉండేవారిని ‘చావూష్’లు అనేవారు.
నిజాం ప్రైవేటు సైన్యంగా ఉన్న వీరికి ప్రత్యేక అధికారాలుండేవి. నైజాం చట్టాలు వీరికి వర్తించవు. ఎల్లప్పుడూ ఆయుధాన్ని ధరించే హక్కు వీరికి ఉండేది. వీరంతా ‘జంబియా’’ అనే మెలికలు తిరిగిన కత్తిని వీపుకు కట్టుకుతిరిగేవారు.
పేదలకు అప్పులిచ్చి చక్రవడ్డీలు వేసి అనతికాలంలోనే గొప్ప సంపన్నులయ్యారు. నెలనెలా మిత్తీ(వడ్డీ) కట్టని వారిని సొంత జైళ్లలో బంధించినా.. నిజాం పోలీసులు అందులో జోక్యం చేసుకునేవారు కాదు.వీరిలో ఎంత సంపన్నులుండేవారంటే.. ఆరవ నిజాం తొలిసారి రైలు మార్గం నిర్మిస్తున్న వేళ.. నిజాంకు ఏకంగా ఒక వ్యాపారి 70 లక్షల రూపాయల అప్పు
తియ్యటి జామ పండ్లకు బార్కస్ ప్రసిద్ధి. అలాగే ఇక్కడి తీయని మురబ్బాల రుచి మాటల్లో చెప్పలేము. ఇక్కడి వేడివేడి హరీస్, పుదీనా వాసనతో మైమరపించే వేడివేడి ‘ఝావా’ గుర్తుకొస్తేనే నోట్లో నీళ్లూరాల్సిందే.
ఇక్కడ నేటికీ పచ్చ కామెర్లకు మందును ఉచితంగా అందిస్తారు. ఇది మూడు రోజుల వైద్యం. తొలిరోజు.. పాలలో పసరు కలిపి తాగిస్తారు. ఆ రోజంతా ఉప్పు, చక్కెర కలపని పాల అన్నం తినాలి. రెండోరోజు మటన్ బిర్యానీ లేదా వెజ్ బిర్యానీ తినమని చెబుతారు. చివరి రోజు మళ్లీ పాల అన్నమే ఆహారం. మహమ్మద్ ప్రవక్త వంశీకులు ఈ మందునిస్తారు.