 
					Chandrababu CRDA Review: రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఎటువంటి జాప్యం లేకుండా, నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను స్పష్టం చేశారు. శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో రాజధాని నిర్మాణ పనుల పురోగతి, సుందరీకరణ, రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ వంటి కీలక అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా, ఏయే నిర్మాణ పనులు ఎంతవరకు పూర్తయ్యాయి, అందుబాటులో ఉన్న వర్క్ ఫోర్స్, నిర్మాణాలకు అవసరమైన మెటీరియల్, మెషినరీ వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. “ఏయే భవనాలను ఎప్పటిలోగా పూర్తి చేయాలో నిర్దిష్ట సమయాన్ని నిర్దేశించుకున్నాం. ఆ మేరకు పనులను పూర్తి చేయాల్సిందే” అని సీఎం స్పష్టం చేశారు. నిర్మాణాల్లో వేగంతో పాటు నాణ్యత ప్రమాణాలను పక్కాగా పాటించాలని ఆదేశించారు. పనుల పురోగతిపై ప్రతి 15 రోజులకు ఒకసారి తాను స్వయంగా సమీక్షిస్తానని ఆయన తెలిపారు.
వర్షాల కారణంగా నిర్మాణ పనుల్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే అయినా, రానున్న రోజుల్లో ఆ లోటును భర్తీ చేసేలా నిర్మాణాల్లో వేగం పెంచాలని చంద్రబాబు సూచించారు. కొన్ని నిర్మాణ సంస్థలు ఇంకా వర్క్ ఫోర్స్, మెషీనరీని పూర్తి స్థాయిలో కేటాయించలేదని, అటువంటి సంస్థలు తమ పనితీరును తక్షణమే మెరుగుపరుచుకోవాలని హెచ్చరించారు. రాజధాని భవనాల నిర్మాణాలకు అవసరమైన గ్రావెల్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా గనుల శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.
READ ALSO: Hunting For Diamonds: వాగు పొంగితే వజ్రాలు వస్తాయి.. వేటలో అక్కడి ప్రజలు, ఏపీలో ఎక్కడ?
రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎంతవరకు పూర్తైందని సీఎం ఆరా తీశారు. ఈ విషయంలో రైతులకు ఏ మాత్రం ఇబ్బందులు రానివ్వొద్దని మంత్రి నారాయణ, అధికారులను సీఎం ఆదేశించారు. దీనిపై అధికారులు స్పందిస్తూ, ఇంకా 2,471 మంది రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేయాల్సి ఉందని, చిన్నపాటి సాంకేతిక మరియు రైతుల వ్యక్తిగత అంశాల కారణంగా ఇవి పెండింగులో ఉన్నాయని ముఖ్యమంత్రికి తెలిపారు. తాను కూడా త్వరలోనే రాజధాని రైతులతో సమావేశమవుతానని ముఖ్యమంత్రి వెల్లడించారు.
రాజధానిలో నిర్మాణాలకు ఎంతటి ప్రాధాన్యమిస్తున్నామో, గ్రీనరీ, సుందరీకరణ, పరిశుభ్రతకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం స్పష్టం చేశారు. గార్డెనింగ్, బ్యూటిఫికేషన్ వంటి వాటిల్లో ఎలాంటి రాజీపడొద్దని సూచించారు. అమరావతికి ‘వరల్డ్ క్లాస్ సిటీ లుక్’ రావాలంటే హైరెయిజ్ బిల్డింగులు ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ సంస్థలు చేపట్టే నిర్మాణాలు కూడా ఐకానిక్ మోడల్‌లో ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ, సీఆర్డీఏ, ఏడీసీఎల్, ఆర్థిక శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, వివిధ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.