ఎసిడిటీ తగ్గడానికి మీరు ఈనో వాడతారా? ఇటీవల కాలంలో ఈనో వాడినా కూడా మీకు ఫలితం కనపడలేదా? గ్యాస్ట్రిక్ సమస్య ఎక్కువైంది అని సరిపెట్టుకున్నారా? అయితే కచ్చితంగా అది మీ సమస్య కాదు, మీరు వాడిన ప్రోడక్ట్ నకిలీది అయి ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో నకిలీ ఈనో ప్యాకెట్లు కుప్పలు తెప్పలుగా వచ్చేశాయి. దాదాపు లక్ష నకిలీ ఈనో ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో లక్ష తయారీకి సరిపడా ముడిపదార్థాన్ని, కవర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో.. ఇకపై మీరు ఈనో ప్యాకెట్ కొనే సమయంలో అది నకిలీదో అసలుదో ఓసారి చెక్ చేసుకోండి
ఏది నకిలీ? ఏది అసలు?
కాదేదీ నకిలీకనర్హం. పాల ప్యాకెట్ నుంచి పౌడర్ డబ్బా వరకు అన్నిటికీ ఫేక్ ప్రోడక్ట్ లు పుట్టుకొచ్చేస్తున్నాయి. అచ్చం అసలు వాటిలాగే తళతళలాడిపోయే కవర్లలో దర్శనమిస్తున్నాయి. తాజాగా గుట్టు రట్టయిన ఈనో వ్యవహారం కూడా ఇలానే ఉంది. అసలు కంటే నకిలీ కవర్లే మెరిసిపోయేలా కనపడుతున్నాయి. అసలు వాటికంటే ఇవే తళతళలాడిపోతున్నాయి. సరిగ్గా ఈ పాయింట్ తోనే అసలు, నకిలీ తెలిసిపోతుందని అంటున్నారు నిపుణులు. ఈనో ప్యాకెట్ ఒరిజినల్ క్వాలిటీ డీసెంట్ గా ఉంటుంది. నకిలీ ప్యాకెట్ జిగేల్ మంటూ కనపడుతుంది.
ఏమేం వాడతారు..?
అసలు ఈనో ప్యాకెట్ లో స్వర్జిక్సార, నింబుకమలం అనే పదార్థాల మిశ్రమం ఉంటుంది. ఇది కడుపులోని ఆమ్లత్వాన్ని తగ్గిస్తూ గ్యాస్టిక్ సమస్య నుంచి ఉపశమనం ఇస్తుంది. కెమికల్ ఫార్ములా ప్రకారం చెప్పుకోవాలంటే సోడియం బైకార్బోనేట్, సిట్రిక్ ఆమ్లం, సోడియం కార్బోనేట్ ల మిశ్రమం ఈనోలో ఉంటుంది. నకిలీ ఈనోలో ఇవేవీ ఉండవు. కాస్త క్షార గుణం కలిగిన చీప్ క్వాలిటీ రసాయనాల మిశ్రమం అది. అది వాడితే ఉపశమనం కలుగకపోగా లేనిపోని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి.
బ్యాచ్ నెంబర్, ప్రింటింగ్ సరి చూసుకోండి..
నకిలీ ఈనో ప్యాకెట్లపైన ధరను సరిగ్గా ముద్రించరు, బ్యాచ్ నెంబర్లు, ఎక్స్ పైరీ డేట్ లాంటివి కూడా సరిగా కనపడవు. వాటినిబట్టి నకిలీలను ఈజీగా గుర్తించవచ్చు. ఈనో లోగో కూడా కాస్త మసక మసకగా కనపడుతుంది. కవర్ మాత్రం తళతళలాడేలా ఉంటుంది. లోపల ఉన్న పదార్థంతోపాటు, పైన కవర్ కూడా నకిలీదే కావడంతో దాన్ని ఈజీగా గుర్తించవచ్చని చెబుతున్నారు నిపుణులు. సమస్యను తగ్గించుకోడానికి ఈనో వాడితే, నకిలీ ప్రోడక్ట్స్ తో కొత్త సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
Also Read: ఫేక్ ఫెలోస్ అంటూ మండిపడ్డ సీఎం.. ఏపీలో మొంథా రాజకీయం
ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇబ్రహీంపూర్ ప్రాంతంలోని ఈ నకిలీ ఈనో యూనిట్ గుట్టు రట్టు చేశారు. అక్కడ ఒక పెద్ద ఫ్యాక్టరీయే నడుపుతున్నట్టు గుర్తించారు. నకిలీ యాంటాసిడ్ పౌడర్, ఇతర ముడి పదార్థాలను సీజ్ చేశారు. సందీప్ జైన్, జితేంద్ర అనే ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే వీరిద్దరితోపాటు ఈ దందా వెనక చాలామంది ఉండే ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. నకిలీ మాఫియాని అరికట్టేందుకు పూర్తి స్థాయిలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: కర్నూలు బస్సు ప్రమాదంలో మూడో వాహనం ప్రమేయం..