Big Stories

Vijay Thalapathy: ద్రవిడ రాజకీయాన్ని విజయ్ తిరగరాయగలడా..? తమిళ రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి..?

Vijay Thalapathy Politics : మరో రెండేళ్లలో తమిళనాట అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ప్రముఖ తమిళ నటుడు విజయ్ నిన్న చేసిన రాజకీయ ప్రకటన పెను సంచలనం సృష్టించింది. విజరు పరామర్శించారు. విజరు మక్కల్‌ ఇయకం ఇప్పటికే తమిళనాడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసింది. ఈ సంఘం ఆధ్వర్యాన రాష్ట్రంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

తమిళ రాజకీయాల్లో మరోసారి సంచలన మార్పులు రాబోతున్నాయి. సుమారు 50 ఏళ్లుగా ద్రవిడ రాజకీయం పేరుతో అక్కడ పాలన చేస్తున్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల ఆధిపత్యానికి గండి కొట్టేందుకు ఇప్పటికే ప్రయత్నిస్తు్న్న కాంగ్రెస్, జేపీ, కమలహాసన్‌లకు తోడు.. మరోపార్టీ రానుంది. ప్రముఖ తమిళ యువనటుడు విజయ్ నిన్న చేసిన పార్టీ ప్రకటనతో ఇకపై తమిళనాట కొత్త రాజకీయాలను చూడబోతున్నాం.

- Advertisement -

నిజానికి ద్రవిడ రాజకీయానికి, సినిమాకు అవినాభావ సంబంధం అనాదిగా కొనసాగుతూనే ఉంది. సినిమా రచయిత కరుణానిధి, ఆయన మిత్రుడు, ప్రత్యర్థి ఎంజీఆర్, ఆ తర్వాత సినీ నటి జయలలిత తమిళ సీఎంలుగా గద్దెనెక్కగా, మరెందరో సినీ నటులు కీలక పదవులను అధిష్టించగలిగారు. అంతేకాదు.. తమిళనాట సినీ నటులు రాజకీయాల్లో రాణించిన తర్వాతే.. తెలుగునాట ఎన్టీఆర్ సీఎం అయ్యారు.

దక్షిణాదిన జీవించే వారే మూలభారతీయులనీ, వీరు ఆర్యుల కంటే ప్రాచీనులనీ, ద్రవిడ సంస్కృతే నిజమైన భారతీయ సంస్కృతి అని, మనమంతా ఆ ఘనమైన సంస్కృతికి వారసులుగా గర్వపడాలని చెబుతూ నాడు పెరియార్ ద్రవిడ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమంలో మరొక నేత అన్నాదొరై కీలక పాత్ర పోషించారు. కొన్ని సినిమాల్లో నటించటమే గాక మాటల రచయితగానూ పనిచేశారు. జనంలో బలమైన ద్రవిడ భావన తీసుకొచ్చేందుకు అన్నాదొరై సినిమాను బలమైన మాధ్యమంగా గుర్తించి వాడుకొని, డీఎంకే పార్టీని స్థాపించి, తర్వాతి రోజుల్లో సీఎం కాగలిగారు.

ఆ ఉద్యమంలో అప్పటికి సినీ మాటల రచయితగా ఉన్న కరుణానిధి, సినీ నటుడిగా ఉన్న ఎంజీ రామచంద్రన్ తదితరులు.. అన్నాదొరైకు అండగా నిలిచారు. వీరిలో కరుణానిధి తన పదునైన సినిమా డైలాగులతో, రామచంద్రన్ తన నటనతో తమిళుల మనసును గెలుచుకోగలిగారు. 1972లో అన్నాదురై మరణం తర్వాత డీఎంకే తరపున సీఎం అయిన కరుణానిధి.. మరో నాలుగు సార్లు ఆ పదవిని అధిష్టించారు.

మిత్రుడైన కరుణానిధి తొలిసారి సీఎంగా ఉన్నకాలంలో ఆయనతో వచ్చిన రాజకీయ విరోధాల వల్ల డీఎంకేలో ఇమడలేకపోయిన ఎంజీ రామచంద్రన్.. అన్నాడీఎంకే పేరుతో కొత్త పార్టీ పెట్టుకున్నారు. 1977 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన 1987 వరకు సీఎంగా కొనసాగారు. ఆయన మరణం తర్వాత ఈయన రాజకీయ వారసురాలిగా వచ్చిన జయలలిత 4 సార్లు సీఎంగా రాణించారు.

తర్వాత ప్రముఖ నటుడు కమలహాసన్ 2018లో ‘మక్కల్ నీది మైయం’ అనే రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయ అరంగేట్రం చేసినా పెద్దగా రాణించలేకపోయారు. కరుణానిధి, జయలలిత మరణం తర్వాత తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేసేందుకు బీజేపీ చురుగ్గా పనిచేస్తోంది. కొత్త పార్లమెంటులో సెంగోల్ ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలతో తన ఓటు బ్యాంకును పెంచుకునే ప్రయత్నాలు చేస్తోంది.

ఇదే సమయంలో 2023 చివరిలో యువ నటుడు విజయ్ తన రాజకీయ ప్రవేశం గురించి హింట్ ఇవ్వటం, చెప్పినట్లుగానే నిన్న ‘తమిళగ వెట్రి కళగం’ పార్టీని ప్రకటించి రాజకీయ సంచలనం సృష్టించారు. నేటి అవినీతి, విభజనపూరిత పాలనకు వ్యతిరేకంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయనని, 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే తన లక్ష్యమని ప్రకటించారు. లోక్​సభ ఎన్నికల తర్వాత పార్టీ జెండా, విధివిధానాలు ప్రకటిస్తామని చెప్పారు.

ప్రతిజిల్లాలో పదో తరగతి, ఇంటర్‌లో మంచి మార్కులు సాధించి, 1,2,3 ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ప్రోత్సాహకాలను అందించటం, 2018 నాటి తూత్తుకుడి పోలీసు కాల్పుల్లో మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శిచటం వంటి సేవాకార్యక్రమాలతో జనంలోకి పోతున్న విజయ్ తాజా రాజకీయ ప్రకటనతో తమిళ నాట కొత్త సమీకరణాలు తెరమీదకొస్తు్న్నాయి.

234 ఎమ్మెల్యేలున్న ప్రస్తుత తమిళనాడు అసెంబ్లీలో డీఎంకేకు 132 మంది, అన్నాడీఎంకేకు 62 మంది, కాంగ్రెస్‌కు 18, బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలున్నారు. వీరిలో కాంగ్రెస్, వామపక్షాలు అధికార డీఎంకేకు మద్దతుగా నిలుస్తుండగా, బీజేపీ అన్నాడీఎంకేలు ఒక జట్టుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఈ రెండు కూటములకు ప్రత్యామ్నాయంగా తన కొత్త పార్టీ నిలవాలని, అందుకే ఈ రెండు కూటములకు దూరంగా ఉండాలని విజయ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

చదువుకున్న మహిళా అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తాననీ, తమ పార్టీలోకి వచ్చేవారికి నేర చరిత్ర, అవినీతి మరకలు ఉండకూడదని ఆయన చెబుతున్నారు. తన పార్టీలో సినిమా నటులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండదనీ ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనా.. ఒక బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా నిలవాటంటే విజయ్.. రెండు జాతీయ పార్టీలతో, మరో రెండు పాతుకుపోయిన ప్రాంతీయ పార్టీలతో ఢీకొట్టాల్సి ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News