NPPA on Medicines: ఆసుపత్రికి వెళ్లినపుడు చికిత్స కన్నా ఎక్కువగా మందుల ఖర్చే సామాన్యులను వేధిస్తోంది. డాక్టర్లు సూచించే ప్రిస్క్రిప్షన్ మందుల ధరలు రోజురోజుకు పెరుగుతూ, మధ్యతరగతి, పేదవర్గాలకు తీవ్రమైన ఆర్థిక భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని, నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ ప్రజలు తరచూ వాడే అత్యవసర మందులపై ధరల నియంత్రణను విధించింది. ఈ చర్య వలన లక్షలాది మంది రోగులకు ఆర్థికంగా ఊరట కలగనుంది.
రసాయనాల మంత్రిత్వ శాఖ ప్రకటించిన ప్రకారం, ఈ కొత్త ధరల వల్ల ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే లక్షలాది మంది ప్రజలకు పెద్ద ఊరట లభించనుంది. తరచుగా వాడే ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లు అయిన యాసిలోఫెనాక్, పారాసిటమాల్, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ కలయిక, అమాక్సిసిల్లిన్, పోటాషియం క్లావ్యులానేట్, అటోవాస్టాటిన్ మిశ్రమాలు, అలాగే తాజా షుగర్ మందులైన ఎమ్పాగ్లిఫ్లోజిన్, సిటాగ్లిప్టిన్, మెటఫార్మిన్ వంటి ఔషధాలపై ఈ తగ్గింపు వర్తించనుంది.
డా. రెడ్డీస్ ల్యాబ్ విక్రయిస్తున్న యాసిలోఫెనాక్, పారాసిటమాల్, ట్రిప్సిన్ కైమోట్రిప్సిన్ టాబ్లెట్ ధర ఇప్పుడు రూ.13గా నిర్ణయించబడింది. ఇదే ఫార్ములేషన్ క్యాడిలా ఫార్మాస్యూటికల్స్ ద్వారా రూ.15.01కి విక్రయించబడుతోంది. అటోవాస్టాటిన్ 40mg, క్లొపిడోగ్రెల్ 75mg కలయిక టాబ్లెట్ ధర రూ.25.61గా నిర్ణయించబడింది. కార్డియాక్, షుగర్, పేగు వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ఈ మందులు ఇప్పుడు సామాన్యులకు అందుబాటులోకి రానున్నాయి.
ఇతర ముఖ్యమైన ఔషధాల్లో డిక్లోఫెనాక్ ఇంజెక్షన్ ధరను ప్రతి మిల్లీ లీటర్‌కు రూ.31.77గా నిర్ణయించారు. శిశువులలో విరేచనాలు, జ్వరం, ఇన్ఫెక్షన్లకు ఉపయోగించే సెఫిక్సీమ్, పారాసిటమాల్ సస్పెన్షన్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. విటమిన్ డి కోసం వాడే చోలెకాల్సిఫెరోల్ డ్రాప్స్ ధర కూడా ఇప్పుడు తగ్గించబడింది.
నిబంధన ఉల్లంఘించితే కఠిన నిబంధనలు
ఈ ధరల ప్రకటనతో పాటు ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఆదేశాన్ని కూడా జారీ చేసింది. దేశంలోని అన్ని ఔషధ రిటైలర్లు, డీలర్లు తమ షాప్‌లలో ఈ తాజా ధరల జాబితాను స్పష్టంగా ప్రదర్శించాల్సి ఉంటుంది. దీని ఉల్లంఘన జరిగితే, 1955 నాటి ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం, 2013 నాటి డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్ ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. గరిష్ట ధరలకు మించిన విక్రయాలు జరిగితే వాటిని వడ్డీతో కలిపి తిరిగి వసూలు చేసే అధికారం NPPAకి ఉంది.
నో జీఎస్టీ
GSTను ఈ ధరలలో కలపలేదు. అవసరమైతే అదనంగా వసూలు చేయవచ్చు. తయారీదారులు కొత్త ధరల వివరాలను ఫార్మ్ V రూపంలో “ఇంటిగ్రేటెడ్ ఫార్మాస్యూటికల్ డేటాబేస్ మేనేజ్‌మెంట్ సిస్టమ్”లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, రాష్ట్ర డ్రగ్ కంట్రోలర్లకు, NPPAకి కూడా ఈ వివరాలను పంపించాలి.
ఇంతవరకు ఉన్న ధరల ఆదేశాలు ఈ కొత్త ఆదేశంతో రద్దు అయ్యాయి. అందువల్ల అన్ని తయారీదారులు, డీలర్లు, రిటైలర్లు ఈ తాజా ధరల ప్రకటనకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
ఈ చర్యలు వల్ల మందుల ధరలపై నియంత్రణ మరింత బలపడుతుంది. సామాన్య ప్రజలకు చికిత్సల ఖర్చు కొంత మేర తగ్గి, ఆరోగ్య పరిరక్షణ మరింత అందుబాటులోకి రానుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి కుటుంబాలకు ఇది కొంత ఆర్థిక ఊరటను కలిగించనుంది.