Run For Organ Donation: అవయవ దానం.. మరణాంతరం మరో ప్రాణికి ఒక ప్రాణం పోయడమే. అందుకే చాలామంది చనిపోయిన తర్వాత తమ అవయవాలను దానం చేయడానికి ముందుకు వస్తున్నారు. అయితే ఇప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే అవయవ దానం చేయడానికి సాధ్యపడుతుంది.. అందులో భాగంగానే ‘రన్ ఫర్ ఆర్గాన్ డొనేషన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లోని సంజీవయ్య పార్క్ వద్ద ఆదివారం ఉదయం తెలంగాణ 10కే రన్ ఫర్ ఆర్గాన్ డొనేషన్ 3వ ఎడిషన్ అత్యంత ఉత్సాహభరితంగా జరిగింది. మోహన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్లోబల్ ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిప్పాన్ ఎక్స్ప్రెస్ సంయుక్తంగా 5కే, 10కే విభాగాలలో జరిగిన ఈ రన్ లో 2000 మందికిపైగా రన్నర్స్ అలాగే సాధారణ పౌరులు పాలుపంచుకున్నారు.
ప్రపంచ అవయవదాన దినోత్సవం సందర్భంగా అవయవ దానం గురించి ప్రజలలో అవగాహన కల్పించేందుకు గానూ ఈ రన్ నిర్వహించారు. ఇకపోతే ఈ రన్ ను బ్యాంక్ ఆఫ్ ఇండియా సౌత్ జనరల్ మేనేజర్ మనోజ్ కుమార్ శ్రీ వాస్తవ, మోహన్ ఫౌండేషన్ సీఈవో రఘురాం లు జెండా ఊపి ప్రారంభించగా ముఖ్యఅతిథిగా హాజరైన పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ విజేతలకు మెడల్స్ అందించారు. మనిషి జీవితం తర్వాత మరో జీవితం ఇవ్వగల అవయవ దానం పట్ల అందరిలో అవగాహన పెరగాలి అని, ఇందుకు మోహన్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈటల రాజేందర్ అభినందించారు.
ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మోహన్ ఫౌండేషన్ సీఈవో రఘురాం మాట్లాడుతూ.. అవయవ దానం ద్వారా మారిన జీవితాల కథలు ఎంతో స్ఫూర్తిదాయకమని, మోహన్ ఫౌండేషన్ ఇదే దిశగా నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి మ్యాక్స్ ప్రోటీన్, డా. రెడ్డీస్, మేఘావి వెల్నెస్ స్పా, బెనెఫిక్, జో ఆర్మీ, వాక్ ఫిట్, హై ఫైవ్ ట్రైబ్ , జర్మెటీన్ హాస్పిటల్స్, VSM ఎంటర్టైన్మెంట్స్, మూవ్ మెంటిజం, కార్నిటోస్, అక్షయ కల్ప, అంపుల్ రీచ్, ఆల్కలైన్, వర్క్ ఇండియా, గ్రీన్ మాటర్ తదితర సంస్థలు భాగస్వామ్యులుగా ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చాయి.
ALSO READ:Prithviraj Sukumaran: అందుకే నేషనల్ అవార్డు ఇవ్వలేదు.. ఆడుజీవితం మూవీపై జ్యూరీ మెంబర్ రియాక్షన్