PM Kisan 21st Installment: పీఎం కిసాన్ 21వ విడతపై అప్డేట్ వచ్చింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా ఏడాదికి రూ.6 వేలు ఖాతాల్లో జమ చేస్తుంది. ఏడాదికి మూడు విడతల్లో రూ.2000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇప్పటికే 20 విడతలు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. పీఎం కిసాన్ 21వ విడత డబ్బులను నవంబర్ 10లోపు రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు సమాచారం అందుతోంది.
ప్రధాని మోదీ ఆగస్టులో 20వ విడత నిధులను విడుదల చేశారు. 2.4 కోట్ల మంది మహిళా రైతులతో సహా 9.8 కోట్ల మంది రైతులకు 20వ విడతలో రూ.2 వేలు ఖాతాల్లో వేశారు. జూన్‌లో విడుదల చేయాల్సిన నిధులు ఆలస్యం కావడంతో.. ఆగస్టులో విడుదల చేశారు. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నిధులు విడుదల చేస్తుండడంతో.. తదుపరి విడత వచ్చే నెలలోపు పడుతుందని రైతుల ఆశిస్తున్నారు. 19వ విడత ఈ ఏడాది ఫిబ్రవరిలో, 18వ విడత అక్టోబర్ 2024లో, 17వ విడత జూన్ 2024లో విడుదలయ్యాయి.
తాజా నివేదికల ప్రకారం పీఎం కిసాన్ 21వ విడత నవంబర్ 10లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తారని తెలుస్తోంది. అయితే ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. జమ్మూ కశ్మీర్ వరదలు, కొండచరియలు విరిగిపడి పంటలు నష్టపోయిన రైతుల కోసం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం 21వ విడతను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు రాష్ట్రాలకు విడుదల చేసింది.
జమ్మూ కశ్మీర్‌లో 85,000 మందికి పైగా మహిళా రైతులతో సహా 8.55 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.171 కోట్లు బదిలీ చేశారు. కేంద్ర పాలిత రాష్ట్రాల్లోని రైతులకు ఇప్పటి వరకు రూ. 4,052 కోట్లు జమ చేశారు.
బీహార్‌లో ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఆ రాష్ట్రంలో నిధులు విడుదలపై సందిగ్ధం నెలకొంది. అయితే కొత్త ప్రభుత్వ పథకాలకు మాత్రమే కోడ్ నిబంధనలు వర్తిస్తాయని, పీఎం కిసాన్ వంటి పథకానికి అడ్డంకులు లేకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సాంకేతిక అంశాలు పూర్తయిన తర్వాత నిధులు రైతుల ఖాతాలకు జమ అవుతాయి.
పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున ఏడాది రూ. 6,000 పెట్టుబడి సాయం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రతి సంవత్సరం మూడు విడతలుగా ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి మధ్య నిధులు విడుదల చేస్తారు. ఈ నిధులను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. 2019లో ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ప్రపంచంలోనే అతి పెద్ద డీబీటీ పథకంగా పీఎం కిసాన్ రికార్డులకెక్కింది.
Also Read: SIR:12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్.. ఈసీ కీలక ప్రకటన
పీఎం కిసాన్ పొందడానికి ఈ-కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సెట్ ద్వారా ఓటీపీ ఆధారిత కేవైసీ పూర్తి చేయవచ్చు. లేదా సీఎస్ఎస్సీ కేంద్రాలలో బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేయవచ్చు.