PM Modi: నియోజకవర్గాల పునర్విభజన (Delimitation), మహిళా రిజర్వేషన్ బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు వేదికగా కీలక హామీ ఇచ్చారు. “భారతదేశాన్ని మేము ఒకేలా చూస్తాం.. విడిభాగాలుగా కాదు” అని స్పష్టం చేస్తూ, ఈ ప్రక్రియ వల్ల ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి అన్యాయం జరగదని భరోసా ఇచ్చారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును దేశమంతా స్వాగతిస్తుంటే, కొందరు ఉత్తరాది-దక్షిణాది అంటూ విభజన రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని విమర్శించారు. పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందనే వాదనల్లో నిజం లేదని, ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపబోమని ఆయన హామీ ఇచ్చారు. తమ ప్రభుత్వానికి చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం అనే భేదాలు లేవని, దేశ ప్రయోజనాలే పరమావధి అని మోదీ ఉద్ఘాటించారు.
ప్రతిపక్ష ఎంపీల నిరసనల మధ్య ప్రధాని మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం దేశ సమగ్రతను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ఈ బిల్లు మహిళా సాధికారతకు నిదర్శనమని, దీనిని వివాదస్పదం చేయవద్దని కోరారు.
“మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టడం దేశ పార్లమెంటరీ చరిత్రలోనే మరచిపోలేని ఘట్టం.” అని ప్రధాని పేర్కొన్నారు. వికసిత్ భారత్ అంటే కేవలం అత్యాధునిక రోడ్లు, రైళ్లు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదని.. మహిళల స్వావలంబన, వారి రాజకీయ సాధికారత తోడైనప్పుడే అది సంపూర్ణమవుతుందని ఆయన ఉద్ఘాటించారు. దేశ ప్రగతిలో మహిళల పాత్రను కీలకంగా మారుస్తూ, వారికి సరికొత్త దిశానిర్దేశం చేసేందుకే ఈ చారిత్రక అడుగు వేసినట్లు తెలిపారు.
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రధాని ఒక లోతైన వ్యాఖ్య చేశారు. “చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడం అనేది ఏదో ఒక రాజకీయ పార్టీ ఇస్తున్న కానుక (Gift) కాదు. అది వారి హక్కు (Right)” అని ఆయన ఘంటాపథంగా చెప్పారు. మహిళలకు అవకాశాలు కల్పిస్తే వారు దేశాన్ని సరికొత్త మార్గంలో నడిపిస్తారని, వారి సామర్థ్యం మరియు అనుభవాన్ని దేశ ప్రగతికి వినియోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని పిలుపునిచ్చారు.
మహిళా రిజర్వేషన్ల కోసం దాదాపు 30 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నా, గతంలో అవి వివిధ కారణాల వల్ల సాకారం కాలేదని ప్రధాని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లోనే వీటిని అమలు చేయాలని తాము భావించినా సాంకేతిక కారణాల వల్ల సాధ్యం కాలేదని, అయితే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా రిజర్వేషన్లు అమలు కావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో విపక్షాలకు ఆయన ఒక గట్టి హెచ్చరిక జారీ చేశారు:
ఈ బిల్లును అడ్డుకునే లేదా వ్యతిరేకించే పార్టీలను దేశ మహిళలు క్షమించరని, సమయం చూసి తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మహిళా బిల్లులకు మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీలకే భవిష్యత్తులో మనుగడ ఉంటుందని ఆయన చురకలంటించారు. ఇందులో ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదని, ఇది కేవలం మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశమని పేర్కొన్నారు.
ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో విపక్షాల విమర్శలకు ప్రధాని సమాధానమిచ్చారు. “ఈ బిల్లు తెచ్చినందుకు క్రెడిట్ (Credit) నాకు అవసరం లేదు. మీరే తీసుకోండి. ఈ బిల్లుపై అన్ని పార్టీల నేతల ఫోటోలు వేసుకోండి.. నాకు అభ్యంతరం లేదు” అని ఆయన వ్యాఖ్యానించారు. క్రెడిట్ కోసం పాకులాడకుండా, మహిళల హక్కుల కోసం అందరూ కలిసి రావాలని, ఈ చారిత్రక బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి తమ గొప్పతనాన్ని చాటుకోవాలని విపక్షాలను కోరారు.
మూలిగే నక్కపై తాటికాయ… తెలంగాణ బీజేపీపై తేజస్వీ సూర్య కామెంట్స్ ఎఫెక్ట్..!