Pune Porsche car case update: దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది పూణె పోర్షే కారు ఘటన. ఈ కేసులో లోతుకు వెళ్లినకొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీని వెనుక పెద్ద రాకెట్ నడుస్తోంది. అసలేం జరిగింది?
యాక్సిడెంట్ జరిగిన తర్వాత నిందితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు . వాళ్ల ఆధ్వర్యంలో ఆ తర్వాత రక్త నమూనాలు సేకరించారు డాక్టర్లు. రక్త నమూనాలను మార్చేందుకు ఆ సమయంలో నిందితుడు తండ్రి విశాల్ అగర్వాల్ ఏకంగా జువైనల్ జస్టిస్ బోర్డు ప్రాంగణంలో మూడు లక్షలు రూపాయలు లంచం ఇచ్చినట్టు సీసీటీవీ కెమెరాలో బట్టబయలైంది.
ముఖ్యంగా నిందితుడి రక్త నమూనాలను మార్చేందుకు ఈ సొమ్మును ససూన్ ఆసుపత్రికి సంబంధించి అటెండర్ అతుల్ వచ్చి తీసుకెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారానికి మధ్యవర్తిగా వ్యవహరించి న అష్ఫాక్, అమర్ గైక్వాడ్‌లను అరెస్ట్ చేశారు.
కారు ఘటన కేసును ఇప్పటివరకు నిందితుల వైపు మాత్రమే పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పుడు డాక్టర్ల వైపు ఫోకస్ చేశారు. ససూన్ ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగం హెడ్ డాక్టర్ అజయ్ తావ్డే గురించి కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. గతంలో హై ప్రొఫైల్ కేసుల్లో ఇలాగే రక్త నమూనాలను మార్చినట్టు పూణె క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అధికారులు ఓ నేషనల్ న్యూస్ పేపర్ వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
డాక్టర్ అజయ్‌కు సంబంధించిన డాక్టర్లు, బ్రోకర్లు నెట్‌వర్క్ దాదాపు నాలుగు జిల్లాల్లో విస్తరించినట్లు అందులో మెయిన్ పాయింట్. ఏదైనా హైప్రొఫైల్ డ్రంకన్ డ్రైవ్ కేసు నమోదైతే, ఆ నెట్‌వర్క్… బాధిత కుటుంబాన్ని సంప్రదించడం, భారీ మొత్తంలో మనీ తీసుకుని రక్త నమూనాలను మార్చడం చేస్తుందట. గడిచిన రెండున్నర ఏళ్లుగా ఈ నెట్‌వర్క్ చురుగ్గా పనిచేస్తున్నట్లు వెల్లడించారు.
ALSO READ: పోక్సో కేసులో యడియూరప్పకు సీఐడీ నోటీసులు
ఇక తావ్డేపై గతంలో అనేక ఆరోపణలు ఉన్నాయి. డ్రగ్స్ కేసులు, కిడ్నీ మార్పిడి వంటి నేరాల్లో అతడి పేరు బలంగా వినిపించింది. స్థానిక రాజకీయ నేతల అండతో ఆయన్ని ఫోరెన్సిక్ విభాగానికి హెడ్‌గా చేసినట్టు వార్తలు లేకపోలేదు.