President Droupadi Murmu receives Timor Leste’s highest civilian honour: కనీసం కరెంట్ సౌకర్యం కూడా లేని ఓ కుగ్రామంలో పుట్టి రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు ద్రౌపది ముర్ము. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లాలో బైదాపోసి గ్రామంలో జన్మించిన ముర్ము సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన వారు. వార్డు కౌన్సిలర్ గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన ముర్ము అంచెలంచెలుగా ఎదిగారు. నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పనిచేశారు. తాను ఏ పదవిలో ఉన్నా ప్రజాసంక్షేమమే ఎజెండాగా మసలుకున్నారు. రాష్ట్రపతిగా కొనసాగుతూనే దేశవ్యాప్తంగా గిరిజన యూనివర్సిటీల మనుగడకు కృషిచేస్తున్నారు. కాగా ఆమె సామాజిక సేవ, మహిళా సాధికారిత, గిరిజన విద్య తదితర విభాగాలలో ద్రౌపది ముర్ము చేస్తున్న అవిరళ కృషికి గుర్తింపుగా ఆమెకు తూర్పు తైమూర్ దేశం ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందజేసింది. ఆర్డర్ ఆఫ్ తైమూర్ లెస్టే పురస్కారాన్ని భారత రాష్ట్రపతికి ఆ దేశ అధ్యక్షుడు జోస్ రామోస్ హోర్తా అందజేశారు.
అధ్యక్షుడితో భేటీ
భారత రాష్ట్రపతి అధికార హోదాలో ముర్ము తూర్పు తైమూర్ దేశాన్ని సందర్శించారు. అందులో భాగంగా దేశ రాజధాని దిలికి చేరుకున్నారు. అక్కడ భారత మాజీ రాష్ట్రపతి వివి గిరి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. తర్వాత తూర్పు తైమూర్ లో నివాసముంటున్న ప్రవాస భారతీయులను కలిశారు. అక్కడి విద్యార్థులతో ప్రత్యేక సమావేశంలో పాల్గొని వారి తో విద్యారంగంలో వస్తున్న మార్పులపై చర్చించారు. ఆ తర్వాత తూర్పు తైమూర్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య భారత్, తూర్పు తైమూర్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు జరిగాయి. ఇరుదేశాలు పరస్పర అవగాహనతో ఒకరికొకరు స్నేహ హస్తం అందించేందుకు కృషి చేయవలసిందిగా ఆ దేశ అధ్యక్షుడిని కోరారు.