Karnataka CM Post: కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైసూర్ విమానాశ్రయంలో నిర్వహించిన భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం మైసూర్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. రాహుల్ గాంధీతో భేటీ జరిగిన మరుసటి రోజే (బుధవారం) డి.కె. శివకుమార్ ‘ఎక్స్’ (X) లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
“ప్రయత్నం విఫలమైనా.. ప్రార్థన విఫలం కాదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రకరకాల విశ్లేషణలకు తావిస్తున్నాయి. సీఎం పదవిపై తనకున్న ఆకాంక్షను గతంలోనే బహిరంగంగా ప్రకటించిన శివకుమార్, తాజా భేటీ తర్వాత ఈ విధంగా స్పందించడం గమనార్హం.
తమిళనాడు పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో, మైసూర్‌లో విమానం ఆగిన సమయంలో రాహుల్ గాంధీ ఇద్దరు నేతలతో విడివిడిగా చర్చలు జరిపారు. ఈ భేటీల్లో ఏం జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించే ప్రధానంగా చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన సమయంలో సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆ సమయంలో అధిష్టానం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపినప్పటికీ.. ‘రొటేషన్ ముఖ్యమంత్రి ఫార్ములా’ కింద రెండున్నరేళ్ల తర్వాత శివకుమార్‌కు అవకాశం ఇస్తారనే ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి.
మరోవైపు సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ మధ్య నెలకొన్న నాయకత్వ వివాదాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే వారిని ఢిల్లీకి పిలిపిస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం స్పష్టం చేశారు. “అవసరమైనప్పుడు పార్టీ వారిని పిలుస్తుంది” అని ఖర్గే విలేకరులతో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో నాయకత్వంపై కొంత గందరగోళం ఉన్న మాట వాస్తవమేనని, అయితే స్థానిక నాయకత్వమే దీనిని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
అయితే మంగళవారం రాహుల్ గాంధీతో జరిగిన ఈ తాజా భేటీలో నాయకత్వ మార్పుపై చర్చ జరిగిందా? లేదా కేవలం రాజకీయ పరిస్థితులపై సమీక్షించారా? అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. రాహుల్ గాంధీ ఇద్దరు నేతలను విడివిడిగా కలవడాన్ని బట్టి చూస్తే, విభేదాలను పరిష్కరించే దిశగా హైకమాండ్ ఒక కచ్చితమైన నిర్ణయానికి వస్తున్నట్లు కనిపిస్తోంది. సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలాన్ని సమీపిస్తున్న తరుణంలో, శివకుమార్ చేసిన “ప్రార్థన” ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.
Read Also: రైలు పట్టాలపై గర్భిణీ ప్రసవం.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాక్!