Rahul Gandhi inflation tweet: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఏప్రిల్ 29 తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగనున్నాయని.. సామాన్యులపై ద్రవ్యోల్బణం భారం పడబోతోందని ఆయన హెచ్చరించారు. “ఎన్నికల ఉపశమనం ముగిసింది, ద్రవ్యోల్బణం సెగ మొదలవుతోంది” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు వచ్చిన లాభాలను మోదీ ప్రభుత్వం తన జేబులో వేసుకుందని.. ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు ఆ భారాన్ని ప్రజలపై మోపుతోందని ఆయన ఆరోపించారు.
సాధారణంగా ఎన్నికల సమయంలో చమురు కంపెనీలు ధరలను స్థిరంగా ఉంచుతాయి. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే ధరలు పెంచే అవకాశం ఉందని.. దానివల్ల సామాన్యుల బడ్జెట్ తలకిందులు అవుతుందని ప్రజలను అప్రమత్తం చేయాలని రాహుల్ గాంధీ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది. ముడిచమురు ధరలు తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఆ ప్రయోజనాన్ని అందించలేదని.. పన్నుల రూపంలో భారీగా లాభాలను ఆర్జించిందని ఆయన వాదిస్తున్నారు.
ప్రస్తుతం పశ్చిమాసియా యుద్ధ మేఘాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు అస్థిరంగా ఉన్నాయి. దీనివల్ల భారత విమానయాన రంగం కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. విమాన ఇంధన (ATF) ధరలు కిలోలీటరుకు రూ. 2 లక్షల మార్కును దాటడం గమనార్హం
ప్రస్తుతం దేశంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతాయన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా కొట్టిపారేసింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టమైన వివరణ ఇచ్చింది.పెట్రోలియం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఈ అంశంపై ప్రకటన విడుదల చేస్తూ.. ఇంధన ధరల పెంపుపై వస్తున్నవన్నీ ఊహాగానాలేనని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
Read Also: కస్టమ్లకు బిగ్ అలర్ట్.. మే నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, హాలీడే లిస్ట్ ఇదిగో