Rahul Gandhi : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా విపక్షాలు ఏకమయ్యాయి. బిహార్ రాజధాని పట్నాలో సమావేశమయ్యాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో సహా ప్రధాన విపక్ష నేతలు ఈ మీట్ కు హాజరయ్యారు. వారందరికీ బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్వాగతం పలికారు.
ప్రస్తుతం దేశంలో సిద్ధాంతపరమైన ఘర్షణ జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. కాంగ్రెస్ భారత్ జోడో సిద్ధాంతం, ఆర్ఎస్‌ఎస్, బీజేపీ భారత్ టోడో సిద్ధాంతానికి మధ్య యుద్ధం జరుగుతోందన్నారు. భారత్‌ను విచ్ఛిన్నం చేసేందుకు విద్వేషం, హింసను వ్యాప్తి చేసేందుకు బీజేపీ యత్నిస్తోందని ఆరోపించారు. ఈ చర్యలను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని స్పష్టం చేశారు. అందుకోసమే విపక్ష నేతలు బిహార్ కు వచ్చారని తెలిపారు. బీజేపీని ఓడిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విజయం సాధిస్తామని రాహుల్ గాంధీ విశ్వాసం వ్యక్తం చేశారు. పేదల పక్షాన నిలబడటం వల్లే విజయం సాధిస్తామన్నారు. బిహార్‌లో కాంగ్రెస్ విజయం సాధిస్తే దేశవ్యాప్తంగా గెలుస్తుందని మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు.
విపక్షాల భేటీకి మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, బిహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ హాజరయ్యారు . మొత్తం 15 పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఆహ్వానం పంపలేదు.