పోస్ట్ కార్డ్, ఇన్ లాండ్ లెటర్.. జనరేషన్ Z కి ఇవి పూర్తిగా తెలియని పదాలు. దాదాపుగా ఇప్పుడు వీటి వాడకం పూర్తిగా తగ్గిపోయింది. అవసరమైతే అవతలివారికి క్షణాల్లో ఫోన్ చేయగల టెక్నాలజీ వచ్చిన తర్వాత రాసిన మూడోరోజో, నాలుగో రోజో అందే ఆ ఉ్తతరాలతో పనేముంటుంది చెప్పండి. అయితే వీటికి కాస్త భిన్నం రిజిస్టర్డ్ పోస్ట్. సురక్షిత సమాచార వ్యవస్థకు ఇప్పటి వరకు ఇది పర్యాయపదంగా నిలిచింది. మనం పంపించిన సమాచారం, లేదా డాక్యుమెంట్లు అవతలి వారికి అందాయా లేదా అన్న వెరిఫికేషన్ రిసిప్ట్ కూడా మనకి చేరడం ఇందులో ఉన్న ప్రత్యేకత. అయితే ఈ రిజిస్టర్డ్ పోస్ట్ ఇకపై గత కాలపు జ్ఞాపకంలా మారిపోతోంది. ఆమధ్య మనీఆర్డర్ సేవల్ని కూడా భారత తపాలా సంస్థ నిలిపివేసింది. ఇప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్ సేవల్ని కూడా ఆపేస్తోంది. ఇకపై దీన్ని స్పీడ్ పోస్ట్ తో భర్తీ చేస్తామని తపాలా సంస్థ ప్రకటించింది.
వీడ్కోలు..
రిజిస్టర్డ్ పోస్ట్ అనేది ఒక గౌరవనీయమైన పోస్టల్ సంప్రదాయానికి ప్రతీక. ముఖ్యమైన సమాచారం, లేదా అధికారిక సమాచారం, లేదా మన అనుకున్న వారికి మనం పంపించే గోప్యమైన సమాచారానికి ఇదే ప్రధాన మాధ్యమం. ఉత్తరాలు రాసే వారికి ఏదో ఒక సందర్భంలో రిజిస్టర్డ్ పోస్ట్ పంపించడమో లేదా అందుకోవడమో అనుభవంలోని విషయమే. బ్రిటిషన్ కాలం నుంచి ఈ రిజిస్టర్డ్ పోస్ట్ సేవల్ని ప్రత్యేకంగా చూస్తున్నారు. ఇప్పుడది పూర్తిగా కనుమరుగైపోతోంది. ఉద్యోగానికి కాల్ లెటర్, చట్టపరమైన నోటీస్, ప్రభుత్వ ఇచ్చే సమాచారం, దూర ప్రాంతం నుంచి వచ్చే లేఖ.. ఇలాంటి వాటికి రిజిస్టర్డ్ పోస్ట్ ని ఎక్కువగా ఉపయోగించేవారు.
స్పీడ్ పోస్ట్..
ఇప్పుడున్నది స్పీడ్ యుగం. అవతలి వారికి ఏ సమాచారం చేరవేయాలన్నా వెంటనే ఫోన్ అందుకోవడం అందరికీ అలవాటే. అయితే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు, లేదా ఏదైనా ముఖ్యమైన సమాచారం చేరవేసేందుకు ఇప్పుడు స్పీడ్ పోస్ట్ అందుబాటులో ఉంది. స్పీడ్ పోస్ట్ వచ్చిన తర్వాత సాధారణ పోస్ట్ ని ఎవరూ ఉపయోగించడం లేదంటే అతిశయోక్తి కాదు. అదే సమయంలో రిజిస్టర్డ్ పోస్ట్ కి ఇది ప్రత్యామ్నాయంగా కూడా ఉపయోగపడుతోంది. ఇప్పటి వరకు ఇది అనధికారిక ప్రత్యామ్నాయం, ఇప్పుడిక అధికారికంగా రిజిస్టర్డ్ పోస్ట్ బదులు స్పీడ్ పోస్ట్ నే ఉపయోగించబోతున్నారు.
ఆ పాత జ్ఞాపకాలు..
రిజిస్టర్డ్ పోస్ట్ అనేది కేవలం ఒక సేవ మాత్రమే కాదు, కొంతమందికి అది జీవితకాల జ్ఞాపకం. అయితే ఆ జ్ఞాపకం తాలూకు గుర్తులు సెప్టెంబర్ 1తో పూర్తిగా చెరిగిపోతాయి. జులై 31 నాటికి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసి సెప్టెంబర్ 1 నుంచి స్పీడ్ పోస్ట్ సేవల్లో రిజిస్టర్డ్ పోస్ట్ ని మెర్జ్ చేయాలని చూస్తున్నారు. అంటే ఇకపై “రిజిస్టర్డ్ పోస్ట్”, “రిజిస్టర్డ్ పోస్ట్ విత్ అక్నాలెడ్జ్‌మెంట్ డ్యూ” వంటి పదాలు వినిపించవు. ఆ స్థానంలో కేవలం “స్పీడ్ పోస్ట్” మాత్రమే వినపడుతుంది. మరి రిజిస్టర్డ్ పోస్ట్ విషయంలో ఉన్న అన్ని రకాల చట్టబద్ధమైన రక్షణలు స్పీడ్ పోస్ట్ కి కల్పిస్తున్నారా లేదా అనేది తేలాల్సి ఉంది. రిజిస్టర్డ్ పోస్ట్ లో డెలివరీకి సంబంధించిన ఆధారాలు, పోస్టింగ్‌కు సంబంధించిన ఆధారాలను కూడా కోర్టులలో ఉపయోగించవచ్చు. ప్రభుత్వ విభాగాలు, బ్యాంకులు, కోర్టులు, విద్యా సంస్థలు కొన్ని రకాల ఉత్తర ప్రత్యుత్తరాలకు కేవలం రిజిస్టర్ పోస్ట్ లను మాత్రమే ఉపయోగించేవి. ఇప్పుడు ఆ కార్యకలాపాలు స్పీడ్ పోస్ట్ ద్వారా భర్తీ కావాల్సి ఉంది.