Big Stories

Manipur: కనిపిస్తే కాల్చివేత.. మణిపూర్‌లో తీవ్ర హింస.. రంగంలోకి ఆర్మీ.. అసలేం జరుగుతోంది?

- Advertisement -

Manipur: కనిపిస్తే కాల్చివేత. షూట్ ఎట్ సైట్. సినిమాల్లో తరుచూ వినిపించే పదం. బయట మాత్రం అత్యంత అరుదుగానే ప్రయోగిస్తారీ అస్త్రం. కానీ, మణిపూర్‌లో తాజాగా షూట్ ఎట్ సైట్ ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం. ఈశాన్య రాష్ట్రంలో చెలరేగిన హింస.. అదుపు తప్పడంతో.. రాష్ట్రం తగలబడిపోతుండటంతో.. కనిపిస్తే కాల్చివేయాలంటూ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు గవర్నర్.

- Advertisement -

మణిపూర్ తగలబడిపోతోంది. హింసాత్మక ఘటనలతో రాజధాని ఇంఫాల్ అట్టుడికిపోతోంది. తమను ఎస్టీల్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ.. ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ చేపట్టిన ఆందోళన అదుపుతప్పడంతో 8 జిల్లాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వాహనాలు, ప్రార్థనా స్థలాలకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పలుచోట్ల ఇళ్లు, వ్యాపార సముదాయాలు అగ్నికి ఆహుతయ్యాయి. పలువురు ప్రాణాలు కోల్పోయారు.

రంగంలోకి ఆర్మీ..
పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి భారత ఆర్మీ రంగంలోకి దిగింది. హింసను నియంత్రించేందుకు 55 కంపెనీలతో కూడిన ఆర్మీ, అస్సాం రైఫిల్స్‌ సిబ్బందిని మోహరించారు. మరో 14 బృందాలను సిద్ధంగా ఉంచింది రక్షణశాఖ. హింస ప్రబలే అవకాశమున్న 8 జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. 5 రోజుల పాటు మొబైల్, ఇంటర్నెట్ సేవలను రద్దు చేసింది.

అసలేం జరిగిందంటే…
రాష్ట్రంలోని మెయిటీ వర్గానికి ఎస్టీ హోదా ఇవ్వడానికి జరుగుతున్న ప్రయత్నాలపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ది ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ నాయకత్వంలో ఆందోళనలు చేపట్టాయి. ఈ నిరసన ప్రదర్శనలో వేలాది మంది గిరజన విద్యార్థులు పాల్గొన్నారు. ప్రదర్శన ప్రశాంతంగా ముగిసినా.. తర్వాత కొందరు వ్యక్తులు చురాచాంద్‌పూర్ లో హింసకు దిగారు. అల్లర్లు వేగంగా ఇతర ప్రాంతాలకు పాకాయి. గిరిజనుల ఇళ్లు, ప్రార్థనా స్థలాలు తగులబడ్డాయి. వందలాది మంది గాయపడ్డారు. చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.

రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై సీఎం బిరేన్ సింగ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వర్గాల మధ్య విభేదాలే.. ఇంతటి విధ్వంసానికి కారణమయ్యాయని చెప్పారు. త్వరలోనే ఈ వివాదానికి పరిష్కారం చూపిస్తామన్నారు. ఇటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. మణిపూర్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి రాష్ట్రంలో పరిస్థితి గురించి తెలుసుకున్నారు. హోంశాఖ ఆదేశాలతో.. సైన్యం, పారామిలిటరీ బలగాలను మోహరించారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ను సైతం రంగంలోకి దించారు. కల్లోలితప్రాంతాల్లోని ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.

ఇటు ఆందోళనకు నాయకత్వం వహించిన యూనియన్ మాత్రం.. కోర్టు తీర్పును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. రాష్ట్ర జనాభాలో 53 శాతం ఉన్న మెయిటీలకు ఎస్టీ హోదా ఇవ్వడం వల్ల.. తమకు ఉద్యోగావకాశాలు, విద్యాసంస్థల్లో ప్రవేశాలు తగ్గిపోతాయని.. ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీంతో కోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం చేశాయి.

ప్రముఖ బాక్సర్ క్రీడాకారిణి మేరీకోమ్ సైతం.. రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై ఆవేదన వ్యక్తం చేశారు. మణిపూర్ తగులబడిపోతుందని.. దయచేసిన సహాయం చేయండంటూ.. ప్రధాని, కేంద్రమంత్రులకు విజ్ఞప్తి చేశారు. పరిస్థితి దయనీయంగా ఉందని.. ఎప్పుడైనా ఏదైనా జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

మణిపూర్ లో హింసాత్మక ఘటనలకు నిరసనగా.. ఢిల్లీలో ఆ రాష్ట్రవాసులు ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో పరిస్థితులను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News