Big Stories

Sitaram Yechury : సీతారాం ఏచూరి నివాసంపై రెయిడ్స్.. పాలకుల కుట్ర ?

Sitaram yechury latest news

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) నివాసంలో సోదాలు జరుగుతున్నాయి. చైనా నుంచి ఫండింగ్‌ అందుతోందన్న ఆరోపణల నేపథ్యంలో న్యూస్‌క్లిక్‌ జర్నలిస్టుల నివాసాలపై మంగళవారం ఉదయం నుంచి రెయిడ్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో సీతారాం ఏచూరి ఇంట్లో తనిఖీలకు దిగడం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. మరోవైపు.. న్యూస్‌క్లిక్ పోర్టల్‌తో సీతారాం ఏచూరికి, సీపీఎం లింకులపై అధికారులు ఆరా తీస్తున్నారు. అయితే న్యూస్‌క్లిక్ పోర్టల్‌తో తనకు, తన పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు ఏచూరి. ఆయన ఇంట్లో స్పెషల్ బ్రాంచ్ తనిఖీలపై సీపీఎం నేతలు అత్యవసరంగా సమావేశం అయ్యారు.

- Advertisement -

ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు తన ఇంటికి వచ్చిన మాట నిజమేనని సీతారాం ఏచూరి తెలిపారు. తనతో పాటు ఇంట్లో ఉన్న తమ పార్టీ నాయకుడి కుమారుడు న్యూస్‌క్లిక్‌లో పనిచేస్తున్నారని, అతని ల్యాప్‌టాప్‌,మొబైల్ ఫోన్ ను వాళ్లు తీసుకెళ్లారని చెప్పారు. అయితే.. ఏ విషయంలో ఈ తనిఖీలు చేస్తున్నారో, దీని ద్వారా ఏమి కోరుకుంటున్నారో అర్థం కావడం లేదన్నారు. మీడియా నోరు నొక్కేందుకు పాలకులు చేస్తున్న ప్రయత్నంగా సీతారాం ఏచూరి విమర్శించారు. ప్రభుత్వ ఉద్దేశాలను ప్రజలు తెలుసుకోవాలని అన్నారు.

- Advertisement -

కాగా.. న్యూస్ క్లిక్ సంస్థకు చైనా నుంచి అక్రమంగా నిధులు అందాయని ఈడీ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఢిల్లీ పోలీసులు మంగళవారం ఉదయం ఏకకాలంలో ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లోని 100 ప్రాంతాల్లో ఈ ఆకస్మిక దాడులు నిర్వహించారు. సంస్థలో పనిచేసే జర్నలిస్టులు, ఉద్యోగులకు సంబంధించిన ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు చీఫ్ ఎడిటర్ ప్రబీర్ పుర్కాయస్థతో సహా.. జర్నలిస్టులను లోధీ రోడ్ లో ఉన్న స్పెషల్ సెల్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదని అధికారులు చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News