BigTV English

Supreme Court Kolkata Murder Case: ‘నిరసనలు ఆపి విధుల్లో చేరండి’.. డాక్టర్లను కోరిన సుప్రీం కోర్టు

Supreme Court Kolkata Murder Case: ‘నిరసనలు ఆపి విధుల్లో చేరండి’.. డాక్టర్లను కోరిన సుప్రీం కోర్టు

Supreme Court Kolkata Murder Case| కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసుని సు మోటోగా తీసుకొని మంగళవారం విచారణ ప్రారంభించిన సుప్రీం కోర్టు.. నిరసన చేస్తున్న డాక్టర్లను తిరిగి విధుల్లో చేరాలని కోరింది. చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈ కేసుని పరిశీలించిన తరువాత డాక్టర్ల సమస్యలకు ప్రాధాన్యం ఇస్తూ జాతీయ సమస్యగా గుర్తిస్తున్నామని తెలిపింది.


”విధులు బహిష్కరించి దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తున్న డాక్టర్లందరూ తిరిగి డ్యూటీలో చేరాలి. డాక్టర్లు విధులు బహిష్కిరించడం వల్ల సమాజంలోని వైద్యసహాయం కోసం ఎదురు చూసే దిగువ, మధ్య తరగతికి చెందిన వారు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వైద్యసిబ్బంది, డాక్టర్లందరికీ మేము హామీ ఇస్తున్నాం. డాక్టర్ల సమస్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ.. దీన్ని జాతీయ సమస్యగా గుర్తిస్తున్నాం.” అని సుప్రీం కోర్టు ధర్మాసనం కోల్ కతా డాక్టర్ హత్య కేసులో వాదనలు విన్న తరువాత ప్రకటించింది.

కోల్ కతా లోని ఆజి కార్ మెడికల్ కాలేజిలో పనిచేసే 700 మంది రెసిడెంట్ డాక్టర్లలో చాలామంది మహిళా డాక్టర్ హత్యాచార ఘటన తరువాత ఆగస్టు 14 రాత్రి నుంచి విధులు బహిష్కరించి ఆస్పత్రి వదిలి వెళ్లిపోయారు. ప్రస్తుతం కేవలం 40 మంది మహిళా డాక్టర్లు, 60 నుంచి 70 మంది పురుష డాక్టర్లు మాత్రమే ఆస్పత్రి హాస్టల్స్ లో ఉన్నట్లు సమాచారం.


ఈ విషయంపై సుప్రీం కోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ఆస్పత్రి, మెడికల్ కాలేజీలో పనిచేసే రెసిడెంట్ డాక్టర్లు, సీనియర్, ఇంటర్న్ డాక్టర్లు విధుల్లో తిరిగి చేరాలంటే వారికి భద్రత కల్పించడం చాలా అవసరమని స్పష్టం చేసింది.

సుప్రీం కోర్టు వ్యాఖ్యలకు సొలిసిటర్ జెనెరల్ తుషార్ మెహతా సమాధానమిస్తూ.. ఆర్ జికార్ మెడికల్ కాలేజీ, హాస్టల్ వద్ద డాక్టర్ల రక్షణ కోసం ఇప్పటికే సిఆర్‌పిఎఫ్ జవాన్లను తగిన సంఖ్యలో కేంద్ర ప్రభుత్వం తరలించిందని తెలిపారు. మరోవైపు ఈ కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరపున వాదిస్తున్న సీనియర్ లాయర్ కపిల్ సిబల్.. కేంద్ర బలగాలు ఆస్పత్రి భద్రత కోసం వస్తే.. బెంగాల్ ప్రభుత్వానికి ఏ అభ్యంతరం లేదని చెప్పారు.

నిరసన చేస్తున్న డాక్టర్లకు న్యాయం జరుగుతుందని సుప్రీం కోర్టు హామీ ఇస్తూ.. ఆజి కార్ మెడికల్ కాలేజీలో ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకోవడానికి ఒక పది మంది సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ ని ఘటనా స్థలానికి పంపుతామని చెప్పింది. డాక్టర్లు, వైద్య సిబ్బంది, వైద్య విద్యార్థులకు ఏవైనా భద్రతా సమస్యలుంటే సుప్రీం కోర్టు రిజిస్ట్రార్ కు ఒక ఈమెయిల్ ద్వారా తెలపాల్సిందిగా ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

మరోవైపు ఆర్ జి కార్ మెడికల్ కాలేజీలో మహిళా డాక్టర్ హత్యాచారం కేసు విచారణలో భాగంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై సుప్రీం కోర్టు మండిపడింది. హత్యాచారం ఘటన గురించి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ఎందుకు ఆలస్యం జరిగిందని, ఆర్ జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ని సస్పెండ్ చేసిన తరువాత అత్యవసరంగా మరో కాలేజీకి ప్రిన్సిపాల్ ఎలా నియమించారని ప్రశ్నించింది. ఈ కేసులో ఇంతవరకు జరిగిన విచారణ గురించి సిబిఐని నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఆర్ జి కార్ ఆస్పత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులను అదుపు చేయడానికి బెంగాల్ ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఆగస్టు 22కు వాయిదా వేసింది.

నిరసనలు ఆపేది లేదు: ఫైమా అసోసియేషన్
ఒకవైపు సుప్రీం కోర్టు ఆస్పత్రుల వద్ద డాక్టర్ భద్రత పెంచాలని సూచిస్తూ.. డాక్టర్లు నిరసనలు మాని విధుల్లో చేరాలని చెబుతుంటే.. మరోవైపు ఫైమా (ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్) చైర్మెన్ డాక్టర్ రోహన్ కృష్ణన్ మాట్లాడుతూ.. ”సుప్రీం కోర్టు ఈ కేసులో విచారణ చేయడం సంతోషకరమే. అయినా కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొని వచ్చేంత వరకు డాక్టర్లు విధుల్లో చేరేది లేదు,” అని స్పష్టం చేశారు.

 

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×