Supreme Court Sensational Verdict On Electoral Bonds: ఎలక్ట్రోరల్ బాండ్స్ స్కీమ్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు వెలువరించింది. ఎలక్ట్రోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది.నల్లధనం అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని స్పష్టం చేసింది.
పొలిటికల్ పార్టీలు ఫండ్స్ సమకూర్చేందుకు ఎన్నికల బాండ్ల తీసుకొచ్చారు. అయితే ఎలక్ట్రోరల్ బాండ్స్ చెల్లుబాటుపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రాథమిక హక్కుల ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం ఈ స్కీమ్ సమాచార హక్కును ఉల్లంఘిస్తుందని సుప్రీంకోర్టు బెంచ్ స్పష్టంచేసింది. బ్లాక్ మనీని అరికట్టేందుకు సమాచార హక్కును ఉల్లంఘించడం సమంజసం కాదని తేల్చిచెప్పింది.
ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధమేనని సుప్రీకోర్టు ధర్మాసనం తీర్పులో పేర్కొంది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘనేనని తెలిపింది.నల్లధనం నిర్మూలనకు ఈ పథకం ఒక్కటే మార్గం కాదని స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు విరాళాలు అనేది క్విడ్ ప్రోకో కు దారి తీస్తుందని అభిప్రాయపడింది. విరాళాలు ఇచ్చిన వారి డిటైల్స్ సీక్రెట్ గా ఉంచడం కుదరదని స్పష్టం చేసింది. ఇది సమాచార హక్కు ఉల్లంఘన కిందకే వస్తుందని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పు ప్రకటించింది.
Read More: ఎలక్షన్ బాండ్ల పేరుతో దొంగాటకు సుప్రీం చెక్..!
పిటిషనర్ల వాదనలు..
ఎన్నికల బాండ్ల పథకంతో పారదర్శకత కొరవడుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం జరుగుతుందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలను దక్కవని వివరించారు. ఈ స్కీమ్ అవినీతిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఎన్నికల బాండ్ల ద్వారా ఇప్పటి వరకు సమకూరిన నిధుల్లో అత్యధికంగా కేంద్రంలోని రూలింగ్ పార్టీకి, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే వెళ్లాయని లెక్కలను వివరించారు. దేశంలోని విపక్ష పార్టీలకు తక్కువ మొత్తంలోనే విరాళాలు వచ్చాయని సుప్రీంకోర్టు దృష్టికి సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ తీసుకొచ్చారు.
కేంద్రం వాదనలు..
అనేక దేశాలు ఎన్నికల్లో బ్లాక్ మనీ ప్రభావాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయని కేంద్రం సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. భారత్ లో నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్ పేమెంట్ విధానం అమలు చేస్తున్నామని తెలిపింది. 2.38 లక్షల డొల్ల కంపెనీలపై యాక్షన్ తీసుకున్నామని పేర్కొంది. వైట్ మనీ రాజకీయ పార్టీలకు విరాళాలుగా అందేలా చేయడానికి ఎన్నికల బాండ్ల పథకం ఉద్దేశమని చెప్పింది.
అధికార పార్టీకే అధిక విరాళాలు ఎందుకు వెళ్తున్నాయని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ప్రశ్నించారు. కారణమేంటని ప్రశ్నించారు. ఎన్నికల బాండ్ల ద్వారా సమకూరిన నిధులను ఎన్నికల సంఘం వద్ద ఉంచి.. అన్ని పార్టీలకు సమానంగా పంపిణీ చేయాలని సూచించారు. అప్పుడు అసలు విరాళాలే రావని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సమాధానమిచ్చారు. ఈ పిటిషన్లపై కేంద్రం తరఫున అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి సుప్రీంకోర్టులో అఫిడవిట్ సమర్పించారు. ఎన్నికల బాండ్ల నిధుల మూలాలకు సమాచారం తెలుసుకునే హక్కు దేశ ప్రజలకు లేదని ఈ అఫిడవిట్ లో పేర్కొన్నారు.