Gold Crown : త్రేతాయుగంలో రాముడు 14 ఏళ్లు వనవాసానికి వెళ్తే.. ఇప్పుడు.. ఆ రామయ్య రాకకోసం భక్తులు వందలఏళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చింది. ఎన్నేళ్లయినా.. చివరికి రామజన్మభూమిగా భావించే అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం.. జనవరి 22న ఉదయం 84 సెకన్ల దివ్యముహూర్తంలో కన్నుల పండుగగా జరిగింది. ఆ ముగ్ధమనోహర రూపాన్ని చూసి భక్తులు తన్మయత్వంతో పులకిస్తున్నారు. మా రాముడొచ్చేశాడంటూ.. అయోధ్య సహా.. యావత్ దేశమంతా దీపావళిని జరుపుకుంది. జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తింది.
అయోధ్య రామమందిరం నిర్మాణం అంత సులువుగా జరగలేదన్నది జగమెరిగిన సత్యం. ఎన్నో అడ్డంకులు, చిక్కుముడులు, వివాదాలను దాటుకుని.. రామమందిర నిర్మాణాన్ని చేపట్టగా.. దేశనలుమూలల నుంచే, విదేశాల నుంచి రామయ్యకు విరాళాలు వెల్లువలా వచ్చాయి. వాటిలో విలువైన విరాళాలెన్నో ఉన్నాయి. ఆ విరాళాల్లో ఒకటి.. బంగారు కిరీటం. దానివిలువ అక్షరాలా రూ.11 కోట్లు. గుజరాత్ లోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి ముకేష్ పటేల్.. శ్రీరామచంద్రమూర్తికి తనవంతు విరాళాన్ని అందించారు.
ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని అయిన ముకేష్ పటేల్, ఆయన కుటుంబం రాముడికి రూ.11 కోట్ల విలువైన బంగారు కిరీటాన్ని చేయించారు. ఈ కిరీటం తయారీకి నాలుగు కిలోల బంగారం, వజ్రాలు, జెమ్ స్టోన్స్, కెంపులు, ముత్యాలు, నీలమణిని ఉపయోగించారు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ కిరీటాన్ని ముకేష్.. తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ ట్రస్ట్ అధికారులకు అందజేశారు.
కాగా.. అయోధ్య రామమందిరానికి చేపట్టిన విరాళాల సేకరణలో దిలీప్ అనే భక్తుడు ఏకంగా 101 కేజీల బంగారం ఇచ్చినట్లు సమాచారం. ఈ బంగారంతో ఆలయానికి తలుపులు, గర్భగుడి, త్రిశూలం వంటివి చేయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం.. 101 కేజీల బంగారం ధర రూ.68 కోట్లు. ఇప్పటి వరకూ రామమందిరం ట్రస్ట్ కు వచ్చిన విరాళాల్లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి దిలీప్ కుమార్ లాఖి, ఆయన కుటుంబం రాములవారికి భూరి విరాళం ఇచ్చినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 20 లక్షల మందికి రామమందిరం ట్రస్ట్ కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి రూ.2100 కోట్ల విరాళాలను సేకరించారు.