Rape Case Survivor Fault| యువతి వక్షోజాలను తాకడం, బలవంతంగా ప్యాంటు విప్పడం వంటి చర్యలు అత్యాచార ప్రయత్నంగా పరిగణించలేమని ఇటీవల సంచలన తీర్పు చెప్పిన అలహాబాద్ హైకోర్టు (ఉత్తరప్రదేశ్) మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఒక అత్యాచార కేసులో మహిళ వైపు కూడా తప్పు ఉందని పేర్కొంటూ నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న ఒక విద్యార్థిని తన సహాధ్యాయి అత్యాచారం చేశాడని కేసు నమోదు చేసింది. మద్యం ప్రభావంతో మత్తులో ఉన్న ఆమెను నిందితుడు తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి రెండుసార్లు అత్యాచారం చేశాడని ఆరోపణ. కానీ, సాక్ష్యాధారాల పరిశీలనలో ఇది అబద్ధమని, ఇద్దరూ స్వేచ్ఛా సమ్మతితో కలిసినట్లు నిందితుడి వకీలు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత, కోర్టు కీలక అంశాలను పరిగణనలోకి తీసుకుంది.
కేసులో బాధితురాలు ఎంఏ చదువుతున్న యువతి. ఏది తప్పు, ఏది ఒప్పు అనే నైతికత గురించి ఆమెకు తెలియదని కోర్టు పేర్కొంది. బాధితురాలి ఆరోపణ నిజమైనా, ఇక్కడ సమస్యను ఆమే స్వయంగా ఆహ్వానించినట్లు స్పష్టంగా కనిపిస్తుందని, అందువల్ల జరిగిన దానికి ఆమె కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు తీర్పులో పేర్కొంది. ఇది బాధితురాలి స్వయంకృత తప్పే అని నొక్కి చెప్పింది.
వైద్య పరీక్షలో కన్నెపొర (Hymen) చిరిగినట్లు తేలినప్పటికీ, లైంగిక వేధింపులు జరిగినట్లు వైద్యులు ఏమీ నిర్ధారించలేదు. ఈ కేసులో నిందితుడికి ఇంతకు ముందు ఎలాంటి నేర చరిత్ర లేదు. బెయిల్ షరతులను ఉల్లంఘనకు పాల్పడకుండా ఇచ్చిన హామీ, సాక్ష్యాలను ప్రభావితం చేయలేడన్న నమ్మకంతో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నామని జస్టిస్ సంజయ్ కుమార్ సింగ్ తీర్పు వెలువరించారు.
ఈ సంఘటన గత ఏడాది సెప్టెంబర్ నాటిది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న బాధితురాలిని ఆమె స్నేహితులు హౌజ్ ఖాస్ లోని ఒక రెస్టారెంట్ కు ఆహ్వానించారు. అర్ధరాత్రి 3 గంటల వరకు ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె మద్యం సేవించింది. మత్తులో ఉన్న ఆమె తన గదికి వెళ్లలేని స్థితిలో ఉండగా, ఒక స్నేహితుడిని తన ఇంటికి తీసుకెళ్లమని కోరింది. కానీ, నిందితుడు ఆమెను తన బంధువుల ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడని ఆమె ఆరోపణ. ఈ కేసులో నిందితుడు గత ఏడాది డిసెంబర్ నుంచి జైలులో ఉన్నాడు.
Also Read: భర్త ఉండగానే మరో యువకుడితో పెళ్లి.. సోషల్ మీడియా ప్రేమ మరి
అయితే నిందితుడు మాత్రం ఆమె తనతో పడక సుఖం పొందడానికే తోడుగా వచ్చిందని.. తాను బలవంతం ఏమీ చేయలేదని తెలిపాడు. అయినా మహిళతో తాను ఏవిధమైన లైంగిక చర్యకు పాల్పడలేదని కోర్టులో చెప్పాడు.
ఈ కేసు విచారణకు ముందు, అదే కోర్టులోని జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా ఇచ్చిన మరో వివాదాస్పద తీర్పు ప్రస్తావనలో ఉంది. మార్చి 17న ఒక మైనర్ బాలికపై జరిగిన అత్యాచార ప్రయత్నం కేసులో.. “మహిళ ఛాతీని తాకడం, పైజామా తాడు తెంపడం వంటి చర్యలు అత్యాచార ప్రయత్నంగా పరిగణించలేము” అని జస్టిస్ మిశ్రా తీర్పు ఇచ్చారు. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించి.. స్టే విధించింది.