Blast in Sivakasi: ఓ బ్లాస్ట్ బతుకులను బుగ్గి చేసింది. కొందరు కార్మికుల సజీవ దహనానికి కారణమైంది. మరికొందరిని ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్టుమిట్టాడేలా మార్చింది.. మొత్తంగా పదుల సంఖ్యలో కార్మికుల జీవితాలను రోడ్డున పడేలా చేసింది. సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఘటన మరువక ముందే.. తమిళనాడులోని శివకాశి బాణసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. చాలా మందికి తీవ్రగాయాలు అయినట్లు తెలుస్తోంది.
వివరాల్లాక్ వెళ్తే.. తమిళనాడులోని రాష్ట్రం విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలోని ఓ బాణసంచా తయారీ యూనిట్‌లో.. హఠాత్తుగా భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా మొత్తం ఏడుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
పేలుడు ధాటికి యూనిట్
పేలుడు తీవ్రత ఎంతగా ఉందంటే, బాణసంచా తయారీ కేంద్రంలోని మూడు గదులు పూర్తిగా కుప్పకూలిపోయాయి. పేలుడు సమయంలో యూనిట్‌లో పని చేస్తున్నవారంతా.. మంటల్లో చిక్కుకుని గాయాలపాలయ్యారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అధికారులు, పేలుడు సమయంలో అనధికారంగా ఎక్కువ మంది కార్మికులు.. యూనిట్‌లో ఉన్నట్టు ప్రాథమిక సమాచారం వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు మహిళలు కూడా ఉండటం బాధాకరం.
సహాయ చర్యలు కొనసాగుతున్నాయి
ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని పూర్తిగా మూసివేసి, బాంబ్ స్క్వాడ్, ఫోరెన్సిక్ బృందాలు విచారణ జరుపుతున్నాయి.
ప్రమాదానికి కారణాలపై విచారణ
ప్రమాదానికి అసలు కారణం ఏమిటనేది స్పష్టంగా తెలియరాలేదు ఉంది. పేలుడు అనుకోకుండా జరిగిందా? లేక కంపెనీ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అన్నదానిపై అధికారులు విచారణ చేపట్టారు. యూనిట్‌లో సేఫ్టీ నిబంధనలు పాటించారా? అన్న దానిపై కూడా పరిశీలన జరుగుతోంది.
శివకాశి ప్రమాదాల చరిత్రకు మరో అదనపు ఘట్టం
శివకాశి ప్రాంతం బాణసంచా తయారీ.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే తరచూ ఇక్కడి యూనిట్లలో ప్రమాదాలు జరుగుతుండటం కలకలం రేపుతోంది. గతంలో జరిగిన అనేక ప్రమాదాల్లో.. ఇప్పటికే వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటన మరోసారి భద్రతా లోపాలను బయటపెట్టింది.
Also Read: నేనున్నా! పాశమైలారం ఘటనపై హాస్పిటల్‌కు సీఎం రేవంత్
మృతులకు నివాళి.. బాధిత కుటుంబాలకు పరామర్శ
రాష్ట్ర ప్రభుత్వ అధికారి మృతుల కుటుంబాలకు.. సంతాపం తెలిపినట్లు సమాచారం. గాయపడ్డవారి చికిత్సకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించే అవకాశముంది.