TCS Manager Suicide : భార్య వేధింపులు, కేసులను తట్టుకోలేక ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు మరువక ముందే.. అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని టాటా కన్సల్టెన్సీలో మేనేజర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల మానవ్ శర్మ.. తన భార్య నికితా శర్మ (28) వేధింపుల కారణంగా ఆగ్రాలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చనిపోయేందుకు ముందు ఫిబ్రవరి 24న తన భార్య వేధింపులపై బాధను వ్యక్తం చేస్తూ 7 నిమిషాల వీడియోను విడుదల చేశారు. ఇందులో.. తన తల్లీదండ్రులకు క్షమాపణలు చెబుతూ, పురుషులు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు అని తెలిపాడు. మగవాళ్లు ఎదుర్కొంటున్న వేధింపులపై మాట్లాడాలని, వాళ్లు సమాజంలో ఒంటరిగా మారిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రముఖ ఐటీ సంస్థలో పనిచేసే మానవ్.. ముంబైలోని డిఫెన్స్ కాలనీలో ఉంటున్నాడు.. ఆయన తండ్రి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి నరేంద్ర శర్మ. మానవ్ జనవరి 30, 2024న వివాహం చేసుకున్నారు. పెళ్లైన కొత్తలో అంతా బాగానే ఉన్నా.. ఆ తర్వాత అంతా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెకు అంతకు ముందే వేరే అబ్బాయితో సంబంధాలున్నాయని తెలిసిందని.. ఆమె అతడితోనే కలిసి జీవించడానికి ఆసక్తి చూపడంతో వారిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని మానవ్ వీడియోలో తెలిపాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 23న తిరిగి ఇంటికి వెళ్లిన మానవ్.. అతని భార్యను పుట్టింట్లో దింపేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అతని అత్తామామల నుంచి బెదిరింపులు ఎదురైనట్లు, ఆ తర్వాతే అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.
మానవ్ విడుదల చేసిన తీవ్ర భావోద్వేగ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతున్నా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదనే కారణంగా పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఆ తర్వాత రాత్రి అతని కుటుంబం నుంచి వాట్సాప్ ద్వారా ఫిర్యాదు అందినత తర్వాత.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అయితే.. అతని ఆరోపణల్ని భార్య నికితా శర్మ తిరస్కరించింది. తన భర్త మందుకు బానిసగా మారిపోయాడని, గతంలో అనేకసార్లు తనను తాను గాయపరచుకున్నాడని ఆరోపించింది. అతను విపరీతంగా తాగేవాడని, అనేక సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడని ఆరోపణలు చేసింది. చాలా సార్లు ఆమే, అతడిని కాపాడినట్లు.. కొన్ని సార్లు ఆమెపై సైతం చెయ్యి చేసుకున్నట్లు ఆరోపించింది.
ఇదే విషయమై తన అత్తమామలకు చాలాసార్లు చెప్పినట్లు తెలిపిన నికితా శర్మ.. అది భార్యాభర్తల విషయమని, మీరే చూసుకోండి అని వదిలేసినట్లు నికితా తెలిపింది. మానవ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు తన అత్తమామలకు, తల్లిదండ్రులకు.. అతను ఏదైనా తీవ్రమైన చర్యకు పాల్పడే అవకాశాలున్నాయని చెప్పినట్లు తెలిపింది. అతని సోదరికి కూడా తెలిపానని, వాళ్లు పట్టించుకోలేదంటూ తెలిపారు.
Also Read : Uttarakhand Avalanche : ఉత్తరాఖండ్‌లో విషాదం.. మంచు చరియలు విరిగిపడి 42 మంది కార్మికులు..
గతంలో బెంగళూరుకు చెందిన టెకీ అతుల్ సుభాష్.. ఇదే తీరుగా భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ కేసులో అతని భార్య నిఖితా సింఘానియా, ఆమె తల్లి నిషా సింఘానియా, బావమరిది అనురాగ్ సింఘానియాలను పోలీసులు అరెస్టు చేశారు. నిఖితాను హర్యానాలోని గురుగ్రామ్‌లో, నిషా, అనురాగ్‌ను ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అతుల్ తన ఆత్మహత్యకు ముందు 24 పేజీల సూసైడ్ నోట్ రాశాడు. అలాగే.. 80 నిమిషాల వీడియో రికార్డ్ చేసి.. తన భార్య, ఆమె కుటుంబం నుంచి అతను ఎదుర్కొన్న వేధింపుల గురించి వివరించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అదే తీరుగా.. ఇప్పుడు మరో టెకీ భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడడంతో.. మరోసారి ఈ చర్య కొనసాగుతోంది.