Uttarakhand Avalanche : ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఇక్కడి చమోలి జిల్లాలో మంచు చరియలు విరిగిపడడంతో 57 మంది కార్మికులు మంచులో కూరుకుపోయారు. ఇండో-టిబెటన్ సరిహద్దుకు దగ్గర్లోని మానా గ్రామంలో ఈ ఘటన జరగగా.. ప్రమాదంలో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. మరో 42 మంది కార్మికుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ దుర్ఘటన విషయం తెలియగానే రంగంలోకి దిగిన భారత ఆర్మీ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రమాదం నుంచి రక్షించిన వారికి మానా సమీపంలోని ఆర్మీ క్యాంప్‌నకు తరలించి, చికిత్స అందిస్తున్నారు. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సంఘటన బద్రీనాథ్ ధామ్ కు 3 కి.మీ దూరంలో, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) శిబిరానికి సమీపంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ప్రమాద సమయంలో కార్మికులు రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), జిల్లా యంత్రాంగం, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), BRO బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో భారీ మంచు కురుస్తున్న కారణంగా.. మంచు చరియలు విరిగిపడినట్లు అధికారులు తెలుపుతున్నారు.
ఈ ప్రమాదం జరిగిన సమయంలో.. బద్రీనాథ్ ధామ్‌లో భారీగా హిమపాతం కురుస్తోందని అధికారులు వెల్లంచారు. దాంతో.. సహాయక చర్యలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ సైనిక బృందాలు.. కార్మికులను మంచు నుంచి సురక్షితంగా బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయని.. సైనిక అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అధికారులు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, వారి కోసం గాలింపు చేపట్టారు.
ఇదే సమయంలో.. ఉత్తరాఖండ్ లో మంచు కురుస్తుండడం, మరింతగా మంచు కురిసే అవకాశాలుండడంతో.. వాతావరణ శాఖఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. శుక్రవారం రాత్రి కూడా మంచు వర్షం కురువగా.. 20 సెంటీమీటర్ల మేర భారీ మంచు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రమాద సమయంలో కార్మికులంతా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ – (బీఆర్ఓ) అనే భారత ప్రభుత్వ రోడ్డు నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న రోడ్డు నిర్మాణ పనుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంస్థ భారత సరిహద్దు ప్రాంతాలలో రోడ్ల నిర్మాణం, అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలు చూస్తుంటుంది. ఈ సంస్థ భారతదేశంలో రక్షణ, సరిహద్దు భద్రత, అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది.
సరిహద్దుల్లోని కఠిన వాతావారణ పరిస్థితుల్లో పనులు నిర్వహించడంతో ఈ సంస్థ సుదీర్ఘ అనుభవం సాధించింది. అక్కడి కొండ చరియల్ని తొలిచి… సుదూర ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచడంలోనూ, సైన్యాన్ని త్వరితగతిన బోర్డర్ కు తరలించేందుకు అవసరమైన రోడ్లను, ఇతమ మౌలిక వసతుల్ని అభివృద్ధి చేస్తుంటుంది. ఇది పని చేసే ప్రదేశాల్లోని ప్రతికూలతల కారణంగా.. నిత్యం ప్రమాదాల్ని ఎదుర్కొంటూనే ఉంటుంది. వాటిని.. అక్కడి సహాయక, రెస్కూ సిబ్బంది సమర్థవంతంగా నిర్వహించిన చరిత్రా ఈ బోర్డర్ రోడ్డు ఆర్గనైజేషన్ కు ఉంది.