CM Revanth Reddy: రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని గాంధీభవన్ లో శుక్రవారం టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ అధ్యక్షత వహించారు.
సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీనాక్షి నటరాజన్ లాంటి ఇన్చార్జిని నియమించినందుకు ముందుగా ఏఐసీసీకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రక్రియ నిరంతరంగా కొనసాగాలని, అలాగే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలన్నారు. పార్టీ జెండా మోసిన వారికి ఖచ్చితంగా గుర్తింపు ఉంటుందని, పార్టీ కోసం కష్టపడిన వారికే నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు.
సుదీర్ఘకాలంగా పనిచేసిన వారిలో కొంతమందికి అవకాశాలు రాలేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని, కానీ అటువంటి వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందన్నారు. రాబోయే రోజుల్లో సుదీర్ఘకాలంగా పార్టీ కోసం పని చేసిన వారికి తప్పకుండా ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. వివిధ జిల్లాలలో ఖాళీగా ఉన్న కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు, నామినేటెడ్ పోస్టుల భర్తీ చేయాల్సి ఉందని, మార్చి 10వ తేదీలోగా అన్ని జిల్లాలలో నియామకాలు ఇచ్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రులకు సీఎం ఆదేశించారు. పదవులు వచ్చిన వారు పార్టీ కోసం కష్టపడాలని, అప్పుడే పార్టీ బలోపేతం అవుతుందన్నారు. పనితీరు సక్రమంగా లేని నాయకులకు ఎట్టి పరిస్థితుల్లో పదవుల రెన్యువల్ ఉండదని సీఎం తేల్చిచెప్పారు. మంచిని మైక్ లో చెప్పండి.. చెడును చెవిలో చెప్పాలని సీఎం ఈ సందర్భంగా కార్యకర్తలకు సూచించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన ప్రజా పాలనగా సాగిందని ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు సీఎం ప్రకటించారు. రూ. 4200 కోట్లు వెచ్చించి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన ఘనత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అలాగే గృహ జ్యోతి పథకాన్ని ప్రవేశపెట్టి 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామన్నారు. కేవలం 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా జనవరి 26వ తేదీన మూడు బృహత్తర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని, రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకే కాకుండా వ్యవసాయ కూలీలకు సైతం ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.
రుణమాఫీని విజయవంతంగా అమలు చేసి రైతులకు ప్రభుత్వం భరోసానిచ్చిందన్నారు. మన విజయాలను మనమే చెప్పుకోవాలని, అప్పుడే ప్రజల్లో మనం చేసే మంచి వెళ్తుందన్నారు. యావత్ దేశం మొత్తం గర్వించేలా కులగణన సర్వే చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని, ఎందరో విమర్శకులు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారన్నారు. ఇటీవల దావోస్ పర్యటనలో అత్యధిక విదేశీ పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని, అలాగే స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
Also Read: Crime News: అమ్మో ఆడ దొంగలు.. బెట్టింగ్ దెబ్బకు చైన్ స్నాచింగ్ చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు
దేశానికి తెలంగాణ కొత్త మోడల్ ను క్రియేట్ చేస్తుందని రాహుల్ గాంధీని ప్రధానిని చేసే వరకు ప్రతి కార్యకర్త శాయశక్తులా పని చేయాలని సీఎం పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీ పట్టుదలతోనే కులగణన, ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చేయగలిగినట్లు సీఎం అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉంటేనే సంక్షేమ పథకాలను అమలు చేశామని, దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. చివరగా కార్యకర్తలతో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే ఎజెండాగా పనిచేయాలని సీఎం కోరారు.
కిషన్ రెడ్డి పై సీఎం ఫైర్..
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పై మరోమారు సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. కిషన్ రెడ్డి వల్లే మెట్రో, మూసీ ప్రాజెక్టులు ఆగిపోయాయని, కిషన్ రెడ్డి సైంధవ పాత్ర పోషిస్తున్నారన్నారు. కేంద్ర కేబినెట్ ముందు ప్రాజెక్టుల అంశం పెట్టకుండా, మిగతా మంత్రులపై కిషన్ రెడ్డి ఒత్తిడి తెస్తున్నట్లు సీఎం ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధికి సహకారం అందించడంలో కేంద్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఆరేళ్లు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణకు ఒక్క ప్రాజెక్టు తెచ్చారా అంటూ సీఎం ప్రశ్నించారు.