
EC : 2024 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే వారిని ఓటర్లుగా చేర్చాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్రాల ఎన్నికల ముఖ్య అధికారులను ఆదేశించింది. అయితే ఈ ఏడాది డిసెంబర్ నెలాఖరులోపు ఎన్నికలు జరగనున్న తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ చేపట్టరు. మిగతా అన్ని రాష్ట్రాల అధికారులు జనవరి 1 నాటికి 18ఏళ్లు నిండిన వారిని ఓటర్ల జాబితాలో చేర్చాలని ఈసీ స్పష్టం చేసింది. 2024 జనవరి 1ను గడువుగా పెట్టుకుని వార్షిక ఓటర్ల జాబితా సవరణ చేపట్టాలని ఆదేశించింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1950లో కొత్త ఓటర్లను చేర్చడానికి జనవరి 1, ఏప్రిల్ 1, జులై 1, అక్టోబర్ 1ను అర్హత తేదీలుగా నిర్ణయించారు. అందుకే జనవరి 1ను గడువుగా పెట్టుకుని ఓటర్ల వార్షిక సవరణ కార్యక్రమం చేపట్టాలని ఈసీ సూచించింది. కొత్త ఓటర్ల జాబితాను ముందే ప్రచురిస్తే.. కొత్త ఓటర్లకు జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవంనాడు ఫొటో గుర్తింపు కార్డులు పంపిణీ చేయొచ్చని తెలిపింది.
పోలింగ్ ప్రక్రియపైనా ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక కుటుంబంలోని ఓటర్లు ఒకే స్టేషన్ పరిధిలో ఉండాలని స్పష్టం చేసింది. 1500 ఓటర్లకు మించిన పోలింగ్ స్టేషన్లను హేతుబద్ధీకరించాలని సూచించింది. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించకముందే ఈ పని పూర్తి చేయాలని నిర్దేశించింది. ఒక భవనంలో నివసించే ఓటర్లకు ఒకే పోలింగ్ స్టేషన్ కేటాయించాలని స్పష్టం చేసింది.