Tribal Woman Assault| దేశంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా దళితులు, ఆదివాసీలకు అన్యాయం జరుగుతూనే ఉంది. వారి పట్ల హీన భావన కలిగిన వారు ఇంకా మన సమాజంలో ఉన్నారనేందకు తాజాగా జరిగిన ఘటన ఉదాహరణ. తన పొలంలోని పంటను ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తి నాశనం చేస్తుంటే ప్రతిఘటించిన ఒక ఆదివాసీ యువతిని దారుణంగా చితకబాది.. ఆ తరువాత ఆమె చేతుల్లో కట్టేసి బలవంతంగా ఆమె చేత మలం తినిపించారు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని బోలాన్‌గీర్ జిల్లా జురబంధా గ్రామనికి చెందిన ఒక అగ్రకులం వ్యక్తి నవంబర్ 16న ట్రాక్టర్ తీసుకొని పొలంలో పండిన పంటను మొత్తం నాశనం చేశాడు. ఆ పొలం ఒక ఆదివాసీ కుటంబానికి చెందినది. అయితే ఆ పొలాన్ని సదరు వ్యక్తి ఆక్రమించుకోవడానికి ప్రయత్నించాడు. అతను పొలంలో పంటను నాశనం చేస్తుండగా.. ఆ పొలం యజమాని కూతురు (20) అక్కడికి చేరుకొని అతడిని అడ్డుకుంది. దీంతో ఆ అగ్రకులం వ్యక్తి అడ్డుగా ఉన్న ఆదివాసీ యువతిని చితకబాదాడు. మహిళ అని కూడా చూడకుండా తీవ్ర రక్త స్రావం అయ్యేలా కొట్టాడు.
Also Read: పిల్లాడిని వెంటబెట్టుకొని జొమాటో డెలివరీ.. మహిళపై ప్రశంసల వర్షం కురిపిస్తున్న నెటిజెన్లు
ఆ తరువాత ఆమె చేతులు, కాళ్లు కట్టేసి ఆమె నోట్లో మలం కుక్కాడు. ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఆ యువతి పిన్ని(42) అక్కడికి వచ్చింది. జరుగుతున్న అన్యాయాన్ని ఆపేందుకు ప్రయత్నించగా.. ఆమెను కూడా కొట్టారు. ఈ ఘటన గురించి పొలం యజమాని అయిన ఆదివాసీ కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ దారుణ ఘటనని ప్రతిపక్ష పార్టీ బిజేపీ ఎంపీ నిరంజన్ బిసీ ఖండించారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ” ఆదివాసీల భూములను కాజేసేందుకు కొందరు ప్రయత్నిస్తుననారు. వారికి అధికారి పార్టీ నాయకుల అండదండలున్నాయి. అందుకే పోలీసులు ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. నిందితులెవరో బాధితులు చెప్పినా పోలీసులు మౌనంగా ఉన్నారు. ఈ అన్యాయం పట్ల ఆదివాసీ సమాజం ఆగ్రహంగా ఉంది. ఆ ప్రాంతంలో ఏదైనా శాంతి భద్రతల సమస్య వస్తే.. దానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి” అని ఎంపీ నిరంజన్ బిసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
నిందితులను అరెస్టు చేయకపోవడంపై బోలాన్‌గిర్ ఎస్‌పీ ఖిలారీ రిషిరేష్ మాట్లాడుతూ.. నిందితుడు పరారీలో ఉన్నాడని.. అతని కోసం గాలిస్తున్నామని మీడియాకు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు రెండు బృందాలు వెతుకుతున్నాయని.. పొరుగు రాష్ట్రాల్లో నిందితుడు దాగి ఉన్నట్లు సమాచారం అందిందని అక్కడ కూడా పోలీసులకు సమాచారం అందించామని వెల్లడించారు.
ఆదివాసీ యువతిపై దాడి చేసినందుకు ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం.. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
అక్టోబర్ 4, 2024న కూడా ఇలాగే ఒక ఆదివాసీ యువకుడు తమ దారికి అడ్డుగా నిలబడి ఉన్నాడని ఇద్దరు యువకులు అతడిని చితకబాదారు. ఆ తరువాత అతని ముఖంపై మూత్ర విసర్జన చేశారు. బాధితుడు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సోన్ భద్ర జిల్లాలో జరిగింది. పోలీసులు ఆ ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.