Bus Accident : జనగామ జిల్లాలో గుండె తరుక్కుపోయే సంఘటన చోటుచేసుకుంది. సంతోషంగా మొదలైన ఉదయం.. కొన్ని గంటల్లోనే తీరని విషయాన్ని మోసుకొచ్చింది. చేతిలోనే రెండేళ్ల చిన్నారి.. బస్సు చక్రాల కింద నలిగిపోయిన హృదయ విదారకర ఘటన ఇది.
జిల్లాలోని కొడకండ్ల మండలం చెరువుముందు తండాలో నివాసముండే ఓ కుటుంబానికి.. పాఠశాల బస్సు రూపంలో మృత్యువు ఎదురైంది. కూతురు చదువుకునే పాఠశాల బస్సు కిందపడి రెండేళ్ల తమ కుమారుడు చనిపోవడంతో వారి ఆక్రందనలకు అదుపులేకుండా పోయింది. స్థానికులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన దాని ప్రకారం..
దేవరుప్పలలోని బాలు ఏసు పాఠశాలలో చదువుతున్న కూతుర్ని బస్సు ఎక్కించేందుకు ఓ తల్లి వచ్చింది. ఆమెతో పాటు తన రెండేళ్ల శ్రీహాన్ అనే బాలుడు కూడా వచ్చాడు. సంతోషంగా అక్కకు వీడ్కోలు పలికాడు. ఆ చిన్నారి సైతం.. సాయంత్రం త్వరగా వచ్చేస్తా తమ్ముడూ అంటూ చేతులు ఊపుతూ.. వెళ్లి బస్సులో కూర్చొంది. అంతలోనే.. చిన్నారి, ముద్దుల తమ్ముడిని బస్సు చక్రాలు చిదిమేశాయి.
అటు తిరిగి, ఇటు చూసేవరకు చేతిలోని చిన్నారి కొడుకు… బస్సు వెనుక చక్రాల కింద విగతజీవిగా పడి ఉండడంతో ఆ తల్లికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయ్యో కొడుకా అంటూ ఆమె ఏడుపు చుట్టుపక్కల వారిని తీవ్రంగా కలిచివేస్తోంది. సాయంత్రం వచ్చి చిన్నారి తమ్ముడితో ఆడుకుందాం అనుకున్న ఆ పాపకు.. తమ్ముడి ఇక తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడన్న వార్త తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ఈ ఘటనతో.. ఆ గ్రామమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.