Russia Ukraine War : ఉక్రెయిన – రష్యా మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ఆయా దేశాల్లోని భారతీయులు చాలా మంది తిరిగి వచ్చేశారు. కానీ.. కొంత మంది ఏజెంట్ల చేతిలో మోసపోయి చిక్కుకునిపోయారు. అలా.. కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులు రష్యా ఆర్మీ తరఫున పనిచేస్తుండగా.. యుద్ధంలో గాయపడి వారిలో ఓ యువకుడు మరణించారు. మరొకతను తీవ్రంగా గాయపడి మాస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
కేరళకు చెందిన బినిల్(32), అతని బంధువుల కుర్రాడు జైన్ (27) అనే యువకులు.. ఐటీఐ డిప్లోమా పూర్తి చేశారు. ఉద్యోగాలు, అధిక జీతాల ఆశతో గతేడాది వీరిద్దరు ప్రైవేటు వీసా మీద రష్యా వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత రష్యా సైన్యం ఈ ఇద్దరి పాస్ పోర్టుల్ని స్వాధీనం చేసుకుని.. యుద్ధం జరిగే ప్రాంతానికి పంపించింది. దాంతో.. మోసపోయామని గుర్తించిన యువకులు.. స్వదేశంలోని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అక్కడి నుంచి తిరిగి భారత్ కు వచ్చే ప్రయత్నాల్లో ఉండగా.. బినిల్ అనే యువకుడు తీవ్రంగా గాయపడి చనిపోయాడు. మరో యువకుడు జైన్.. తీవ్ర గాయాలతో మాస్కోలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఈ విషయాన్ని రష్యాలోని భారత కార్యాలయం నుంచి మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. దీంతో.. వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై జాతీయ మీడియాతో పాటు స్థానిక మీడియా వరుస కథనాలు ప్రసారం చేసింది. రష్యాలో చిక్కుకున్న భారతీయలను కాపాడాలంటూ కోరింది. దీంతో.. భారత విదేశాంగశాఖ స్పందించింది. ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించింది.
కేరళ యువకుడి విషయాన్ని రష్యా విదేశాంగ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపిన భారత అధికారులు.. రష్యాలో యుద్ధంలో పాల్గొంటున్న భారతీయుల్ని వెంటనే విడుదల చేయాలని కోరారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా యుద్ధ క్షేత్రాల్లోని భారతీయులను అక్కడి నుంచి పంపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనలో విడుదల చేసింది.
యువకుడు బినిల్ మరణంపై కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ స్పందించారు. బాధిత యువకుడి మరణానికి సంతాపం ప్రకటించిన రణధీర్.. వారి కుటుంబానికి కావాల్సిన సాయం చేస్తామని ప్రకటించారు. మాస్కోలోని భారత కార్యాలయం నేరుగా మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడుతోందని తెలిపారు. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు రప్పించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అలాగే.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువకుడిని స్వదేశానికి తీసుకువచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు.
Our response to media queries regarding death of an Indian national in Russia:https://t.co/pkC6jXkRin pic.twitter.com/2q6PELLHPl
— Randhir Jaiswal (@MEAIndia) January 14, 2025
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అక్కడ చిక్కుకుపోయిన భారతీయుల్ని స్వదేశానికి రప్పించేందుకు భారత విదేశాంగ శాఖ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందుబాటులోని అన్ని మార్గాల్లో వారిని రప్పించేందుకు యత్నిస్తోంది. ఈ క్రమంలోనే గతేడాది రష్యాలో జరిగిన బ్రిక్స్ సమావేశంలో.. ప్రధాని నరేంద్రమోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ తో చర్చలు జరిపారు. ఆ ఫలితంగానే.. అనేక మంది భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చారని ప్రకటించారు.