South africa illigal mining : ఆకలి, పేదరికం కారణంగా అక్రమ మార్గాల్లో మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్న వేల మంది దక్షిణాఫ్రికాలోని స్టిల్‌ఫోంటైన్ గనిలో చిక్కుబడిపోయారు. ఇప్పటి వరకు వీరిలో 15 మంది మృతదేహాలను రెస్కూ బృందాలు బయటకు తీయగా, మరో 44 మందిని ప్రాణాలతో కాపాడారు. కాగా.. లోపల మరో వంద మంది మృతదేహాలున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దక్షిణాఫ్రికాలోని కొన్ని బంగారు గనుల్లో ప్రభుత్వం తవ్వకాలు నిలిపివేసింది. దాంతో.. ఆయా గనుల్లోకి అక్రమంగా ప్రవేశించి, విలువైన లోహాల కోసం మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. స్థానికులతో పాటు పక్క దేశాల నుంచి కూడా యువతను తీసుకువచ్చి.. ఈ గనుల్లో పనులకు దించుతారు. ఇది ఎంతో ప్రమాదకరమని, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా మైనింగ్ గనుల్లోకి దిగడం ప్రాణాలతో చెలగాటమాడడమే అని ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా.. వాళ్లు వినడం లేదు. ఈ క్రమంలోనే 2023 అక్టోబర్ లో మైనింగ్ కార్మికులను గనుల్లోకి వెళ్లకుండా నిరోధించేందుకు వారికి ఆహారం, నీరు, మందుల సరఫరాలను పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి గనుల్లోపలే వందల మంది చిక్కుకునిపోయారు.
మైనింగ్ అఫెక్టెడ్ కమ్యూనిటీస్ యునైటెడ్ ఇన్ యాక్షన్ (మాకువా) అనే NGO విడుదల చేసిన ఓ వీడియోలో గనిలోని ఓ సొరంగంలో 50 కంటే ఎక్కువ మృతదేహాలు కనిపిస్తున్నాయి. మరొక వీడియోలో.. ఆహారం లేక అస్థిపంజరాలు బయటపడ్డ మనుషులు.. ఆహారం పంపి రక్షించమని వేడుకుంటున్నారు. జోహన్నెస్ బర్గ్‌కు నైరుతి దిశలో 100 మైళ్ల దూరంలోని స్టిల్‌ఫోంటైన్ సమీపంలోని బఫెల్స్‌ఫాంటైన్ గనిలో 400 నుంచి 800 మంది ప్రజలు ఇంకా సజీవంగా ఉన్నారని ఈ ఎన్జీవో చెబుతోంది.
అక్రమ మైనింగ్‌ను అరికట్టేందుకు 2023 చివరిలో పోలీసులు ఆపరేషన్ ప్లగ్ ది హోల్ ను ప్రారంభించారు. నవంబర్ ప్రారంభంలో, స్టిల్‌ఫోంటైన్ చుట్టూ ఉన్న మైన్‌షాఫ్ట్‌ల నుంచి అవసరమైన సామాగ్రి పంపబడకుండా అడ్డుకున్నారు. ఇది సత్ఫలితాల్ని ఇచ్చింది. ఆకలి, వైద్యం కోసం వందల మంది మైనర్లు గనుల నుంచి బయటకు వచ్చేశారు. ఇప్పుడు కూడా.. ఇదే పద్దతిలో గనుల లోపలికి ఆహారం, మందులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో.. ఈ వంద మంది చనిపోయారని అంటున్నారు.
కాగా.. దక్షిణాఫ్రికాలోని వివిధ గనుల్లో సుమారు 4 వేల మంది మైనర్లు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎన్ని సార్లు హెచ్చరించినా.. గనుల్లోకి వెలుతుండడంతో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. గనుల్లో చిక్కుకున్న వారిని కాపాడే ప్రసక్తే లేదని తేల్చి చెబుతోంది. అలా చేస్తేనే.. అక్రమ మైనింగ్ ఆగిపోతుందని అభిప్రాయపడుతోంది.
మైనింగ్ కు పాల్పడుతున్న వారు బయటకు వస్తే అరెస్ట్ చేస్తామంటూ ప్రకటించింది. ఇందు కోసం ‘క్లోజ్‌ది హోల్’ ఆపరేషన్‌ను చేపట్టింది. గనుల్లోకి వెళితే తీవ్ర అనారోగ్య సమస్సలకు గురవుతారని చెబుతున్నా, ప్రత్యమ్నాయ ఉపాధి మార్గాలు చూపిస్తున్నా.. గనుల్లోకి వెళుతుంటే ఉపేక్షించేది లేదని ప్రభుత్వం చెబుతోంది. ఇలా.. ఓ వైపు ఆహారం ఆపేయడం, మరోవైపు బయటకు వస్తే అరెస్ట్ చేస్తామని చెబుతుండడంతో గనుల్లోని వాళ్లు బయటకు వచ్చేందుకు భయపడిపోతూ, అక్కడే చనిపోతున్నారు.
Also read : జపాన్ లో భారీ భూకంపం.. రికార్ట్ స్కేల్ పై 6.9 తీవ్రత.. సునామీ హెచ్చరికలు జారీ
కొన్ని రోజుల క్రితం గనుల్లో చిక్కుకున్న వారిని అలా వదిలేయడం సరైంది కాదన్న ఆ దేశ న్యాయస్థానం.. వారిని బయటకు తీసుకువచ్చేందుకు సాయం చేయాలని ఆదేశించింది. దాంతో.. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే కొందరిని సజీవంగా బయటకు తీసుకురాగా.. మరికొందరి మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా.. పెద్ద సంఖ్యలో గనుల్లో చిక్కుకుని ఉన్నారని అంటున్నారు.