UPSC Principal recruitment 2026: విద్యారంగంలో స్థిరపడి, ఉన్నతమైన స్థాయిలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే వారికి కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ఒక సువర్ణావకాశాన్ని తీసుకొచ్చింది. ఢిల్లీ ప్రభుత్వ విద్యాశాఖలో 828 ప్రిన్సిపాల్, వైస్-ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు గడువు, అర్హతలు, ఎంపిక విధానం తదితర వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం!
ఈ నోటిఫికేషన్‌లో మొత్తం 828 ఖాళీలు ఉండగా.. అందులో 124 ప్రిన్సిపాల్ పోస్టులు, 704 వైస్-ప్రిన్సిపాల్ పోస్టులు ఉన్నాయి. మహిళలు, పురుషులు ఇద్దరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ జులై 25న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 14 సాయంత్రం 6 గంటల వరకు గడువు ఉంది.
అర్హతల విషయానికి వస్తే.. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ (PG)తో పాటు బి.ఎడ్ (B.Ed) పూర్తి చేసి ఉండాలి. దీనితో పాటు సంబంధిత టీచింగ్ అనుభవం తప్పనిసరి. ప్రిన్సిపాల్ పోస్టుకు 10 సంవత్సరాల బోధనా అనుభవం ఉండాలి. వైస్-ప్రిన్సిపాల్ పోస్టుకు పీజీటీగా 2 సంవత్సరాలు లేదా టీజీటీగా 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారు అర్హులు.
వయోపరిమితి పరంగా ప్రిన్సిపాల్ పోస్టులకు గరిష్టంగా 50 ఏళ్లు, వైస్-ప్రిన్సిపాల్ పోస్టులకు 35 ఏళ్లుగా నిర్ణయించారు. రిజర్వేషన్ వర్గాలైన OBC, SC, ST, PwBD, మాజీ సైనికోద్యోగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో మినహాయింపులు ఉంటాయి.
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుంది. మొదట కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటాయి. మెరిట్ లిస్ట్ రూపొందించడంలో రాత పరీక్షకు 75 శాతం, ఇంటర్వ్యూకి 25 శాతం వెయిటేజ్ ఇస్తారు. రాత పరీక్ష నవంబర్ 01న 15 ప్రధాన కేంద్రాల్లో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో జరగనుంది. ఈ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది.
జీతం విషయానికి వస్తే, 7వ సీపీసీ ప్రకారం ప్రిన్సిపాల్ పోస్టులకు పే లెవెల్-12, వైస్-ప్రిన్సిపాల్ పోస్టులకు పే లెవెల్-10 కింద ఆకర్షణీయమైన వేతనం అందుతుంది. దరఖాస్తు రుసుము కేవలం రూ. 25 మాత్రమే కాగా, మహిళలు, ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూబీడీ,అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
విద్యార్హతలు, అనుభవం ఉన్న అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని పరీక్షకు సిద్ధమవ్వడం మంచిది.