Xi Jinping Visit: భారత్ లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ పర్యటన ఖరారైంది. ఆయన విజిట్ పై కొద్ది రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ చైనా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 12, 13వ తేదీల్లో జిన్ పింగ్ దిల్లీకి వస్తారని.. అక్కడ జరిగే 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారని స్పష్టం చేసింది.
కాగా, బుధవారం జరిగిన విలేకారుల సమావేశంలో చైనా విదేశాంగ ప్రతినిధి గువో జియా-కున్.. తమ అధ్యక్షుడి భారత పర్యటనపై నీళ్లు నమిలారు. తమ అధినేత పర్యటనపై తన వద్ద ఎలాంటి సమాచారం లేదని వ్యాఖ్యానించారు. దీంతో జిన్ పింగ్ భారత్ కు వస్తారా? లేదా? అన్న చర్చ మెుదలైంది. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే చైనా విదేశాంగ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేయడంతో జిన్ పింగ్ రాకపై స్పష్టత వచ్చింది.
2020లో గాల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత రెండు దేశాల సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ ఘటన తర్వాత షీ జిన్‌పింగ్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి. చివరిగా ఆయన 2019లో తమిళనాడులోని మామల్లపురంలో జరిగిన అనధికారిక సమ్మిట్ కోసం భారత్‌కు వచ్చారు. అంతకుముందు 2014లో తొలిసారి, అలాగే 2016లో గోవా బ్రిక్స్ సమ్మిట్‌కు ఆయన హాజరయ్యారు.
ఇదిలా ఉంటే గతేడాది ప్రధాని మోదీ చైనా పర్యటన తర్వాత ఇరు దేశాల సంబంధాల్లో కొంత సానుకూల మార్పు వచ్చింది. అమెరికాతో ఏర్పడిన వాణిజ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్, చైనా పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలోనే చైనా విదేశాంగ శాక కీలక ప్రకటన చేసింది. ‘రెండు దేశాలు పోటీదారులు కాదు, భాగస్వాములు. ఒకరికొకరు అభివృద్ధికి అవకాశాలుగా నిలుస్తారు’ అని ఇరు దేశాల అధినేతలు భావిస్తున్నట్లు తెలిపింది.
Also Read: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్‌లోనే.. సిటీ బస్సుల లైవ్ లొకేషన్!
మరోవైపు సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత చైనా పెట్టుబడులపై విధించిన కొన్ని ఆంక్షలను భారత్ ఇటీవల సడలించింది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, క్యాపిటల్ గూడ్స్, సోలార్ రంగానికి సంబంధించిన పెట్టుబడులకు వెసులుబాటు కల్పించింది. మరోవైపు గతేడాది ఇరు దేశాల మధ్య వాణిజ్యం 12.4 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 155 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ ఏడాది తొలి ఏడు నెలల్లోనూ ద్వైపాక్షిక వాణిజ్యం 23 శాతం వృద్ధి నమోదు చేయడం గమనార్హం.
Also Read: గుజరాత్ ఒమ్ని vs ఇటలీ బార్.. 80s ఏఐ ట్రెండ్‌తో.. రచ్చకెక్కిన బీజేపీ, కాంగ్రెస్!