Nitish Kumar: ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఇలా ఇప్పటికి 9 సార్లు పూర్తైంది. మరి పదోసారి..? అంటే మళ్లీ ఆయనే. ఏంటి ఈ నెంబర్లు అనుకుంటున్నారా..? బీహార్ ముఖ్యమంత్రిగా 9 సార్లు బాధ్యతలు చేపట్టారు నితీశ్‌కుమార్. ఇప్పుడు మరోసారి ఎన్డీఏ కూటమి ఘన విజయంతో ఆయన పదోసారి సీఎం అయ్యేందుకు సిద్ధమయ్యారు.
బీహార్ రాజకీయాల్లో అపర చాణక్యుడిగా చెబుతుంటారు జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌ను. ఇందులో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తన పదవి కోసం.. దాన్ని కాపాడుకునేందుకు ఏ కూటమిలోకైనా జంప్ చేయగల నేర్పు నితీశ్ సొంతం. అంతేనా.. ఎక్కడ ఉన్నా ఆయన సీఎం. మిగిలిన వాళ్లు ఎవరైనా సరే ఆయన వెనకాల ఉండాల్సిందే. బీహార్‌లోని ప్రాంతాయ పార్టీలే కాదు.. హస్తిన కేంద్రంగా నడిచే జాతీయ పార్టీలైనా సలాం నితీష్ అనాల్సిందేనని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.
నితీశ్ కుమార్ 20 ఏళ్లుగా బీహార్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. పట్నా సమీపంలోని భక్తియార్‌పూర్‌లో 1951లో జన్మించిన ఆయన.. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉన్న నితీశ్ కుమార్.. జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన ఉద్యమంలో పాల్గొన్నారు. అప్పుడే లాలూ, సుశీల్ మోడీ సహా ఇతర నేతలతో పరిచయం ఏర్పడింది. 1985లో నితీశ్‌కుమార్ లోక్‌దళ్ పార్టీ నుంచి తొలిసారిగా హర్నౌత్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఐదేళ్ల తర్వాత ఎంపీగా విజయం సాధించారు. బీహార్‌లో రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగుతున్న వేళ.. జార్జి ఫెర్నాండెజ్‌తో కలిసి 1994లో సమతా పార్టీఏర్పాటు చేశారు. 2 వేల సంవత్సరంలో తొలిసారిగా సీఎం బాధ్యతలు చేపట్టిన ఆయన.. మార్చి మూడు నుంచి పది వరకు కేవలం ఏడు రోజులు మాత్రమే ముఖ్యమంత్రిగా కొనసాగారు. అనంతరం జనతాదళ్ యునైటెడ్ – JDUను ఏర్పాటు చేశారు. ఇక, అప్పటి నుంచి మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు నితీశ్ కుమార్.
2005లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నితీశ్ కుమార్ అప్పటివరకు జంగల్‌రాజ్‌గా పేరు పడిన బీహార్‌లో తన మార్కు చూపించడం మొదలు పెట్టారు. పరిపాలనలో దూకుడుగా వ్యవహరించారు. రహదారులు, మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుదీకరణ, విద్య, మహిళా సాధికారత, శాంతి భద్రతలు.. ఇలా పలు అంశాల్లో మార్పునకు పెద్దపీట వేశారు. ఫలితంగా బీహార్‌ను మార్చేసిన సీఎంగా పేరు తెచ్చుకున్నారు నితీశ్ కుమార్.
బీహార్ తలరాత మార్చిన నేతగా పేరు తెచ్చుకున్నా.. సీఎం పీఠాన్ని అధిరోహించినా, యూటర్న్ నేతగా మాత్రం పేరు తెచ్చుకున్నారు నితీశ్ కుమార్. ఇందుకు కారణం.. అవసరమైన ప్రతిసారీ కూటములను మార్చడమే. ఇదేదో ఆషామాషీగా చెబుతున్న అంశమేమీ కాదు. కాలక్రమంలో బీజేపీ మిత్రపక్షంగా కొనసాగిన నితీశ్ కుమార్ 2013లో కమలానికి కటీఫ్ చెప్పేశారు. కానీ, కాంగ్రెస్, సీపీఐ సాయంతో 2014 మే వరకు అధికారంలో కొనసాగారు. మొదట్లో దీన్ని నితీశ్ చాణక్యంగా అంతా భావించారు. ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో అంటే 2015లో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ కలిపి మహా కూటమిగా ఏర్పడి బరిలో దిగి విజయం సాధించాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కానీ, రెండేళ్ల తర్వాత కూటమికి ఊహించని షాక్ ఇచ్చారు నితీశ్.
తేజస్వీయాదవ్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో తన నిర్ణయాన్ని మార్చుకున్న నితీశ్ కుమార్ తిరిగి ఎన్డీఏ గూటికి 2017లో చేరారు. దీంతో.. అంతా ఆశ్చర్యపోయారు. సీఎంగా పాలన కొనసాగించారు. అనంతరం జరిగన 2020 అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చవి చూశారు. అయితే.. తమ పరాజయానికి కారణం బీజేపీనే అని చెబుతూ మళ్లీ 2022లో ఎన్డీఏను వీడారు. మహా కూటమికి చేరువై సీఎం పీఠాన్ని అధిరోహించారు. ఆ తర్వాత వచ్చిన కొన్ని సమస్యలతో కేవలం 18 నెలల్లోనే మళ్లీ కాంగ్రెస్, ఆర్జేడీ కూటమికి హ్యాండిచ్చి కమలంతో దోస్తీ అని జనాలకు తన మార్కు రాజకీయంతో ఏమీ అర్థంకాని పరిస్థితి కల్పించారు నితీశ్.
Also Read: కెమికల్ కిల్లర్స్.. లక్షల మందిని చంపే ప్లాన్!
2025 ఎన్నికల్లో కమలంతో కలిసి ఎన్నికలకు వెళ్లిన నితీశ్‌కుమార్ మరోసారి బంపర్ విక్టరీ కొట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే..ఈసారి బీజేపీ, జేడీయూ సరిసమానమైన సంఖ్యలో పోటీ చేశాయి. ఫలితాలు కూడా దాదాపుగా అయితే.. ఇప్పటికే ప్రధాని మోడీ కూడా సీఎంగా నితీశ్ కుమార్ అభ్యర్థిత్వానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. దీంతో.. మరోసారి అంటే పదోసారి ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ బాధ్యతలు చేపట్టడం లాంఛనమనే చెప్పాలి. కాదూ కూడదు అని బీజేపీ అంటే ఇక చెప్పేదేముంది.. మరోసారి నితీష్‌కుమార్.. కూటమిని మార్చడం.. మళ్లీ సీఎం కావడం తథ్యమనే టాక్ బలంగా విన్పిస్తోంది.