OTT Movie : పిల్లలకు చూపించాల్సిన సినిమాలలో సాహస కథలు చాలా ముఖ్యమైనవి. ఇవి పిల్లలలో కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి సహాయపడతాయి. ఈ నేపథ్యంలో ఒక ఫ్యామిలీ అడ్వెంచర్ సినిమా బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచి, విమర్శకుల చేత ప్రశంసలు అందుకుంది. ఈ కథలో 14 ఏళ్ల బాలుడు, తన పెంపుడు కుక్కతో ఒక అడవిలో తప్పిపోతాడు. ఇక అక్కడినుంచి కథ ఒక అడ్వెంచర్ టర్న్ తీసుకుంటుంది. ఫ్యామిలీతో మొత్తంగా కలసి ఈ సినిమాని చూస్తే మంచి ఫీలింగ్ వస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ఫార్ ఫ్రమ్ హోమ్: ది అడ్వెంచర్స్ ఆఫ్ యెల్లో డాగ్’ అమెరికన్ సర్వైవల్ అడ్వెంచర్ ఫ్యామిలీ సినిమా. ఫిలిప్ బోర్సోస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెస్సీ బ్రాడ్‌ఫోర్డ్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ చిత్రం 1995 జనవరి 13న 20th సెంచరీ ఫాక్స్ ద్వారా విడుదలై, ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆపిల్ టీవీలలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా IMDbలో 6.3/10 రేటింగ్ పొందింది.
ఆంగస్ అనే 14 ఏళ్ల బాలుడు కెనడాలోని ఒక చిన్న పట్టణంలో తన తల్లిదండ్రులు జాన్, కేథరీన్, తమ్ముడు సైలస్‌తో జీవిస్తుంటాడు. ఒక రోజు ఆంగస్ ఒక తప్పిపోయిన గోల్డెన్ లాబ్రడార్ కుక్కను ఇంటికి తెచ్చుకుంటాడు. దానికి యెల్లో అని పేరు పెడతాడు. యెల్లోను పెంచుకోవడానికి అంగస్ తన తల్లిదండ్రులను ఒప్పిస్తాడు. కానీ తండ్రి జాన్ ఈ కుక్క అంగస్ బాధ్యత అని హెచ్చరిస్తాడు. అంగస్ యెల్లో కోసం డబ్బు సంపాదించి డాగ్ ఫుడ్ ను కొంటాడు. ఇక వాళ్ళ మధ్య బలమైన బంధం ఏర్పడుతుంది.
ఒక రోజు ఆంగస్ తన తండ్రి, యెల్లోతో కలిసి సముద్రంలో బోటులో వెళ్తుండగా హఠాత్తుగా తుఫాను వస్తుంది. బోటు మునిగిపోతుంది. ఆంగస్, యెల్లో ఒడ్డుకు కొట్టుకుపోతారు. కానీ జాన్ హెలికాప్టర్ రెస్క్యూ లో బతికిపోతాడు. ఆంగస్, యెల్లో ఒక దట్టమైన అడవిలో చిక్కుకుంటారు. మనుషులు ఎవరూ ఉండని ప్రదేశంలో బతకడానికి పోరాడాల్సి వస్తుంది. ఆంగస్ తన తండ్రిని చూసి చాలా విషయాలు నేర్చుకుని ఉంటాడు. వీటిలో ఆహారం సేకరించడం, వంట చేయడం వంటివి కూడా ఉంటాయి. ఈ సమయంలో యెల్లో కూడా తన తెలివితో ఆంగస్‌కు సహాయం చేస్తుంది. వీళ్ళు కలిసి అడవిలో వోల్ఫ్, వైల్డ్‌క్యాట్, ఆహార కొరత వంటి సమస్యలను తెలివిగా హ్యాండిల్ చేస్తారు.
ఆంగస్ ఒకసారి కొండపై నుంచి జారి చేయి విరిగిపోతుంది, కానీ ధైర్యంగా ముందుకు వెళ్తాడు. ఇంతలో ఆంగస్ తల్లిదండ్రులు రెస్క్యూ టీమ్‌లతో అతన్ని వెతుకుతూ ఉంటారు. చివరగా ఆంగస్ ఒక లైట్‌హౌస్‌కు చేరుకుంటాడు. అక్కడ ఒక పైలట్ వాళ్లను చూసి రెస్క్యూ టీమ్‌కు సమాచారం ఇస్తాడు. రెస్క్యూ సమయంలో యెల్లో వెనుక ఉండిపోతుంది, కానీ ఆంగస్ తన కుక్క కోసం విజిల్ ఊదితే, యెల్లో తిరిగి వచ్చి అందరితో కలుస్తుంది. ఈ కథ ఇలా సుఖాంతమవుతుంది.
Read Also : నిద్రపోతే రూపం మారే విడ్డూరం… అలాంటి వాడితో అమ్మాయి ప్రేమ… ఈ కొరియన్ మూవీ క్లైమాక్స్ డోంట్ మిస్