OTT Movie :ఈ రోజుల్లో ఓటీటీ ప్లాట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ కి ఒక అడ్డాగా మారింది. ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూడటానికి థియేటర్లకు వెళ్లేవాళ్ళు మూవీ లవర్స్. ఇప్పుడు ఇంట్లోనే ఏ మూవీ కావాలాన్నా ఓటిటి ప్లాట్ ఫామ్ లో చూస్తూ ఎంటర్టైన్ అవుతున్నారు. థియేటర్లకు బదులు బుల్లితెరలో స్ట్రీమింగ్ అవుతున్న ఓటిటి ప్లాట్ ఫామ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ప్రేక్షకులు. అయితే ఇప్పుడు వెబ్ సిరీస్ ల జోరు కూడా నడుస్తుంది. ఈ వెబ్ సిరీస్ లను కూడా ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఓటిటి ప్లాట్ ఫామ్ లో వెబ్ సిరీస్ లు థియేటర్లతో సంభంధం లేకుండా డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటికి సెన్సార్ నియమాలు లేకపోవడంతో అశ్లీలత ఎక్కువగా ఉన్న సన్నివేశాలను ప్రసారం చేస్తున్నారు. వీటితోపాటు మితిమీరిన హింసతో కూడిన బూతు కంటెంట్ ను ప్రోత్సహించే విధంగా కొన్ని ఓటిటి ప్లాట్ ఫామ్స్ వీటిని అడ్డు అదుపు లేకుండా ప్రసారం చేస్తున్నాయి.
మితిమీరిన బూతు కంటెంట్ ప్రసారం చేసే 18 ఓటిటి ప్లాట్ ఫామ్స్ ను నిషేధిస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి మురుగన్ పార్లమెంటులో వెల్లడించారు. 2021 ఐటీ నిబంధనల ప్రకారం అశ్లీలత, అసభ్యకరమైన సన్నివేశాలను కొన్ని ఓటిటి ప్లాట్ ఫామ్స్ ప్రసారం చేస్తున్నాయని, వీటిపై ఉక్కు పాదం మోపి పద్దెనిమిది ఓటిటి ప్లాట్ఫామ్స్ నిషేధించామని మంత్రి వెల్లడించారు. అలాగే డిజిటల్ న్యూస్ పబ్లిషర్లు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జర్నలిస్టిక్ కండక్ట్ నిబంధనలకు లోబడి పని చేయాలని కేంద్ర మంత్రి మురుగన్ వెల్లడించారు. వీటిలో ప్రైమ్ ప్లే (Prime play), బేసరమ్స్ (Besarams), న్యూ ఫ్లిక్స్ (NewFlix), మూడ్ ఎక్స్ (Mood X) వంటి ఓటిటి ప్లాట్ ఫామ్స్ ఉన్నాయి. వీటితోపాటు మరో పది వెబ్ సైట్లను గూగుల్ ప్లే స్టోర్ (Google Play store), యాపిల్ స్టోర్ (Apple store) లో నుంచి తొలగించారు. వీటితోపాటు మరికొన్ని వెబ్సైట్లను కూడా బ్లాక్ చేస్తామని తెలియజేశారు.
ఓటిటి ప్లాట్ ఫామ్ లో వచ్చే మూవీ లను, వెబ్ సిరీస్ లను ఇంట్లోనే కూర్చొని కుటుంబ సభ్యులతో కలసి చూస్తూ ఉంటారు. అటువంటప్పుడు అందులో అసభ్యసన్నివేశాలు వచ్చినప్పుడు వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చిన్నపిల్లలు కూడా ఉంటారు కాబట్టి, ఎప్పటినుంచో వీటిపై వ్యతిరేకత వ్యక్తమౌతూ వస్తోంది. వీటికి సెన్సార్ నిబంధనలు లేకపోవడంతో ఈమధ్య అశ్లీలతతో కూడుకున్న సన్నివేశాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ఇటువంటి కంటెంట్ వల్ల యువత చెడుదారిలో వెళ్ళే ప్రమాదం ఉంది. ఇప్పటికే వీటిని ఫాలో అవుతూ కొంతమంది తీవ్రమైన నేరాలకు పాల్పడినసంఘటనలు చాలానే ఉన్నాయి. అశ్లీలత, హింస, అసభ్యకరమైన సన్నివేశాలు ఇలాగే ప్రసారం చేస్తే రేపటి రోజు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. రాబోయే రోజుల్లో వీటిపై ప్రభుత్వం ఇంకా కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ తెలియజేస్తున్నారు.