సర్.. విధానంతో ఇక రెండు చోట్ల ఓటు హక్కు ఉండరాదనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. చాలా చోట్ల చాలా మందికి రెండేసి ఓట్లున్నాయి. బోగస్ ఓట్లుగా వీటిని పరిణించాల్సి వస్తుంది. కానీ వీటిపై ఇప్పటి వరకు నిఘా లేకపోవడంతో.. ఇవి యథేచ్చగా కొనసాగుతూ వస్తున్నాయి.
ఇప్పుడు ఈ ఓట్లను తొలగించాల్సిన అవసరం వచ్చింది. కొందరు స్వచ్చంధంగా ఓటును తొలగించుకోవాలని కూడా అనుకుంటున్నారు. కారణం.. ఏ ఏడాది జైలు శిక్ష ఉంటుందనే భయం కూడా వారిని వెంటాడుతోంది. అయితే ఈ డబుల్ ఓట్లు ఎక్కడ ఎన్ని ఉన్నా.. ప్రధానంగా ఏపీ, తెలంగాణలో నమోదై ఉన్న సెటిలర్లకే ఈ సమస్య ఎక్కువగా వస్తుంది.
ఇవాళ కవిత తన ప్రెస్‌మీట్‌లో దీనిపై ఓపెన్‌గా మాట్లాడారు. ఏ పార్టీ కూడాఇప్పటి వరకు, గతంలో గానీ దీనిపై ఇంత బహిరంగంగా కామెంట్ చేసిన వారు లేరు. తెలంగాణలో కొనసాగితే.. ఆంధ్రలో వీరి ఓటు తీసేయాలి. ఆంధ్రలోనే ఉండాలనుకుంటే.. ఇక్కడ హైదరాబాద్‌లో ఈ ఓటు తీసేయాలని ఆమె ఎన్నికల కమిషన్‌ను కోరడం చర్చకు తెర తీసింది.
రాబోయేవి జీహెచ్ఎంసీ ఎన్నికలు. అన్ని ప్రధాన పార్టీలు ఇప్పుడు సెటిలర్ల ఓట్లపై గురి పెట్టాయి. అధికార పార్టీ కాంగ్రెస్ మొన్నటికి మొన్న అమీర్‌పేట్‌లో అన్నగారి విగ్రహం ఏర్పాటు చేసి సెటిలర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేసింది. ఇది కాంగ్రెస్‌కు ఎంతగా రాజకీయంగా వివాదాన్ని తెచ్చిపెట్టినా.. సీఎం రేవంత్‌రెడ్డి డోంట్ కేర్ అన్నాడు.
తమకు కావాల్సింది సెటిలర్ల ఓట్లు.. జీహెచ్ంఎసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించడం.. అన్న విధంగానే సీఎం వ్యూహం కొనసాగింది. ఇక బీఆరెస్ కూడా సెటిలర్ల పై భారీగానే ఆశలు పెట్టుకున్నది. గతంలో ఆ పార్టీ అత్యధిక ఎమ్మెల్యే సీట్లు సాధించి పెట్టింది ఈ జీహెచ్ఎంసీ పరిధిలోనే. కానీ కాంగ్రెస్ సర్కార్ ఇంకా రె0డేండ్లకు పై బడి అధికారంలో ఉండే అవకాశం ఉన్నందున.. అధికార పార్టీ వైపే సెటిలర్లు మొగ్గు చూపే గత చరిత్ర ఉన్నందున బీఆరెస్‌లో కూడా భయం పట్టుకున్నది.
అందుకే వారు తమ సర్ అవగాహన మీటింగులలో రెండు చోట్ల ఓట్లపై దృష్టి పెట్టాలని ఇండైరెక్టుగా సెటిలర్ల ఓట్లపై సీరియస్ నజర్ పెట్టాలని సూచిస్తూ వస్తున్నారు. ఇక బీజేపీపై సెటిలర్లు ఎప్పుడూ సీరియస్ నజర్ పెట్టలేదు. అందుకే వీరిపై ఆశతోనే పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతున్నాడు. ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేశాడు పవన్. దీని ద్వారా సెటిలర్లు తమ పార్టీకి లేదా.. తాము పొత్తులో భాగంగా ఉండే బీజేపీకి ఓట్లు పోలరైజ్ చేయాలనే ఆలోచన పవన్‌కు ఉన్నది.
ఇంత మంది సెటిలర్లపై గంపెడాశలు పెట్టుకుంటుంటే… కవిత మాత్రం డేర్‌గా డోంట్‌కేర్‌గా.. రెండుచోట్ల ఓటు ఉంటే కుదరదన్నారు. ఆడా ఉంటా.. ఈడా ఉంటా.. !అని రుద్రమదేవీ సినిమాలో గోన గన్నారెడ్డి డైలాగు.. సెటిలర్లకు ఇక వర్తింపజేయకుండా చేయాలని కవిత ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నారు. ఇదిప్పుడు హైదరాబాద్ సర్కిళ్లలో హాట్ టాపిక్‌గా మారింది.