నా బంగారు పుట్టలో వేలు పెడితే నే కుట్టనా? అని ఎప్పుడో ఓ చీమ చెప్పిన కథ గుర్తొస్తున్నది. రాష్ట్రంలో ఇప్పుడు ఇదే నడుస్తున్నది. ఒకరేమో పదేండ్లు పాలించి.. అధికారం దూరమైనందుకు ప్రజలకు దూరమై… ఉన్నాడు. మరొకరేమో అధికారం చేజిక్కించుకున్నా.. దాన్ని ఇప్పుడప్పుడే దూరం చేసుకోవడం వల్లకాదని డిసైడ్ అయిపోయి.. పది కాలాలు పదిలంగా ఉండాలంటే .. అధికారం దూరమై.. ఫామ్‌హౌజ్‌లో బంధీయైన ఆ నేత పాలించిన పదేండ్ల పాలన పాపాలపై పాత పాటలనే అరిగిపోయిన గ్రామ ఫోను రికార్డులా వినిపిస్తూనే ఉన్నాడు.
సరే, ఆ పాపాలకు, లోపాలకు, పొరపాట్లకు జనం శాపాలు కాటేసి, ఫామ్‌హౌజ్‌లో కట్టేశాయి కదా..! మళ్లీ మళ్లీ ఆ గాయాన్ని గెలకడమెందుకు? .. మీరే అన్నారు కదా..! గాడిదకు గుర్రానికి తేడా తెలియాలన్నారు. మీరు గాడిద కాబట్టే.. మిమ్మల్ని ఓడగొట్టారు. నేను గుర్రాన్ని కాబట్టి నన్ను గెలిపించారని జనాలకు ఎప్పటికప్పుడు గుర్తు చేయాలె కదా? మేమన్నది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు..! మేము గుర్రంలా పాలించిన ఆ రోజులెట్లున్నయి..? ఏరి కోరి చేసుకుంటే ఎగిరెగిరి తన్నిన మొగుడి పాలన ఎట్లుందని తెలియజెప్తందుకే అన్నామలా. అంటే మీరు గుర్రమని మీకు మీరే అనుకుని.. గెలిపించిన మమ్మల్ని, మా పాలనను గాడిదతో పోల్చుతారా? అందుకే మిమ్మల్ని వదలా? వెంటాడుతనే ఉంటా? తిడతనే ఉంటా..? ఇలా నడుస్తోంది ఇద్దరి మధ్య రాజకీయం.
యువ సంగ్రామ సదస్సు పేరుతో కేటీఆర్ ఓ సభ పెట్టి.. రేవంత్‌ను తుక్కు తుక్కు తిట్టాడు. ఆ వేదికను ఒక్క ఉద్యోగాల కల్పన విషయంలో వాడుకోలేదు కేటీఆర్. తన కడుపులోని కసినంతా వెళ్లగక్కాడా వేదికగా. చాలా సార్లు తనే అన్నాడు. తెలంగాణ తెచ్చిన మొగోడు మా నాన్న.. ఆయననంటే నేను ఊకుంటనా..? అని.
అందుకే నాన్నను పదే పదే అనే మాటలు కోపాన్ని తెచ్చిపెట్టాయి. అధికారం దూరమై లోలోన రగులుతున్న ఆవేదనా బద్దలైనట్టుంది. తిట్టాడు బాగనే. సోషల్ మీడియాను రన్ చేసీ చేసీ.. అదే మళ్లీ అధికారంలోకి తీసుకువస్తుందని భ్రమించి.. అదే భ్రమలో ఉన్నట్టుగా మధ్యలో సాంప్రదాయినీ.. సుబ్బినీ సుద్దపూసనీ.. అని సినిమా డైలాగొకటి కొట్టాడు. ఇక్కడే తను మరింత పలుచనై పోయాడు.
హుందా రాజకీయాలు ఎలా నడపాలో తెలియకనా..? తెలిసీ ఇట్లనే ఉండాలని డిసైడ్ అయిపోవడం మూలంగానా..? సహజంగానే తనలో ఉన్న లక్షణాలే ఇలా బయటకు వస్తున్నాయా? తెలియదు. వేదిక మీద స్క్రీన్‌పై ఎన్నికల సమయంలో రేవంత్‌రెడ్డి, ప్రియాంక గాంధీ తదితరులు ఉద్యోగాల గురించి ఏం మాట్లాడారో వీడియో ప్లే చేశారు. చివరగా క్యా హువా తెరా వాదా? అని ఏదో హిందీ సినిమాలోని పాటను చివరకు లింకు పెట్టి ముగించారు.
అక్కడంత సీరియస్‌గా ఆ విషయం నడుస్తున్నప్పుడు.. ఉద్యోగాల విషయంలో అగ్గిరాజుకుంటున్నప్పుడు.. నిరుద్యోగులంతా నిశితంగా గమనిస్తున్నప్పుడు.. చివరలో ఆ కామెడీ టచ్ ఏంటీ..? నీ కామెడీ కాకపోతే రామన్నా? అంటే నీకు నవ్వులాటగా ఉందా?
అపరిచితుడులో వేరియేషన్స్‌లాగా.. పొరపాట్లు జరిగాయంటూనే.. మేము ఉద్యోగాలిచ్చి పెద్దగా ప్రచారం చేసుకోకపోవడం.. పేపర్లో ప్రకటలివ్వకపోవడం, నియామక పత్రాలకు సభలు పెట్టుకోకపోవడము పెద్ద పొరపాటేనని మళ్లీ కలరింగు ఇచ్చుకోవడం. అంటే తప్పు చేసినట్టు కూడా పూర్తిగా ఒప్పుకునే మెంటాలిటీ ఇంకా అలవడలేదని తెలిసిపోతూనే ఉన్నది.
తన ముందే ఆ వేదికపై నిరుద్యోగులతో మాట్లాడించాడు. బాగానే ఉంది. వాళ్లేమన్నారు? కాలికి బలపం కట్టుకుని తిరిగి మరీ కాంగ్రెస్‌ను గెలిపించామని బాజాప్తా చెబుతున్నారు. అంటే దీనిర్థం ఏమిటీ? వారిని గెలిపించాలనే అంత తపన వెనుక.. మిమ్మల్ని ఓడించాలనే కసి ఉన్నట్టే కదా? ఎందుకు అంతగా కోపమొచ్చింది? మరి ఆ కోపం పోయేందుకు మీరు ఏం చేశారు. మమ్మల్నే గెలిపిస్తారనే ధీమా ఉండెనా? మేమేం తప్పు చేయలేదు.. మస్తు ఉద్యోగాలిచ్చనం.. అనే అదే అహంకారంతో ఉండి ఉంటిరా?
సరే, ఇప్పటికీ అవే మాటలెందుకు మరి. ఇకపై నేను బాధ్యత తీసుకుంటానని మాత్రం చెప్పగలిగాడు కేటీఆర్. అసలు నీలోనే పరివర్తన లేనప్పుడు.. నిన్నెలా నమ్మేది రామన్నా?
అంతేకాదు.. చూశారా.. పిల్లల తల్లిదండ్రులారా? ఇండ్లలో ఉండి టీవీలు చూస్తున్న జనులారా? మీరు ఎలాంటి వారికి ఓటేశారో ఇప్పటికైనా తెలుసుకున్నారా? మళ్లీ అవే మాటలు. ఇప్పటికైనా తెలుసుకున్నారా? అంటే.. మీకు ఇకనైనా బుద్ది వచ్చిందా? అని జనాన్ని నేరుగా తిడుతున్నట్టు మిస్టర్ కేటీఆర్. ఆ మాటల పరమార్థం కనిపెట్టలేని తెలివి లేనోళ్లేం కాదు జనాలు.
మీరు మారండిరా.. బాబు అంటే.. మీకు బుద్దొచ్చిందా? మేము కరెక్టుగానే ఉన్నాం… మీరే మతితప్పి.. గతితప్పి.. ఆశలకు పోయి.. అత్యాశలకు ఆగమై.. అని జనాలను ఇంకా దోషులుగా చూసే ఆ బుద్ది పోనిచ్చుకోరా? అంటే మీకు జనాల మీద మీకు ఇంకా అలక, కోపం, కసి పోలేదా?
సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం.. ఈయన గారు ఆయన గారి తండ్రిని తిడతాడు. నా తండ్రినే తిడతావా? పట్టపగలు ఓటుకు నోటు కేసులో సూట్‌కేసులతో దొరికిన దొంగవు నీవు..? అని ఎడాపెడా తిట్టాడు కేటీఆర్. ఒక సీఎంను పట్టుకుని అంతలేసి మాటలంటావా? అని ఎక్కువ సమయం తీసుకోలేదు రేవంతు… అదే రోజు సాయంత్రం జరిగిన అందెశ్రీ ప్రోగ్రాంలో మీ నాన్న ఓ పాస్‌పోర్టు బ్రోకర్ అని తిట్టాడు. ఇప్పుడు అర్జెంటుగా ఈ మాటెందుకు గుర్తొచ్చిందో తెలియదు… అది తప్ప ఇంకా గట్టిగా, ఘాటుగా తిట్టేందుకు వేరే తిట్టు దొరకలేదో… కొత్తగా ఉంటుందని పాత చింతకాయ పచ్చడి విమర్శను ముందుకు తెచ్చి ఉంటాడు.
మొత్తానికి అర్థమైందేంటంటే.. నువ్వు నన్ను ఎంతగా హేళన చేస్తావో.. ఎంతలా తిడతావో.. జనం ముందు ఎంతలా పలుచన చేయాలని చూస్తావో..నిన్ను అంతకు రెట్టింపు చేస్తాను. నువ్వు ఎంతగా రెచ్చిపోతావో.. నేను నీకంటే డబుల్ రెచ్చిపోతా? నువ్వు ఒక్కటంటే.. నేను పదంటా! నువ్వు పదంటే నేను వందంటా? ఇలా నడుస్తోంది ఇద్దరి వ్యవహారం.
ఇలా తిట్టుకుంటూ ఒకరిపై మరొకరు నెపం వేసుకుంటూ .. మేమే వస్తాం.. నేను వస్తా.. మాకే అధికారం… ఇక మీ కాలం చెల్లింది.. ఇవే మాటలు.. జనం పిచ్చోళ్లలా మిమ్మల్ని ఇలా చూస్తూ కూర్చుంటారు. ఎవరి ధీమా వారిదే. ఎవరి లెక్కలు వారివే. ఎవరి తిట్లు వారివే. జనం ఎంత గోసలు పడితే అంత మేలు ఒకరికి. జనం అటువైపు తిరిగి చూడొద్దనే గోస మరొకరిది.