IRCTC Bharat Gaurav Tour on Monthly EMI: తీర్థయాత్రకు వెళ్లాలని చాలా మందికి కోరిక ఉంటుంది. కానీ, ప్రయాణ ఖర్చుల కారణంగా యాత్రను వాయిదా వేసుకుంటుంటారు. అలాంటి భక్తుల కోసం ఐఆర్‌సిటీసీ అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. ఇప్పుడు నెలవారీ ఈఎంఐ సౌకర్యంతో దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా తిరుపతి, రామేశ్వరం, కన్యాకుమారి, నాలుగు జ్యోతిర్లింగాలు, ద్వారక, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లాంటి పర్యాటక ప్రాంతాలను ఒకే యాత్రలో చూసే అవకాశం కల్పిస్తోంది. ఇందులో భాగంగా రెండు ప్యాకేజీలను తీసుకొచ్చింది.
ఈ ప్రత్యేక టూర్ జూలై 31 నుంచి ఆగస్టు 11 వరకు మొత్తం 12 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ యాత్రలో తిరుపతి బాలాజీ, రామేశ్వరం రామనాథస్వామి ఆలయం, మధురై మీనాక్షి అమ్మవారి ఆలయం, కన్యాకుమారి, శ్రీశైలం మల్లికార్జున జ్యోతిర్లింగం లాంటి పవిత్ర క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.23,560. అయితే, ఒకేసారి ఈ మొత్తం చెల్లించాల్సిన అవసరం లేదు. నెలకు కేవలం రూ.828 ఈఎంఐ చెల్లిస్తూ బుక్ చేసుకోవచ్చు.
ఆగస్టు 17 నుంచి 26 వరకు మరో ప్రత్యేక యాత్రను ఐఆర్‌సిటీసీ నిర్వహించనుంది. ఈ పర్యటనలో మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, నాగేశ్వర్, సోమనాథ్ జ్యోతిర్లింగాలతో పాటు ద్వారకాధీశ్ ఆలయం, భేట్ ద్వారక, సిగ్నేచర్ బ్రిడ్జ్, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ లాంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలను సందర్శించవచ్చు. ఈ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.18,380 కాగా, నెలకు కేవలం రూ.646 ఈఎంఐతో బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఈ భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఏసీ 2- టైర్, ఏసీ 3- టైర్, స్లీపర్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేశారు. అలాగే ఎల్‌టీసీ, ఈఎంఐ వంటి సౌకర్యాలను కూడా ప్రయాణికులకు అందిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులతో కలిసి తక్కువ ఖర్చుతో ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేసే అవకాశం లభిస్తుంది.
Read Also: శ్రీశైలానికి బుల్లెట్ ట్రైన్.. హైదరాబాద్ నుంచి గంటలోనే ప్రయాణం!
ఈ టూర్ ప్యాకేజీల పట్ల ఆసక్తి ఉన్నవారు ఐఆర్‌సిటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా బుకింగ్ చేసుకోవచ్చు. అంతేకాదు, దగ్గర లోని ఐఆర్‌సిటీసీ కార్యాలయాలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. తక్కువ నెలవారీ వాయిదాలతో ప్రముఖ దేవాలయాలు, జ్యోతిర్లింగాలు, చారిత్రక ప్రాంతాలను సందర్శించే ఈ అవకాశం భక్తులకు ఎంతో ఉపయోగకరంగా మారనుంది. ఒకేసారి భారీ మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, సులభమైన ఈఎంఐలతో ఆధ్యాత్మిక యాత్రకు వెళ్లి రావచ్చు. మరీ ముఖ్యంగా కుటుంబంతో కలిసి తీర్థయాత్రకు వెళ్లాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.
Read Also: పాత IRCTC వెబ్ సైట్‌కు.. కొత్తదానికి తేడా ఏమిటీ? ఏం మారాయ్? ఏం చేరాయ్?