మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయినా.. దీనిపై ఇంకా దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూనే ఉంది. రెండు జాతీయ పార్టీలు ఈ విషయంలో తాము చేసిన చర్యను సమర్థించుకుంటున్నాయి. సరిపడా బలం లేకున్నా.. సమిష్టిగా అంతా మహిళా బిల్లు అమలు కోసం ఓటు వేయాలని ఎన్డీయే కోరినా.. దీనికి ఇండి కూటమి ససేమిరా అన్నది. దీంతో ఈ బిల్లు వీగిపోయింది. ప్రధాని మోడీ సైతం దీన్ని మహిళలకు కాంగ్రెస్ చేసిన ఘోర తప్పిదంలా అభిప్రాయపడ్డారు. అయితే అయితే ఇదిప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పలు రాజకీయ పరిణామలకు దారి తీసింది. కల్వకుంట్ల కవిత ఈ నెల 25న కొత్త పార్టీని ఏర్పాటు చేయనున్న విషయం తెలిసిందే. దీని కోసం ఆమె అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా, బహుజనులకు మేలు జరిగేలా తన పార్టీ విధానాలుంటాయని ఆమె మొదటి నుంచి ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆమె మహిళా బిల్లుపై స్పందించిన తీరు.. తాజాగా తీసుకున్న నిర్ణయం చర్చకు తెర తీసింది. బిల్లు ఆమోదం విషయంలో కేంద్రం చిత్తశుద్దిని ప్రదర్శించలేదని విమర్శించిన ఆమె.. బిల్లు పాస్ అయితే బాగుండని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో పాటు తాను కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీ ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల ప్రకారం టికెట్లు కేటాయిస్తున్నట్లు కూడా ఆమె తాజాగా ప్రకటించారు. అంతే కాదు. .పార్టీ పదవులు కూడా ఇస్తామన్నారామె. గతంలో ఏ పార్టీ మహిళలకు ఎన్నెన్ని సీట్లు కేటాయించిందో ఆమె గుర్తు చేస్తూనే.. తమ పార్టీ మాత్రం మహిళా అభ్యున్నతికి కట్టుబడి ఉంటుందని, బహుజన వర్గాలకు మేలు జరిగేలా పార్టీ విధివిధానాలు రూపొందిస్తున్నామని ప్రకటించారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక పార్టీ మహిళలకు ఎనిమిది సీట్లు ఇస్తే మరో పార్టీ పది సీట్లు ఇచ్చింది.. మొత్తంగా అసెంబ్లీలో ఎనిమిది మంది మహిళా ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని, బీఆరెస్, కాంగ్రెస్ పార్టీలపై ఆమె పరోక్షంగా విమర్శనాస్త్రాలు సంధించారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా.. మహిళలకు చేసిందేమీ లేదని, వారు కేటాయించిన సీట్లు.. అసెంబ్లీలో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళల సంఖ్యే దీనికి ఉదాహరణగా ఆమె చెప్పుకొచ్చారు. సామాజిక న్యాయం పాటిస్తూ .. ఇతర పార్టీలకు మార్గదర్శకంగా ఉండేలా కవిత కొత్త పార్టీ విధి విధానాలు ఉండబోతున్నట్టు ఆమె సంకేతాలిచ్చింది.
ఓ వైపు బీఆరెస్ పదేళ్ల పాలన పై మరోవైపు రెండేండ్ల కాంగ్రెస్ పాలనపై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆమె ఎవరినీ వదలడం లేదు. ఈ రెండు పార్టీలకు తమ పార్టీ ప్రత్యామ్నాయం అని చెప్పే విధంగా .. అక్కడి లోపాలు, అమలు కాని విధానాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి.. తమ కొత్త పార్టీ లైన్‌ను ఆ దిశగా రూపొందించుకున్నారామె. దీంతో రాజకీయ సర్కిళ్లలో కొత్త చర్చకు తెర తీశారామె. తాము మహిళా బిల్లు పెట్టినా ఆమోదించలేకపోవడానికి కారణం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న బీజేపీ కూడా ఈ విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీ సైతం తాము మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదని, మరోసారి ప్రత్యేకంగా మహిళా బిల్లు పెడితే మద్దతిస్తామని ప్రకటించింది.
ఇప్పుడు ఈ పార్టీ కూడా పదవులు, టికెట్ల విషయంలో మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత చర్చకు రానుంది. ఇక మహిళ నాయకుల పట్ల చిన్నచూపుగా ఉంటుందనే అపవాదు మూటగట్టుకున్న బీఆరెస్‌కూ దీన్ని ఫాలో కావల్సిన ఆగత్యం ఏర్పడుతుంది. కవిత తన పార్టీ ద్వారా మహిళా రిజర్వేషన్లను అమలు పరచడం ద్వారా.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తప్పనిసరిగా ఇతర పార్టీలు కూడా ఫాలో కావాల్సిన అనివార్యతను క్రియేట్ చేశారు. బీఆరెస్, బీజేపీ, కాంగ్రెస్‌కు ఆమె కొత్త పార్టీ లైన్, విధి విధనాలు పంటికింద రాయిలా మారనున్నాయి. బీసీల రిజర్వేషన్ల అంశంతో పాటు తాజాగా మహిళా రిజర్వేషన్లపై కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ప్రధాన చర్చకు దారి తీయనుంది. ఇది ఇకపై జరిగే ఎన్నికలపై తీవ్ర ప్రభావమే చూపనుంది.