Google Maps Offline: ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్లాలన్నా, దారి తెలుసుకోవాలన్నా మనకు వెంటనే గుర్తొచ్చేది గూగుల్ మ్యాప్స్. అయితే, ప్రయాణంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సిగ్నల్ పోయినా లేదా ఇంటర్నెట్ బ్యాలెన్స్ అయిపోయినా చాలామంది కంగారు పడుతుంటారు. కానీ, ఇంటర్నెట్ లేకపోయినా గూగుల్ మ్యాప్స్ అద్భుతంగా పనిచేస్తుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు సింపుల్‌గా తెలుసుకుందాం.
గూగుల్ మ్యాప్స్‌లో ‘ఆఫ్‌లైన్ మ్యాప్స్’ అనే ఒక అద్భుతమైన ఫీచర్ ఉంది. దీని ద్వారా మనం వెళ్లాలనుకునే ప్రాంతపు మ్యాప్‌ను ముందే డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా డౌన్‌లోడ్ చేసిన మ్యాప్స్ మన ఫోన్ మెమరీలో సేవ్ అవుతాయి. ఆ తర్వాత నెట్ ఆన్ చేయకపోయినా, అసలు సిగ్నల్ లేని అడవుల్లో ఉన్నా కూడా ఈ మ్యాప్ మనకు దారి చూపిస్తుంది.
చాలా మందికి వచ్చే అనుమానం ఏమిటంటే.. ఇంటర్నెట్ లేనప్పుడు మన లైవ్ లొకేషన్ మ్యాప్‌లో ఎలా కనిపిస్తుంది? దీని వెనుక ఉన్న రహస్యం GPS టెక్నాలజీ. మన స్మార్ట్‌ఫోన్లలో ఉండే జీపీఎస్ సిస్టమ్ నేరుగా శాటిలైట్లతో అనుసంధానమై ఉంటుంది. దీనికి ఇంటర్నెట్ అవసరం లేదు. కాబట్టి.. ఆఫ్‌లైన్ మ్యాప్ ఆన్ చేసినప్పుడు ఈ జీపీఎస్ మన ప్రస్తుత లొకేషన్‌ను కచ్చితంగా గుర్తిస్తుంది.
Also Read: ల్యాండ్‌స్కేప్ కెమెరాతో శాంసంగ్ కొత్త టాబ్లెట్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
మీరు ఏదైనా సిగ్నల్ లేని ప్రాంతానికి లేదా లాంగ్ ట్రిప్‌కు వెళ్లేటప్పుడు, ఇంట్లోనే వైఫై ఉన్న సమయంలో ఆ రూట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం మంచిది. గూగుల్ మ్యాప్స్ యాప్‌లోకి వెళ్లి, మీ ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేస్తే ‘ఆఫ్‌లైన్ మ్యాప్స్’ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీకు కావలసిన ఏరియాను సెలెక్ట్ చేసుకుని డౌన్‌లోడ్ బటన్ నొక్కితే సరిపోతుంది.
ఇంటర్నెట్ లేనప్పుడు కూడా మీరు డౌన్‌లోడ్ చేసిన ఏరియాలో డ్రైవింగ్ రూట్స్ తెలుసుకోవచ్చు. అలాగే నిర్దిష్టమైన లొకేషన్లను సెర్చ్ చేయవచ్చు. టర్న్-బై-టర్న్ వాయిస్ నావిగేషన్ కూడా ఎంచక్కా పనిచేస్తుంది. అయితే, ఆ సమయంలో లైవ్ ట్రాఫిక్ అప్‌డేట్స్, ప్రత్యామ్నాయ మార్గాలు, బస్సు, రైలు వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సమాచారం మాత్రం లభించదు.
ఈ ఆఫ్‌లైన్ మ్యాప్స్ వల్ల కేవలం సిగ్నల్ లేనప్పుడే కాదు.. నార్మల్ టైమ్‌లో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రయాణంలో ఉన్నప్పుడు పదే పదే మ్యాప్ లోడ్ అవ్వడానికి ఎక్కువ డేటా ఖర్చవుతుంది. అలాగే బ్యాటరీ కూడా త్వరగా అయిపోతుంది. ముందే మ్యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల డేటా మిగలడమే కాకుండా.. ఫోన్ బ్యాటరీ కూడా ఎక్కువ సమయం వస్తుంది.
Also Read: బ్యాక్ కెమెరా చూస్తూ సెల్ఫీలు తీసుకునేలా ఒప్పో సరికొత్త యాక్సెసరీ.. Reno 16 ఫోన్ల ధర, ఫీచర్లు ఇవే!