వంకాయతో చేసే వంటకాలు భారతీయ వంటల్లో భాగమైపోయాయి. పెళ్లిళ్లు, విందులు వస్తే కచ్చితంగా వంకాయ కూర ఉండాల్సిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వంకాయతో చేసే వేపుడు, పులుసు, కారం కూరలు చాలా ప్రసిద్ధి. వాటిలో ఆంధ్ర స్టైల్ వంకాయ ఫ్రై అదిరిపోతుంది. ఇది ఒక డ్రై కూర. అంటే పొడి పొడిగా వచ్చే వేపుడు. ఈ వంటకం అన్నం, పెరుగు అన్నం, పప్పు అన్నం లేదా రోటీలతో కాంబినేషన్ అదిరిపోతుంది. చిన్న వంకాయలను మసాలాతో నెమ్మదిగా వేయించడం వల్ల అవి మెత్తగా, కొద్దిగా కరకరలాడేలా మారి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. ముఖ్యంగా ఉల్లి, మిరప పేస్ట్ లేదా కారం మసాలా కలిపితే ఈ కూరకు మంచి సువాసన, రుచి వస్తుంది.
వంకాయ పొడికూర రెసిపీకి కావాల్సిన పదార్థాలు
చిన్న వంకాయలు – 8 నుంచి 10
ఉల్లిపాయలు – 2
ఎండుమిరపకాయలు – 4 నుంచి 6
వెల్లుల్లి – 2 లేదా 3 రెబ్బలు
జీలకర్ర – అర టీ స్పూన్
ఆవాలు – అర టీ స్పూన్
కరివేపాకు – కొద్దిగా
పసుపు – చిటికెడు
ఉప్పు – తగినంత
నూనె – 2 టేబుల్ స్పూన్లు
Also read: Mutton Curry: కొత్తిమీర మటన్ ఇలా వండారంటే గిన్నె మొత్తం ఖాళీ అయిపోతుంది, రెసిపీ ఇదిగో
వంకాయ పొడి కూర రెసిపీ
1. ఉల్లి, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ తయారు చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టుకోవాలి.
2. వంకాయలను బాగా కడిగి నాలుగు ముక్కలుగా కోయాలి. కోసిన వెంటనే ఉప్పు కలిపిన నీటిలో వేసి ఉంచితే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి.
3. పాన్‌లో నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటపటలాడగానే కరివేపాకు వేయాలి.
4. ఇప్పుడు నీటిలో ఉన్న వంకాయలను తీసి పాన్‌లో వేసి ఉప్పు, పసుపు కలిపి మూతపెట్టి కొద్దిసేపు ఉడికించాలి.
5. వంకాయలు కొద్దిగా మెత్తబడిన తర్వాత మూత తీసి వేయించాలి.
6. వంకాయలు దాదాపు ఉడికిన తర్వాత ముందుగా తయారు చేసిన ఉల్లి, మిరప పేస్ట్ వేసి బాగా కలపాలి.
7. చివరగా వంకాయలు మెత్తగా, కొద్దిగా కరకరలాడేలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి. అంటే వంకాయ పొడి కూర సిద్ధమైనట్టే.
Also read: Simple Breakfast: రాత్రి మిగిలిన రోటీలతో ఉదయం టేస్టీ బ్రేక్‌ఫాస్ట్ రోటీ ఉప్మా .. రెసిపీ ఇదిగో
వేడి వేడి వంకాయ ఫ్రైని అన్నంతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది. పప్పు, సాంబార్ లేదా పెరుగు అన్నంతో కూడా ఇది మంచి సైడ్ డిష్‌గా పనిచేస్తుంది. కొంతమంది రోటీ, చపాతీతో కూడా ఈ కూరను ఇష్టపడతారు.