Kashmiri Badam Paneer: కాశ్మీర్ అందాలకు ఎంత పేరుందో.. అక్కడి వంటకాలకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా కాశ్మీరీ పెళ్లిళ్లలో, పండగ సమయాల్లో ‘షుఫ్తా’ తప్పనిసరిగా ఉంటుంది. ఇది వివిధ రకాల డ్రై ఫ్రూట్స్, వేయించిన పనీర్ ముక్కలు ,పంచదార పాకంతో తయారయ్యే ఒక డిఫరెంట్ స్వీట్. బాదం, పనీర్ ప్రధానంగా ఉండే ఈ రెసిపీలో సుగంధ ద్రవ్యాల ఘుమఘుమలు కూడా తోడవుతాయి. శరీరానికి ఎంతో శక్తినిచ్చే ఈ ట్రెడిషనల్ డెజర్ట్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం పనీర్ కాశ్మీరీ షుఫ్తా తయారీ విధానం:
సాధారణంగా మనం తినే స్వీట్ల కంటే షుఫ్తా చాలా భిన్నంగా ఉంటుంది. ఇందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ క్రంచీగా తగులుతూ.. పనీర్ ముక్కలు తియ్యగా ఉండి అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి.
కావలసిన పదార్థాలు:
పనీర్: 200 గ్రాములు (చిన్న క్యూబ్స్‌గా కోసినవి)
బాదం: అర కప్పు (నానబెట్టి పొట్టు తీసినవి)
వాల్ నట్స్ : అర కప్పు
ముంతమామిడి : అర కప్పు
ఎండు ద్రాక్ష: పావు కప్పు
ఎండు కొబ్బరి: అర కప్పు
ఎండు ఖర్జూరం: 5-6
పంచదార: 1 కప్పు (లేదా బెల్లం వాడొచ్చు)
నెయ్యి: అర కప్పు
మసాలాలు: మిరియాల పొడి (పావు స్పూన్), శొంఠి పొడి (అర స్పూన్), దాల్చినచెక్క పొడి (చిటికెడు), యాలకుల పొడి (అర స్పూన్), కుంకుమపువ్వు (కొద్దిగా)
తయారీ విధానం:
1. ముందుగా బాదం, అక్రోట్, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఎండు ఖర్జూరాలను విడివిడిగా కనీసం 1 గంట పాటు గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత బాదం పొట్టు తీసి ఉంచుకోవాలి. నీటిని పూర్తిగా వడకట్టి డ్రై ఫ్రూట్స్ పొడిగా అయ్యేలా చూడాలి.
2. స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొంచెం నెయ్యి వేయండి. ముందుగా పనీర్ ముక్కలను వేసి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో ఎండు కొబ్బరి ముక్కలను కూడా దోరగా వేయించి తీసి పెట్టుకోవాలి.
3. మిగిలిన నెయ్యిని పాన్‌లో వేసి, నానబెట్టి వడకట్టిన బాదం, జీడిపప్పు, అక్రోట్ ముక్కలను వేసి 3-4 నిమిషాల పాటు తక్కువ మంట మీద వేయించాలి. అవి మంచి వాసన రాగానే ఎండు ద్రాక్ష కూడా వేసి కలిపి పక్కన ఉంచాలి.
4. ఒక వెడల్పాటి గిన్నెలో పంచదార వేసి, దానికి సగం కప్పు నీరు కలిపి మరిగించాలి. ఇది గులాబ్ జామున్ పాకం కంటే కొంచెం చిక్కగా (లేత తీగ పాకం) రావాలి. పాకం మరుగుతున్నప్పుడు అందులో శొంఠి పొడి, మిరియాల పొడి, యాలకుల పొడి, దాల్చినచెక్క పొడి, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. ఈ మసాలాలే షుఫ్తాకు అసలైన కాశ్మీరీ రుచినిస్తాయి.
5. పాకం సిద్ధమైన తర్వాత.. ముందుగా వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలు, ఎండు కొబ్బరి, డ్రై ఫ్రూట్స్ అన్నీ పాకంలో వేయాలి. తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు ఉడికించాలి. తద్వారా పాకం డ్రై ఫ్రూట్స్‌కు, పనీర్ ముక్కలకు బాగా పడుతుంది. మిశ్రమం దగ్గరపడి మెరుస్తూ కనిపిస్తున్నప్పుడు స్టవ్ ఆపివేయాలి.
Also Read: బ్రేక్‌ఫాస్ట్ స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే కర్ణాటక బటర్ దోస రెసిపీ!
చిట్కాలు:
షుఫ్తాను వేడిగా లేదా చల్లగా ఎలాగైనా తినవచ్చు. కానీ కాశ్మీర్‌లో దీనిని వేడిగా తినడానికే ఇష్టపడతారు.
మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే పంచదారకు బదులుగా బెల్లం లేదా తేనెను కూడా వాడవచ్చు.
దీనిని ఒక సీసాలో స్టోర్ చేస్తే వారం రోజుల పాటు నిల్వ ఉంటుంది.