Pudina Rice Recipe: సాధారణంగా పిల్లలు అన్ని రకాల కూరగయాలను ఇష్టపడరు. అలాంటప్పుడు వారి లంచ్ బాక్సులోకి నెయ్యి వేసి చేసిన ఈ టేస్టీ పుదీనా రైస్‌ను చేసి పెట్టండి. ఎందుకంటే.. పిల్లలకి కూడా రోజూ తినే రెగ్యులర్ రైస్ బోర్ కొడుతుంది కదా. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పుదీనాతో, కేవలం పది నిమిషాల్లో తయారయ్యే మింట్ రైస్‌ను ఒక్కసారి రుచి చూశారంటే.. లంచ్ బాక్స్ మొత్తం ఖాళీ చేసి తెస్తారు. అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
అన్నం – 3 కప్పులు
పుదీనా ఆకులు – ఒరటిన్నర కప్పు
తాజా కొబ్బరి ముక్కలు – అరకప్పు
వెల్లుల్లి – అయిదు
పచ్చిమిర్చి – నాలుగు
ఉప్పు – తగినంత
నెయ్యి – పావుకప్పు
ఆవాలు – టీ స్పూన్
శెనగపప్పు – టేబుల్ స్పూన్
మినప్పప్పు – టేబుల్ స్పూన్
జీడి పప్పు – అరకప్పు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
యాలకులు – నాలుగు
మిక్సీ జార్ తీసుకుని అందులో శుభ్రం చేసిన పుదీనా ఆకులు, పచ్చి కొబ్బరి ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి, అందులో నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక ఆవాలు, శెనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పుతో పాటు దాల్చిన చెక్క, యాలకులు వేసి దోరగా వేయించుకోవాలి.
కాసేపటి తర్వాత పోపు మంచి సువాసన వస్తున్నప్పుడు, ముందుగా సిద్ధం చేసుకున్న పుదీనా పేస్టును వేసి పచ్చివాసన పోయే వరకు ఓ ఐదు నిమిషాల పాటు వేయించాలి. చివరిగా పొడిపొడిగా వండుకున్న అన్నం వేసి, మసాలా అంతా అన్నానికి పట్టేలా బాగా కలిపి దింపేస్తే ఎంతో రుచికరమైన పుదీనా రైస్ రెడీ.