Oil Free Pakoda: మనకు తెలిసినంత వరకు పకోడీలు అంటే నూనెలో మునిగి తేలినవే. కానీ, ఇప్పుడు మనం తెలుసుకోబోయే పకోడీలు మాత్రం ఆరోగ్యం మీద శ్రద్ధ చూపేవారి కోసమే. రుచికి ఏమాత్రం ఏ మాత్రం తక్కువ కాకుండా, అస్సులు చుక్క నూనె వాడకుండానే కరకరలాడే పకోడీలను తయారు చేసుకోవడం సాధ్యమే. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తక్కువ క్యాలరీలతో, డిఫ్రెంట్ రుచితో చేసుకునే ఈ ఆయిల్ ఫ్రీ పకోడీ తయారీ విధానం మీ కోసం..
శనగపిండి – కప్పు
ఉల్లి తరుగు – ముప్పావు కప్పు
ఉప్పు – రుచికి తగినంత
పెరుగు – 3 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు – పావు కప్పు
అల్లం మిర్చి ముద్ద
కారం – స్పూన్ చొప్పున
పసుపు – పావు స్పూన్
జీలకర్ర – అర స్పూన్
పొటాటో తురుము – అర కప్పు
ఉప్మారవ్వ – అర కప్పు
ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో శనగపిండి, ఉప్మా రవ్వ వేసుకోవాలి. దీనికి తురిమిన బంగాళదుంపలు, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, అల్లం-మిర్చి ముద్ద, పసుపు, జీలకర్ర, కారం, ఉప్పు, కొత్తిమీరను జత చేయాలి. ఇప్పుడు కొద్దిగా నీటిని చిలకరిస్తూ పిండిని బాగా కలపాలి. సాధారణ పకోడీ పిండి కంటే ఈ మిశ్రమం కాస్త గట్టిగా ఉండేలా చూసుకోవాలి. పిండిలో ఉండలు లేకుండా కలిపిన తర్వాత మూత పెట్టి సుమారు ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టాలి.
ఓ 20 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక నాన్‌స్టిక్ ప్యాన్‌ను వేడి చేయాలి. పిండి మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీల్లా ప్యాన్‌పై వేయాలి. నిమిషం పాటు వేగిన తర్వాత మూతపెట్టి వదిలేయాలి. రెండు నిమిషాల తర్వాత మూతతీసి పకోడీలను రెండో వైపుకు తిప్పుకోవాలి. అటువైపు కూడా ఎర్రగా కాలిన తర్వాత ప్లేట్‌లోకి తీసుకుంటే సరి.