Ragi Chips Recipe: ప్రస్తుత కాలంలో చిరుతిళ్లు అనగానే మనకు చిప్స్, కుర్కురే వంటి జంక్ ఫుడ్ గుర్తుకు వస్తాయి. ఇవి రుచిగా ఉన్నప్పటికీ.. ఆరోగ్యానికి చాలా హానికరం. దీనికి ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే తక్కువ ఖర్చుతో.. పోషకాలు నిండిన ‘రాగి చిప్స్’ తయారు చేసుకోవచ్చు. రాగులలో ఉండే ఫైబర్ ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. కేవలం 20 నిమిషాల్లో తయారయ్యే ఈ కరకరలాడే చిప్స్ పిల్లలకు, పెద్దలకు తక్షణ శక్తినిస్తాయి. ఆరోగ్యంతో పాటు రుచిని కూడా ఇచ్చే ఈ సూపర్ ఫుడ్ స్నాక్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
రాగులు లేదా ఫింగర్ మిల్లెట్స్ మన శరీరానికి అవసరమైన పోషకాలను అందించడంలో అగ్రస్థానంలో ఉంటాయి. పూర్వం రాగి సంకటి, రాగి అంబలి రూపంలో వీటిని తీసుకునేవారు. కానీ నేటి తరం పిల్లలు వీటిని తినడానికి అంతగా ఇష్టపడకపోవచ్చు. అలాంటి వారి కోసం రాగిని చిప్స్ రూపంలో ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారు.
కావాల్సిన పదార్థాలు:
రాగి పిండి: ఒక కప్పు
గోధుమ పిండి: పావు కప్పు
నువ్వులు లేదా వాము: ఒక టీస్పూన్
కారం: ఒక టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్: అర టీస్పూన్
నూనె: పిండి కలపడానికి కొద్దిగా, వేయించడానికి సరిపడా
వేడి నీరు: సరిపడా
తయారీ విధానం:
1. ముందుగా ఒక వెడల్పాటి పాత్రలో రాగి పిండి, గోధుమ పిండి, ఉప్పు, కారం, వాము, అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక స్పూన్ వేడి నూనె వేయాలి. వీటన్నింటినీ ఒకసారి బాగా కలిపి, ఆపై కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీరు పోస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి.పిండి మరీ మెత్తగా ఉండకూడదు, లేదంటే చిప్స్ మెత్తబడిపోతాయి.
2. కలిపిన పిండిపై తడి గుడ్డ కప్పి సుమారు 15-20 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. దీనివల్ల పిండి సాఫ్ట్‌గా మారి చిప్స్ బాగా వస్తాయి.
3. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని, చపాతీ పీటపై కొద్దిగా పొడి పిండి చల్లి పల్చగా వత్తుకోవాలి. ఎంత పల్చగా వత్తితే చిప్స్ అంత క్రిస్పీగా ఉంటాయి. వత్తుకున్న చపాతీని చాకుతో డైమండ్ లేదా ట్రయాంగిల్ ఆకారంలో కట్ చేసుకోవాలి. చిప్స్ పొంగకుండా ఉండాలంటే ఫోర్క్ స్పూన్‌తో చిన్న చిన్న రంధ్రాలు చేయాలి.
4. డీప్ ఫ్రై: బాణలిలో నూనె వేడి చేసి, మీడియం మంట మీద ఈ చిప్స్‌ను దోరగా వేయించాలి.
హెల్తీ ఆప్షన్: బరువు తగ్గాలనుకునే వారు 180 డిగ్రీల వద్ద ఓవెన్‌లో 10 నిమిషాల పాటు బేక్ చేయవచ్చు లేదా ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించవచ్చు.
ఆరోగ్య ప్రయోజనాలు:
బరువు నియంత్రణ: రాగుల్లోని ఫైబర్ వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. దీని వల్ల ఇతర ఆహార పదార్థాలు అతిగా తినకుండా ఉంటాం.
ఎముకల బలం: రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి తోడ్పడుతుంది.
షుగర్ కంట్రోల్: రాగి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు కూడా ఈ చిప్స్ పరిమితంగా తీసుకోవచ్చు.
బయట దొరికే రసాయనాలు కలిసిన స్నాక్స్ కంటే.. ఇలా ఇంట్లోనే రాగి చిప్స్ చేసుకోవడం ఎంతో ఉత్తమం. ఇవి చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో భద్రపరుచుకుంటే రెండు వారాల వరకు తాజాగా ఉంటాయి. మీ వెయిట్ లాస్ డైట్‌లో ఇదొక రుచికరమైన మార్పు అవుతుంది.