Dinner Recipes Veg: సౌంత్ ఇండియన్ వంటకాలు అనగానే కేవలం ఇడ్లీ, దోశలే కాకుండా అద్భుతమైన రుచులు కలిగిన అనేక కూరలు కూడా గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో చపాతీ లేదా రోటీలతో కలిపి తినేలా ఉండే బాలెకాయి కవిరస, బదనేకాయి హసిరు ఎణ్ణెగాయి, కాకరకాయ మసాలా కూర (కారేల సబ్జీ), చెన్నా సాగు వంటి వంటకాలు ఆరోగ్యంతో పాటు అద్భుతమైన రుచిని అందిస్తాయి. కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన ఈ సంప్రదాయ వంటకాలను ఇంటి దగ్గరే సులభమైన పద్ధతిలో ఎలా తయారు చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.
బాలెకాయి కవిరస (అరటికాయ గ్రేవీ కూర) : బాలెకాయి కవిరస అనేది పచ్చి అరటికాయతో చేసే ఒక రుచికరమైన గ్రేవీ వంటకం. దీని తయారీ కోసం ముందుగా తగినంత పచ్చి అరటికాయలను తొక్క తీసి ముక్కలుగా కోసి ఉడికించుకోవాలి. మరోవైపు వేయించిన శనగపప్పు, ధనియాలు, ఎండుమిర్చి, కొబ్బరి తురుము, కొద్దిగా చింతపండు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. బాణలిలో పోపు వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించిన తర్వాత.. ఉడికించిన అరటికాయ ముక్కలను , రుబ్బిన మసాలా పేస్టును కలపాలి. తగినంత నీరు పోసి గ్రేవీ దగ్గరపడే వరకు ఉడికించాలి. ఈ కూరలో అరటికాయలోని పోషకాలు, మసాలా ఘాటు కలిసి రోటీలతో తింటే చాలా రుచిగా ఉంటుంది.
బదనేకాయి హసిరు ఎణ్ణెగాయి ( మసాలా వంకాయ కూర): వంకాయ ప్రియులకు ఇది ఒక గొప్ప వంటకం. సాధారణంగా చేసే ఎర్రటి నూనె వంకాయ కంటే ఇది భిన్నంగా ఉంటుంది. ఇందులో ‘హసిరు’ అంటే పచ్చదనం, అంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొబ్బరి కలిపి రుబ్బిన పచ్చని మసాలాను ఉపయోగిస్తారు. గుత్తి వంకాయల్లాగా వంకాయలను నాలుగుగా కోసి, అందులో ఈ పచ్చని మసాలా మిశ్రమాన్ని నింపాలి. బాణలిలో కొంచెం నూనె ఎక్కువ వేసి, మసాలా నింపిన వంకాయలను తక్కువ మంట మీద నిదానంగా మగ్గించాలి. వంకాయలు మెత్తబడి నూనె పైకి తేలే వరకు ఉడికిస్తే అద్భుతమైన సువాసనతో కూడిన హసిరు ఎణ్ణెగాయి సిద్ధమవుతుంది. ఇది జొన్న రొట్టెలు లేదా చపాతీల్లోకి అత్యుత్తమ కాంబినేషన్.
కారేల సబ్జీ (కాకరకాయ మసాలా కూర): కాకరకాయ చేదుగా ఉంటుందని చాలామంది ఇష్టపడరు. కానీ ఈ పద్ధతిలో వండితే చేదు తెలియకుండా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా కాకరకాయలను సన్నని చక్రాల్లా కోసి ఉప్పు కలిపి పక్కన పెట్టాలి. దీని వల్ల చేదు తగ్గుతుంది. ఆ తర్వాత వాటిని నూనెలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. బాణలిలో పోపు వేసి ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. అందులో వేయించిన కాకరకాయ ముక్కలు, కొంచెం బెల్లం తురుము, చింతపండు రసం, ధనియాల పొడి, కారం వేసి ఉడికించాలి. బెల్లం, చింతపండు కలయిక కాకరకాయలోని చేదును బ్యాలెన్స్ చేసి, కూరకు కమ్మని రుచిని ఇస్తుంది.
Also Read: బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్ ఆమ్లెట్ తింటున్నారా ? జాగ్రత్త !
చెన్నా సాగు (కాబూలీ శనగల సాగు): రోటీ లేదా పూరీల్లోకి మంచి కాంబినేషన్ ఇది. దీని కోసం కాబూలీ శనగలను రాత్రంతా నానబెట్టి, మెత్తగా ఉడికించుకోవాలి. మసాలా కోసం కొబ్బరి, పచ్చిమిర్చి, లవంగాలు, దాల్చిన చెక్క, వేయించిన శనగపప్పు (పుట్నాలు) కలిపి మిక్సీ పట్టుకోవాలి. బాణలిలో నూనె వేసి పోపు వేసిన తర్వాత ఉల్లిపాయలు, టమాటో ముక్కలు వేసి మగ్గించాలి. ఆ తర్వాత ఉడికించిన శనగలు, రుబ్బిన మసాలా పేస్టు వేసి బాగా కలపాలి. తగినంత ఉప్పు, నీరు పోసి కూర చిక్కబడే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లితే ఎంతో రుచిగా ఉండే చెన్నా సాగు సిద్ధం.