TerraCool Technology: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏసీలు, కూలర్లు లేనిదే క్షణం కూడా గడవడం లేదని పలువురు వాపోతున్నారు. వీటివల్ల కరెంటు బిల్లు కూడా భారీగా వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ ఐఐటీ దిల్లీ పరిశోధకులు ఒక అద్భుతమైన పర్యావరణహిత సాంకేతికతను అందుబాటులోకి తెచ్చారు. అదే ‘టెర్రాకూల్’ టెక్నాలజీ. సాంప్రదాయ మట్టి కళను ఆధునిక ఇంజనీరింగ్‌తో ముడిపెట్టి ఆధునాతన గోడలను రూపొందించారు. ఇవి ఇల్లు, భవనాలను సహజసిద్దంగా చల్లగా ఉంచుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
టెర్రాకూల్ వ్యవస్థ పనితీరు పూర్తిగా ‘బాష్పీభవన శీతలీకరణ’ (Evaporative Cooling) అనే సహజ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటుంది. గోడకు అమర్చిన టెర్రకోట ప్యానెళ్లలోని సన్నని గొట్టాల ద్వారా చాలా తక్కువ పరిమాణంలో నీటిని పంపిస్తారు. టెర్రకోట మట్టికి ఉండే సహజమైన రంధ్రాల వల్ల ఆ నీరు ఇటుక ఉపరితలానికి చేరుకుని గోడను ఎల్లప్పుడూ తడిగా ఉంచుతుంది. బయట వేడి గాలి ఈ తడి గోడను తాకినప్పుడు, గోడపై ఉన్న నీరు ఆ వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఈ ప్రక్రియ వల్ల గోడ ఉష్ణోగ్రత గణనీయంగా తగ్గి బయట ఉండే వేడి లోపలికి ప్రవేశించకుండా కేవలం చల్లటి గాలి మాత్రమే గదిలోకి వస్తుంది.
సాధారణ కాంక్రీట్ గోడలు పగటిపూట ఎండను పీల్చుకుని రాత్రి వేళల్లో ఆ వేడిని ఇంటి లోపలికి విడుదల చేస్తాయి. దీనివల్ల రాత్రి పూట కూడా ఇళ్లు సెగలు గక్కుతుంటాయి. కానీ టెర్రాకూల్ అమర్చిన గోడలు సూర్యరశ్మి నేరుగా కాంక్రీట్‌పై పడకుండా అడ్డుకుంటాయి. పైగా నిరంతరం జరిగే బాష్పీభవన ప్రక్రియ వల్ల గోడ వెలుపలి ఉష్ణోగ్రతను ఏకంగా 10 నుంచి 15 డిగ్రీల సెల్సియస్ వరకు తగ్గించవచ్చని ఐఐటీ దిల్లీ పరిశోధకులు నిరూపించారు. దీనివల్ల ఏసీల అవసరం లేకుండానే ఇళ్లు రోజంతా ఎంతో ఆహ్లాదకరంగా, చల్లగా ఉంటాయి.
ప్రస్తుతం మనం వాడుతున్న ఎయిర్ కండిషనర్లు గదులను చల్లబరిచినా బయటి వాతావరణంలోకి విపరీతమైన వేడిని, గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తున్నాయి. అయితే ఈ టెర్రాకూల్ పూర్తిగా పర్యావరణహితమైనది. దీనికి రసాయనాలు గానీ, ప్రమాదకర గ్యాస్‌లు గానీ అవసరం లేదు. కేవలం నీటి ఆవిరి ద్వారానే చల్లదనాన్ని ఇస్తుంది. పైగా ఇందులో వాడిన నీటిని తిరిగి రీసైకిల్ చేసి వాడుకునేలా క్లోజ్డ్ లూప్ సిస్టమ్‌ను సైతం పరిశోధకులు డిజైన్ చేశారు. కాబట్టి నీటి వృథా కూడా చాలా తక్కువ.
Also Read: విజయ్‌కు బిగ్ షాక్.. త్వరలో స్టాలిన్ మళ్లీ సీఎం.. డీఎంకే ఎమ్మెల్యే జోస్యం!
ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్న ఈ టెర్రకూల్ సాంకేతికత పూర్తిగా అందుబాటులోకి వస్తే మధ్యతరగతి ప్రజలకు ఏసీల కొనుగోలు ఖర్చు, భారీ కరెంట్ బిల్లుల భారం తప్పుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కేవలం నీటిని పంప్ చేయడానికి మాత్రమే చాలా తక్కువ విద్యుత్ అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిని కూడా సోలార్ ప్యానెళ్లకు అనుసంధానిస్తే రూపాయి కరెంట్ బిల్లు లేకుండా ఇళ్లను చల్లబరుచుకోవచ్చని చెబుతున్నారు . భవిష్యత్తులో పర్యావరణ అనుకూల భవనాల నిర్మాణ రంగంలో ఈ ‘టెర్రాకూల్’ సాంకేతికత ఒక విప్లవాత్మక మార్పుగా నిలవనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: BSNL మరో చౌకైన ప్లాన్.. రూ. 397కే 5 నెలల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాల్స్, డేటా!